Atmakur: గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని జగనన్నే సాకారం చేశారు: వైఎస్సార్‌‌సీపీ

Atmakur: ఆత్మకూరులో మేకపాటి క్యాంపు కార్యాలయంలో గాంధీ, శాస్త్రి జయంతులు నిర్వహించారు. గ్రామ స్వరాజ్యాన్ని వైఎస్ జగన్ పాలనలోనే సాకారం చేశారని నేతలు పేర్కొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)
Published on: 2 Oct 2026 6:19 PM IST
Atmakur
X

Atmakur: గాంధీ గ్రామ స్వరాజ్యాన్ని జగనన్నే సాకారం చేశారు: వైఎస్సార్‌‌సీపీ

Atmakur: జాతిపిత మహాత్మా గాంధీ, మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలని వైఎస్సార్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. ఆత్మకూరులోని మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో శుక్రవారం మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రిల జయంతి సందర్భంగా వారి సేవలను స్మరించుకుంటూ, దేశాభివృద్ధి, గ్రామ స్వరాజ్యం, పేదల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం వారు చూపిన మార్గంలో నడవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

తొలుత మహాత్మాగాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి చిత్రపటాలకు వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, పార్టీ రాష్ట్రమున్సిపల్ విభాగ కార్యదర్శి అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు అల్లారెడ్డి ఆనంద్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు నాయకులతో కలసి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షులు డాక్టర్ సీహెచ్ ఆదిశేషయ్య, జిల్లా ఆర్గనైజేషనల్ సెక్రటరి పులిమి రమేష్ రెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి కొండా వెంకటేశ్వర్లు, నియోజకవర్గ లీగల్ సెల్ అధ్యక్షులు నందా ఓబులేసు, మైనారిటి నాయకులు షేక్ రహీం మాట్లాడారు. మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం అంటే కేవలం గ్రామ పంచాయతీల ఏర్పాటు మాత్రమే కాదని, గ్రామాల్లోని ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సేవలు అందుబాటులో ఉండటం, పేదలకు సంక్షేమ ఫలాలు చేరడం, రైతులకు అండగా నిలవడం, మహిళలకు గౌరవం కల్పించడం, గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందడమని పేర్కొన్నారు.

ఈ ఆశయాలకు అనుగుణంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో గ్రామ సచివాలయాలు, వాలంటీర్‌ వ్యవస్థ, రైతు భరోసా కేంద్రాల ద్వారా పాలనను ప్రజల గడప వద్దకు తీసుకెళ్లే విధానానికి ప్రాధాన్యత ఇచ్చారని తెలిపారు.అయితే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గేమ్ చేంజర్లుగా కాకుండా నేమ్ చెంజర్లుగా ఉంటూ మహాత్ముని పేరుతో ఉన్నజాతీయ గ్రామీణ ఉపాధిహామి పథకాన్ని వీబీజీరామ్ జీ పేరు మార్చారని, చంద్రబాబునాయుడు గ్రామ, వార్డు సచివాలయాలను స్వర్ణ సచివాలయాలుగా పేర్లు మార్చడం జరిగిందని, ప్రజలకు అందించే సేవలు, గ్రామాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై చూపాల్సిన శ్రద్ధను పథకాల పేర్ల మార్పుపై చూపుతోందని అన్నారు.

పేర్లు మార్చినంత మాత్రాన ప్రజల జీవితాల్లో మార్పు రాదని, పథకాలకు కొత్త పేర్లు పెట్టడం కంటే వాటి ద్వారా ప్రజలకు అందే ప్రయోజనాలు కొనసాగించడం ముఖ్యమని హితవు పలికారు. మహాత్మా గాంధీ ఆశయాలను గౌరవిస్తున్నామని చెప్పే పాలకులు, ఆ ఆశయాలకు అనుగుణంగా గ్రామీణ ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు. గాంధీజీ కలలుగన్న స్వయం సమృద్ధి గ్రామాలు, పేదలకు గౌరవప్రదమైన జీవనం, సామాజిక న్యాయం, ప్రజల భాగస్వామ్యంతో అభివృద్ధి సాధించడం వంటి లక్ష్యాల సాధనకు ప్రభుత్వాలు కృషి చేయాలన్నారు.

మహాత్ముడు అంటరానితన నిషేదం, అస్పృశ్యత నివారణ అనే అశయాలు, సిద్దాంతాలను చెప్పారని, అయితే రాష్ట్రంలో తెనాలి పట్టణంలో నలుగురు దళిత యువకులను తప్పుడు కేసులలో ఇరికించి అవామనీయంగా, దారుణంగా పోలిసు సిబ్బంది, సీఐ, తమ సిబ్బంది రాజ్యాంగ హక్కులను చట్టాలను ఉల్లంఘించి లాఠీలతో కర్కసంగాకొట్టారని, అయితే కోర్టు వారికి సంబంధం లేదని చెప్పడం జరిగిందని, దళిత యువకులను కొట్టి దానికి ఎవరు బాధ్యత వహిస్తారన్నారు.

మాజీ ప్రధాని లాల్‌ బహదూర్‌ శాస్త్రి దేశానికి అందించిన సేవలను కూడా ఈ సందర్భంగా వైఎస్సార్‌సీపీ నాయకులు గుర్తు చేసుకున్నారు. జై జవాన్‌.. జై కిసాన్‌ అనే నినాదంతో దేశ రక్షణలో సైనికుల పాత్రను, ఆహార భద్రతలో రైతుల ప్రాధాన్యతను ఆయన చాటిచెప్పారని పేర్కొన్నారు. నేటి పాలకులు కూడా రైతుల సంక్షేమానికి, వ్యవసాయ రంగ అభివృద్ధికి, దేశానికి అన్నం పెట్టే అన్నదాతలకు అండగా నిలవాలని అన్నారు.

మహనీయుల జయంతులను పూలమాలలు వేసి నివాళులర్పించే కార్యక్రమాలకే పరిమితం చేయకూడదని, వారు చూపిన మార్గంలో నడుస్తూ ప్రజలకు మేలు చేసే విధానాలను అమలు చేయాలని వైఎస్సార్‌సీపీ నాయకులు స్పష్టం చేశారు. మహాత్మా గాంధీ, లాల్‌ బహదూర్‌ శాస్త్రి ఆశయాలను భావితరాలకు అందించడంతో పాటు, గ్రామీణాభివృద్ధి, పేదల సంక్షేమం, సామాజిక సమానత్వం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ఉపాధ్యక్షుడు ఆండ్రా సుబ్బారెడ్డి, గడ్డం శ్రీనివాసులరెడ్డి, బత్తిన నారాయణరెడ్డి, జెట్టి కృష్ణారెడ్డి, జమ్మల సుబ్బారెడ్డి, ముజీబ్, కొండా చిన వెంకటేశ్వర్లు, రమేష్ రెడ్డి, జనార్థన్ రెడ్డి, తోడేటి అశోక్, కొండలరావు, నందవరం ప్రతాప్, మస్తాన్ వళీ, ఖాజామస్తాన్, యాకసిరి మల్లంకొండయ్య, వేము బాల చెన్నయ్య, కొండలరావు, శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

TS Murthy, Atmakuru(Nellore)

TS Murthy, Atmakuru(Nellore)