Kaligiri: కలిగిరి కేజీబీవీలో భోజనంలో పురుగులు.. తల్లిదండ్రుల ఆందోళన
Kaligiri: నెల్లూరు జిల్లా కలిగిరి కేజీబీవీలో భోజనంలో పురుగులు రావడంతో పాటు ప్రశ్నించిన విద్యార్థినులను సిబ్బంది బెదిరిస్తున్నారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు.
Kaligiri: కలిగిరి కేజీబీవీలో భోజనంలో పురుగులు.. తల్లిదండ్రుల ఆందోళన
కలిగిరి : నెల్లూరు జిల్లా కలిగిరి మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయంలో విద్యార్థినులకు అందిస్తున్న భోజనంలో పురుగులు కనిపిస్తున్నాయని తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. భోజనంలో పురుగులు వస్తున్న విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో కొందరు ఉపాధ్యాయురాళ్లు విద్యార్థినులను బెదిరిస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తల్లిదండ్రుల కథనం ప్రకారం.. సుమారు పది రోజుల క్రితం మధ్యాహ్నం విద్యార్థినులకు అందించిన భోజనంలో పురుగులు కనిపించాయని,తాజాగా గురువారం ఉదయం వడ్డించిన ఉప్మాలోనూ పురుగులు ఉన్నట్లు విద్యార్థినులు గుర్తించారని తెలిపారు.దీంతో విద్యార్థినులు ఆందోళనకు గురైనట్లు పేర్కొన్నారు.ఈ విషయాన్ని విద్యార్థినుల తల్లిదండ్రులు పాఠశాల ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.
అయితే సమస్యను పరిష్కరించాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ,తమతో బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. పాఠశాలలో జరుగుతున్న విషయాలను బయటకు చెబితే విద్యార్థినులను పాఠశాల నుంచి తీసి పంపిస్తామని కొందరు ఉపాధ్యాయురాళ్లు హెచ్చరిస్తున్నారని వారు పేర్కొన్నారు.
విద్యార్థినుల ఆరోగ్యానికి సంబంధించిన అంశం కావడంతో ఈ వ్యవహారంపై జిల్లా ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి సమగ్ర విచారణ చేపట్టాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.పాఠశాలలో ఆహార నాణ్యతను పరిశీలించి, విద్యార్థినులకు పరిశుభ్రమైన, నాణ్యమైన భోజనం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.




