Vinjamuru: వింజమూరు: సచివాలయం–1కు దారి ఏదీ? ప్రజల అవస్థలు

Vinjamuru: వింజమూరు సచివాలయం-1 మార్గంలో నూడా డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో రోడ్డు బురదమయమై ప్రజలు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

V. Kamaiah, Vinjamuru
Published on: 19 Sept 2026 8:54 PM IST
Vinjamuru
X

Vinjamuru: వింజమూరు: సచివాలయం–1కు దారి ఏదీ? ప్రజల అవస్థలు

వింజమూరు: నూడా నిధులతో చేపట్టిన డ్రైనేజీ పనులు అర్ధాంతరంగా నిలిచిపోవడంతో వింజమూరు పట్టణంలోని సచివాలయం–1కు వెళ్లే మార్గం ప్రజలకు నరకయాతనగా మారింది. డ్రైనేజీ నిర్మాణం కోసం రహదారిని తవ్విన నెలలు గడుస్తున్న అధికారులు పనులను పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం ఆ మార్గంలో రాకపోకలు సాగించడం చాలా కష్టంగా మారింది.

సచివాలయం–1లో ఈ మధ్య కాలంలో సర్ ప్రోగ్రాంలో మరియు పింఛన్ దరఖాస్తు చేసేందుకు వివిధ ప్రభుత్వ సేవల కోసం ప్రతిరోజూ ప్రజలు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. అయితే సచివాలయానికి వెళ్లే ప్రధాన మార్గంలోనే డ్రైనేజీ పనులు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ద్విచక్ర వాహనదారులు, వృద్ధులు, చిన్నపిల్లలు ఈ మార్గంలో వెళ్లేందుకు అవస్థలు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు.

ఓపెన్ డ్రైన్‌గా మారిన ప్రాంతం

డ్రైనేజీ పనులు మధ్యలో నిలిచిపోవడంతో తవ్విన ప్రాంతం ఓపెన్ డ్రైన్‌గా మారింది. పలుచోట్ల మురుగునీరు నిలిచిపోవడంతో దుర్వాసన వెదజల్లుతోంది. చెత్తాచెదారం పేరుకుపోవడంతో పరిసరాల్లో పారిశుధ్య సమస్య కూడా తలెత్తుతోంది. దీంతో సచివాలయానికి వచ్చే ప్రజలతో పాటు స్థానిక నివాసులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

పనులు ఎప్పుడు పూర్తవుతాయి?

అభివృద్ధి పనుల పేరుతో రహదారిని తవ్వి పనులను మధ్యలోనే నిలిపివేస్తే ప్రజలు ఎలా రాకపోకలు సాగించాలంటూ స్థానికులు ప్రశ్నిస్తున్నారు.పనులు ప్రారంభించినప్పుడు ఉన్న వేగం ప్రస్తుతం కనిపించడం లేదని, సంబంధిత అధికారులు సమస్యను పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ పనులను త్వరితగతిన పూర్తి చేసి,రహదారిని పునరుద్ధరించడంతో పాటు నిలిచిపోయిన మురుగునీటిని తొలగించి పారిశుధ్య చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్న ఈ సమస్యకు అధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

V. Kamaiah, Vinjamuru

V. Kamaiah, Vinjamuru