Gudur: డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
Gudur: గూడూరు డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్‌డీవో అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ పారిశుధ్య కార్మికులను సన్మానించారు.
Gudur: డీఆర్‌డబ్ల్యూ కళాశాలలో ఘనంగా స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం
గూడూరు: నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని ప్రతిష్టాత్మక DRW కళాశాలలో పురపాలక సంఘం ఆధ్వర్యంలో స్వచ్ఛతా హి సేవా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని నిర్వహించిన ఈ కార్యక్రమానికి RDO అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున రావు హాజరయ్యారు.
కార్యక్రమం ప్రారంభంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన చిత్రపటానికి అధికారులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. గాంధీజీ చూపిన స్వచ్ఛతా మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ఆకాంక్షించారు.
అనంతరం పట్టణ పరిశుభ్రత కోసం అహర్నిశలు కష్టపడుతున్న పారిశుధ్య కార్మికులను వేదికపైకి ఆహ్వానించారు. గూడూరు RDO అరుణకుమారి, మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున రావు చేతుల మీదుగా వారికి శాలువాలు కప్పి, పూలమాలలు వేసి ఘనంగా సన్మానించారు.
వారి సేవలను అధికారులు ప్రత్యేకంగా అభినందించారు.ఈ సందర్భంగా RDO అరుణకుమారి మాట్లాడుతూ స్వచ్ఛతే నిజమైన సేవ అని, ప్రతి పౌరుడు తన ఇంటి పరిసరాలను, తన వీధిని శుభ్రంగా ఉంచుకుంటేనే స్వచ్ఛ భారత్ సాధ్యమవుతుందని అన్నారు.
మహాత్మా గాంధీ కలలు కన్న స్వచ్ఛ భారత్ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో DRW కళాశాల ప్రిన్సిపాల్ హనుమంతరావు, టీడీపీ నాయకులు కిరణ్ కుమార్, బిల్లు చెంచు రామయ్య, రహీం, మట్టం శ్రావణి, మున్సిపల్ సిబ్బంది, కళాశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.




