Gudur: గూడూరు మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్!
Gudur: గూడూరు మున్సిపాలిటీలో గ్రామాల విలీనానికి హైకోర్టు గ్రీన్ సిగ్నల్. ఎన్నికలకు మార్గం సుగమం కావడంతో మారిన రాజకీయ ముఖచిత్రం.
Gudur: గూడూరు మున్సిపల్ ఎన్నికలకు లైన్ క్లియర్!
Gudur: తిరుపతి జిల్లా గూడూరు మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. చుట్టుపక్కల గ్రామాల విలీనంపై కొనసాగుతున్న న్యాయపోరాటానికి తెరపడటంతో గూడూరు మున్సిపల్ పోరుకు లైన్ క్లియర్ అయింది. అయితే హైకోర్టు తీర్పు అధికార పార్టీకి ఊరటనిచ్చినా, కొత్తగా విలీనమైన గ్రామాల ఓట్లు గూడూరు రాజకీయ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు.గూడూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణపై నెలకొన్న నీలినీడలు తొలగిపోయాయి.
గూడూరు పరిధిని విస్తరించే క్రమంలో నెల్లటూరు, చెన్నూరు, దివిపాలెం, చిల్లకూరు, పోటు పాలెం, పూరిటిపాలెం గ్రామాలను మున్సిపాలిటీలో విలీనం చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఈ విలీనాన్ని వ్యతిరేకిస్తూ ముఖ్యంగా నెల్లటూరు, చెన్నూరు, చిల్లకూరు గ్రామాల ప్రజలు 'మాకొద్దు ఈ విలీనం' అంటూ హైకోర్టును ఆశ్రయించారు.
వ్యవసాయమే జీవనాధారంగా బతుకుతున్న తమకు మున్సిపల్ లో కలిస్తే అధిక పన్నుల భారం పడుతుందని, ఉపాధి హామీ పనులు కోల్పోతామని, తమ పొలాలకు, ఇళ్లకు నష్టం జరుగుతుందని వారు పిటిషన్లలో పేర్కొన్నారు. పాలకులు, ప్రజా ప్రతినిధులు తమ గోడు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.అయితే ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు, గ్రామాల విలీనాన్ని సమర్థిస్తూ పిటిషన్లను భేషరతుగా కొట్టివేసింది.
దీంతో గూడూరు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది.గూడూరు పురపాలక సంఘం కార్యాలయం కారులు రంగంలోకి దిగి, విలీన గ్రామాలతో కలిపి 34 వార్డులు, ఒక్కో వార్డుకి రెండు వేలకు పైగా ఓట్లతో ఓటర్ల జాబితాలను సిద్ధం చేశారు. అంటే గతంలో ఉన్న వార్డుల కంటే ఇప్పుడు ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది.కొత్తగా చేరిన ఈ గ్రామాల్లో సుమారు 20 వేలకు పైగా ఓట్లు ఉన్నట్లు అంచనా. ఈ ఓట్లే ఇప్పుడు గూడూరు మున్సిపల్ పీఠాన్ని డిసైడ్ చేయబోతున్నాయి.హైకోర్టు తీర్పుతో ఎన్నికలకు లైన్ క్లియర్
కానీ తమ అభీష్టానికి వ్యతిరేకంగా, తమ ఇష్టానికి వ్యతిరేకంగా బలవంతంగా విలీనం చేశారన్న భావన ఆ గ్రామాల ప్రజల్లో బలంగా ఉంది. స్థానిక ప్రజా ప్రతినిధి తలచుకుంటే ఈ విలీన ప్రక్రియను రద్దు చేయించే అవకాశం ఉన్నా, చేయలేదన్న ఆగ్రహం ఆ గ్రామాల ప్రజల్లో వ్యక్తమవుతోంది. తమకు అండగా నిలబడలేదన్న అసంతృప్తి ఆ గ్రామాల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
దీంతో ఈసారి విలీన గ్రామాల ఓటర్లు ఎవరికి అండగా నిలుస్తారు, ఎవరిని గెలిపిస్తారు అనేది గూడూరు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. 34 వార్డుల్లో గెలుపోటములను ఈ కొత్త ఓటర్లే శాసించబోతున్నారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి గూడూరు మున్సిపల్ పోరు ఈసారి నువ్వా నేనా అన్నట్లుగా ఉండబోతుందా.




