Podili: పొదిలి ఆర్టీసీ డిపోలో విషాదం మహిళా కండక్టర్ ఆకస్మిక మృతి!

Podili: పొదిలి ఆర్టీసీ డిపో మహిళా కండక్టర్ లింగాల నాగమల్లేశ్వరి ఆకస్మిక మృతి. విధులు ముగించుకుని తిరిగొచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలిన వైనం.

MADARVALI, MARKAPURAM
Published on: 19 Oct 2026 6:47 PM IST
Podili
X

Podili: పొదిలి ఆర్టీసీ డిపోలో విషాదం మహిళా కండక్టర్ ఆకస్మిక మృతి!

Podili: మార్కాపురం జిల్లా పొదిలి ఆర్టీసీ డిపోలో మహిళా కండక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న లింగాల నాగమల్లేశ్వరి ఆకస్మికంగా మృతి చెందడంతో ఆర్టీసీ సిబ్బందిలో విషాదం నెలకొంది. విధులు ముగించుకుని బస్టాండ్‌కు చేరుకున్న ఆమె ఒక్కసారిగా కుప్పకూలి మృత్యువాత పడిన ఘటన అందరినీ కలచివేసింది.

వివరాల్లోకి వెళితే.. పొదిలి ఆర్టీసీ డిపోకు చెందిన మహిళా కండక్టర్‌ లింగాల నాగమల్లేశ్వరి సోమవారం కొండేపి డ్యూటీలో విధులు నిర్వహించారు. విధులు ముగించుకుని కొండేపి నుంచి పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌కు చేరుకున్నారు. అనంతరం సెల్‌ఫోన్‌ రీఛార్జ్‌ చేయించుకునేందుకు బస్టాండ్‌ సమీపంలోని ఓ సెల్‌ఫోన్‌ దుకాణానికి వెళ్లారు. అక్కడే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు.

ఈ విషయాన్ని గమనించిన స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది వెంటనే స్పందించి ఆమెను వైద్యశాలకు తరలించారు. అయితే, అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించినట్లు తెలిసింది. గుండెపోటుతో ఆమె మరణించినట్లు సమాచారం.

ఉదయం నుంచి విధులను చక్కగా నిర్వహించిన నాగమల్లేశ్వరి ఇలా ఆకస్మికంగా మృతి చెందడం తోటి సిబ్బందిని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. విధి నిర్వహణలో ఉన్న సహోద్యోగిని కోల్పోవడం బాధాకరమని వారు ఆవేదన వ్యక్తం చేశారు.

ఈ ఘటనతో పొదిలి ఆర్టీసీ బస్టాండ్‌ పరిసరాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. నాగమల్లేశ్వరి మృతి పట్ల తోటి సిబ్బంది విచారం వ్యక్తం చేశారు.

MADARVALI, MARKAPURAM

MADARVALI, MARKAPURAM