Sullurpeta: అభివృద్ధి పనులు పైనుంచి ఊడిపడవు: ఎమ్మెల్యే విజయశ్రీ!

Sullurpeta: వైకాపా నాయకుల ఆరోపణల్లో నిజం లేదని, తనపై, కుటుంబంపై నిందలు వేస్తే ధైర్యముంటే ఆధారాలతో నిరూపించాలని సూళ్ళూరుపేట ఎమ్మెల్యే విజయశ్రీ సవాల్ చేశారు.

KKV Sudhakar, Sullurupeta
Published on: 18 Sept 2026 2:13 PM IST
Sullurpeta
X

Sullurpeta: అభివృద్ధి పనులు పైనుంచి ఊడిపడవు: ఎమ్మెల్యే విజయశ్రీ!

Sullurpeta: తనపై, తన కుటుంబ సభ్యులపై వైకాపా నాయకులు చేస్తోన్న ఆరోపణల్లో ఎటువంటి నిజం లేదని, ధైర్యముంటే ఆధారాలతో ముందుకు వచ్చి నిరూపించాలని సూళ్ళూరుపేట శాసనసభ్యురాలు డా.నెలవల విజయశ్రీ సవాల్ విసిరారు. గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. గతంలోనూ, నిన్నటి ప్రెస్ మీట్‌లోనూ తాను చెప్పిన మాటలకే కట్టుబడి ఉన్నానని స్పష్టం చేశారు. ఎవరైనా ఆధారాలు చూపిస్తే ఆ రోజే మళ్లీ ప్రెస్ ముందుకు వచ్చి ప్రతి ప్రశ్నకు స్పష్టమైన సమాధానం చెప్తానని తేల్చి చెప్పారు. తన కుటుంబ సభ్యులు స్వశక్తితో, శ్రమతో కాంట్రాక్ట్ పనులు చేసుకుంటూ జీవిస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.

మావాళ్లు కష్టపడి సంపాదించుకుంటున్నారు తప్ప ఎవరి దగ్గరా రూపాయి దోచుకోవడం లేదని, వైకాపా హయాంలోలాగా ఇసుక, గ్రావెల్ అక్రమ రవాణా చేయడం లేదా చెన్నైకి తరలించే దందాలు మేం చేయడం లేదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో కొందరు నాయకులు చేసిన అక్రమాలు, వసూళ్ల చిట్టా అంతా తన వద్ద ఉందన్నారు. హార్న్స్ అమ్మడం, ఎమ్మెల్యేల పేరిట లంచాలు వసూలు చేయడం లాంటి నోటితో చెప్పుకోలేని పనులు గతంలో జరిగాయని, చాలామంది బాధితులు తనను కలిసి ఈ విషయాలు చెప్పారన్నారు.

తాను సాధారణంగా విమర్శలను పక్కన పెట్టి ముందుకు వెళ్తానని, అయితే ప్రత్యర్థులు హద్దులు దాటి ప్రవర్తిస్తే ఆ వివరాలన్నీ ఆధారాలతో సహా బయటపెడతానని హెచ్చరించారు. కూటమి ప్రభుత్వం వచ్చాకే నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, ప్రపోజల్స్ సిద్ధం చేసి సీఎంతో మాట్లాడి నిధులు సాధిస్తేనే అభివృద్ధి సాధ్యమవుతుందని, రోడ్లు ఆటోమేటిక్‌గా పైనుంచి ఊడిపడవని వైకాపా నాయకులు తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు.

చిన్న చిన్న నామినేటెడ్ పనులను కష్టపడే పార్టీ కార్యకర్తలకే కేటాయిస్తున్నామని, మిగిలిన టెండర్ పనులను సబ్-కాంట్రాక్ట్ ద్వారా చట్టబద్ధంగా చేసుకుంటున్నారని పారదర్శకతను వివరించారు. ఎలక్షన్ ప్రచారంలోనూ, సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలోనూ ప్రజలకు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేరుస్తున్నామని పేర్కొన్నారు.

ఓజిలి మండలంలో మహిళల విన్నపం మేరకు ₹1.90 కోట్లతో రహదారి నిర్మాణం పూర్తి చేశామని చెప్పారు. గర్భిణులు ఆసుపత్రికి వెళ్లేందుకు పడుతున్న ఇబ్బందులను చూసి చిగురుపాడు రోడ్డు వేయించామని, కమ్మవారిపాలెం రోడ్డు పనులు కూడా కాంట్రాక్టర్ ఆరోగ్య సమస్యల వల్ల కొంత ఆలస్యమైనా త్వరలోనే పూర్తి చేసి ఓపెన్ చేస్తామని వివరించారు.

విమర్శలకు బాధ్యతాయుతమైన పాలనతోనే సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు సూచించారని చెప్పారు. గత పాలకులు చేసిన అక్రమాలు, స్కామ్‌లు నియోజకవర్గ ప్రజలకు బాగా తెలుసునని, అందుకే గతంలో 63 వేల భారీ మెజారిటీతో గెలిచిన నాయకుడిని కూడా పక్కన పెట్టి, ప్రజలు కూటమికి పట్టంగట్టి నన్ను గెలిపించారని తెలిపారు. రాష్ట్ర ప్రజలు సరైన తీర్పు ఇవ్వడం వల్లే వైకాపా 151 సీట్ల నుంచి 11 సీట్లకు దారుణంగా పడిపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా నిరాధారమైన ఆరోపణలు మానకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

KKV Sudhakar, Sullurupeta

KKV Sudhakar, Sullurupeta