Nellore: నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ!

Nellore: నెల్లూరులో కాంగ్రెస్ భారీ నిరసన ర్యాలీ. సీఈసి జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని, స్థానిక ఎన్నికల్లో ఆన్లైన్ నామినేషన్లు కోరుతూ ధర్నా.

A Praveen, Nellore
Published on: 1 Oct 2026 9:18 AM IST
Nellore
X

Nellore: నెల్లూరులో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ!

Nellore: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ (AICC) పిలుపు మేరకు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్. షర్మిల గారి ఆదేశాల మేరకు కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు నారపరెడ్డి. కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, భారత రాజ్యాంగ పరిరక్షణ – ఎన్నికల కమిషన్ స్వతంత్రత: భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 324 ప్రకారం స్వేచ్ఛాయుతమైన, నిష్పక్షపాతమైన ఎన్నికలు నిర్వహించడానికి ఎన్నికల కమిషన్‌కు స్వయంప్రతిపత్తి కల్పించబడింది. అయితే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎన్నికల కమిషన్ స్వతంత్రతను హరించివేస్తోందని నేతలు ఆరోపించారు.

సుప్రీంకోర్టు తీర్పును తుంగలో తొక్కడం: ఎన్నికల కమిషనర్ల నియామకంపై భారత ప్రధాన న్యాయమూర్తి (CJI), ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నేతలతో కూడిన కమిటీ ఉండాలని గతంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పునిచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం సీజేఐని తొలగించి, అధికార పక్ష మంత్రి ఉండేలా ఆర్డినెన్స్/చట్టం చేసి తమకు అనుకూలమైన వ్యక్తులను నియమించుకుంటోందని విమర్శించారు.

చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్: తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రస్తుత ఎన్నికల కమిషన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ తక్షణమే రాజీనామా చేయాలని, ఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలపై న్యాయ విచారణ (Judicial Inquiry) జరపాలని డిమాండ్ చేశారు.

13 కోట్ల ఓట్ల తొలగింపు & ఓటర్ల జాబితా తారుమారు:

ఓట్ల తొలగింపుపై శ్వేతపత్రం: దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో సుమారు 13 కోట్ల మంది పౌరుల ఓట్లను తొలగించారని, ఓటర్ల జాబితాలను రాజకీయ లబ్ధి కోసం తారుమారు చేశారని ఆరోపించారు.

కోర్టు ఆదేశాల ధిక్కరణ: గోవా తదితర రాష్ట్రాల్లో హైకోర్టులు ఆదేశించినప్పటికీ అర్హులైన వారి పేర్లను చేర్చకుండా సాఫ్ట్‌వేర్ సాకులు చెప్పడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని మండిపడ్డారు. తొలగించిన ప్రతి ఓటుకు సంబంధించిన లెక్కలను దేశ ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆన్‌లైన్ నామినేషన్ల సదుపాయం కల్పించాలి:

గతంలో YSR కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్ష అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేసి, బలవంతపు ఏకగ్రీవాలు చేసుకున్నారని గుర్తుచేశారు.

రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో (ఎంపీటీసీ, జెడ్పీటీసీ, సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు) అభ్యర్థులు నామినేషన్ భౌతికంగా మాత్రమే కాకుండా, ఆన్‌లైన్ ద్వారా కూడా నామినేషన్ పత్రాలు సమర్పించే వెసులుబాటు కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను, జిల్లా కలెక్టర్‌ను డిమాండ్ చేశారు.

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు – నోట్ల రద్దు, యూపీఐ ఛార్జీలు, ఇంధన ధరల భారం:

విదేశాల్లోని స్విస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని తీసుకొచ్చి పేదల ఖాతాల్లో రూ. 15 లక్షలు వేస్తామని చెప్పిన ప్రధాని మోదీ, ఆ తర్వాత నోట్ల రద్దు పేరుతో ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసి సాధించిందేమీ లేదని దుయ్యబట్టారు. రూ. 15.41 లక్షల కోట్ల రద్దయిన కరెన్సీలో 99.7% నోట్లు తిరిగి బ్యాంకులకు చేరినట్లు ఆర్బీఐ స్వయంగా స్పష్టం చేసిందని పేర్కొన్నారు. నోట్లు రద్దుతో ఫోన్ పే, పే టి యం, గూగుల్ పే లాంటి సంస్థలు బాగుపడ్డాయి అని ఎద్దేవా చేశారు.

కాంగ్రెస్ హయాంలో మన్మోహన్ సింగ్ గారి ఆధ్వర్యంలో NPCI, ఆధార్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలు ఏర్పడ్డాయని, ఇప్పుడు యూపీఐ సేవలు రూ.2,000 పైబడిన లావాదేవీలకు 40 నుంచి 300 రూపాయల వరకు ఛార్జీలు విధించి సామాన్యులపై భారం మోపుతున్నారని విమర్శించారు.

కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అంతర్జాతీయ మార్కెట్లో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 104 డాలర్లున్నా దేశంలో పెట్రోల్ రూ. 70 లోపు అందించామని, ప్రస్తుతం ముడిచమురు ధరలు ఒక దశలో భారీగా తగ్గినా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించకుండా ప్రజలను దోచుకున్నారని విమర్శించారు.

"పల్లె పండుగ" కాదు "పల్లె దండగ":

చంద్రబాబు గారు నిన్నటి రోజున జిల్లా పర్యటనలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారితో కలిసి పల్లె పండుగ అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ తరఫున చంద్రబాబు గారిని ప్రశ్నిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGS) నిబంధనల ప్రకారం 90% కేంద్ర నిధులు, 10% రాష్ట్ర నిధులు కేటాయించాల్సి ఉండగా, ప్రస్తుతం బిజెపి తీసుకొచ్చిన కొత్త చట్టం వల్ల 50:50 నిష్పత్తికి తెచ్చి రాష్ట్ర ఖజానాపై దాదాపు రూ. 5,000 కోట్లకు పైగా భారం మోపారని ఆరోపించారు.

పల్లె పండుగ మూడు దశల్లో ఖర్చు చేసిన మొత్తం, రాష్ట్రంలోని దాదాపు 13,800 పైచిలుకు పంచాయతీలకు ప్రతి పంచాయతీకి కనీసం కోటి రూపాయల పైగా నిధులు రావాల్సి ఉంటుందని పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల లెక్కల ప్రకారం అలా జరగడం లేదు. ఉదాహరణకు నెల్లూరు జిల్లాలోని మనుబోలు మండలానికి ఫేజ్-1లో రూ.1 కోటి, ఫేజ్-2లో రూ.1 కోటి, ఫేజ్-3లో రూ.2 కోట్లు మొత్తంగా ఈ మండలానికి రూ. 4 కోట్లు మాత్రమే కేటాయిస్తున్నారని, మండలంలోని 20 గ్రామాలకు ఇది ఏ మూలకూ చాలదని నిలదీశారు.

గ్రామాలు బాగుపడకపోయినా ప్రజాధనంతో పాలకులు ప్రచార ఆర్భాటాలతో ప్రజల సొమ్ముతో పండగలు చేసుకుంటున్నారని, ఏ గ్రామానికి ఎన్ని నిధులు ఇచ్చారు, ఎన్ని పనులు పూర్తి చేశారనే అంశంపై వివరాలు ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు.

ప్రజాస్వామ్య పరిరక్షణ బాధ్యత ప్రతి పౌరుడిదీ:

ఎన్నికల వ్యవస్థను, రాజ్యాంగ సంస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంటే చూస్తూ ఊరుకునేది లేదని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒకలా అధికారంలోకి వచ్చాక మరోలా వ్యవహరించే ప్రాంతీయ పార్టీల ద్వంద్వ వైఖరిని ప్రజలు గమనించాలని కోరారు. ప్రజాస్వామ్య, రాజ్యాంగ పరిరక్షణ కోసం కాంగ్రెస్ పార్టీ రాజీలేని పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.

ఈ భారీ నిరసన ర్యాలీ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులకు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు మీడియా మిత్రులకు పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేశారు.

పై కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నారపరెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి తో పాటు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకురాలు డాక్టర్ యశోదర, సిటీ ప్రెసిడెంట్ అల్లాబక్షు పీసీసీ సభ్యులు పంట శ్రీనివాసులు రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు, మహిళా కాంగ్రెస్, NSUI నాయకులు, యూత్ కాంగ్రెస్, సేవాదళ్ మరియు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది.

A Praveen, Nellore

A Praveen, Nellore