Nellore: వర్చువల్‌గా పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు!

Nellore: నెల్లూరు సర్వేపల్లి కాలువ కట్టపై 60 ఏళ్లుగా నివసిస్తున్న పేదలకు సీఎం చంద్రబాబు వర్చువల్‌గా శాశ్వత ఇంటి పట్టాలు పంపిణీ చేశారు.

A Praveen, Nellore
Published on: 11 Oct 2026 11:11 PM IST
Nellore
X

Nellore: వర్చువల్‌గా పట్టాలు పంపిణీ చేసిన సీఎం చంద్రబాబు!

నెల్లూరు: నెల్లూరు నగరంలోని సర్వేపల్లి కాలువ కట్టపై సుమారు ఆరు దశాబ్దాలుగా నివసిస్తూ శాశ్వత ఇంటి పట్టాల కోసం ఎదురుచూస్తున్న పేద కుటుంబాల నిరీక్షణకు తెరదించుతూ రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ ప్రత్యేక చొరవతో రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన లబ్ధిదారులకు ఇంటి పట్టాలను పంపిణీ చేసింది.

ఆదివారం సాయంత్రం అమరావతిలోని క్యాంపు కార్యాలయం నుంచి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా పట్టాలను లబ్ధిదారులకు అందజేసి అభినందనలు తెలిపారు. 939 మంది లబ్ధిదారులకు 22.31 ఎకరాల భూమికి సంబంధించి పట్టాలను పంపిణీ చేశారు.

నెల్లూరు నగరంలోని పూలేబొమ్మ సెంటర్ వద్ద నిర్వహించిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ, కలెక్టర్ హిమాన్షు శుక్ల, నెల్లూరు నగర మేయర్ దేవరకొండ సుజాత, నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ నందన్ స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా లబ్ధిదారులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ, ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు నిర్మించుకుని దశాబ్దాలుగా నివసిస్తున్న పేదలకు శాశ్వత హక్కులు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. పేద కుటుంబాలకు భద్రత, ఆత్మగౌరవంతో పాటు ఆస్తి కల్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. నెల్లూరు నగరంలో వచ్చే సంక్రాంతి నాటికి మరో 4,000 పేద కుటుంబాలకు ఇంటి పట్టాలు అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా పేదలకు శాశ్వత ఇంటి పట్టాలు అందించే ప్రక్రియను ఉద్యమంలా చేపడుతున్నామని పేర్కొన్నారు.

పేదల సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మౌలిక వసతుల కల్పన, తాగునీటి కనెక్షన్లు, గృహ నిర్మాణం, సంక్షేమ పథకాల అమలుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించి ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడమే లక్ష్యమని చెప్పారు.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ మాట్లాడుతూ నెల్లూరు నగరంలోని సర్వేపల్లి, జాఫర్ సాహెబ్ కాలువల గట్లపై మూడు తరాలుగా నివసిస్తున్న కుటుంబాలతో పట్టాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సీఎంకు వివరించారు. గతంలో ఇచ్చిన పత్రాలు తమకు పూర్తి స్థాయి హక్కులు కల్పించలేదని, బ్యాంకు రుణాలు పొందడంలోనూ ఇబ్బందులు ఎదురయ్యాయని బాధితులు తన దృష్టికి తీసుకువచ్చినట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మున్సిపల్, రెవెన్యూ అధికారులతో క్షేత్రస్థాయిలో చర్చించి, అర్హులను గుర్తించి కేబినెట్ ఆమోదంతో శాశ్వత పట్టాల పంపిణీకి చర్యలు తీసుకున్నట్లు చెప్పారు.

అలాగే నేడు సర్వేపల్లి కాలువకట్టలపై నివసిస్తున్న ప్రజలు గత 60 ఏళ్లుగా ఎదుర్కొంటున్న ఇంటి పట్టాల సమస్యకు శాశ్వత పరిష్కారం లభించిందని మంత్రి నారాయణ తెలిపారు. అర్హులైన 1,215 మంది లబ్ధిదారులకు శాశ్వత ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. సర్వేపల్లి కాలువకట్టలపై నివసిస్తున్న ప్రజలు ఇళ్ల పట్టాలు లేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటూ, తమకు శాశ్వత పట్టాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారని మంత్రి తెలిపారు. వారి సమస్యను పరిష్కరించేందుకు తాను రెండుసార్లు అధికారులతో కలిసి ఆయా ప్రాంతాల్లో పర్యటించి, క్షేత్రస్థాయిలో పరిస్థితులను అధ్యయనం చేసినట్లు వివరించారు. అన్ని శాఖల అధికారులను సమన్వయపరిచి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకున్నామని, కేబినెట్‌లో ప్రతిపాదనకు ఆమోదం పొందిన అనంతరం 1,215 మందికి శాశ్వత ఇంటి పట్టాల పంపిణీకి మార్గం సుగమమైందని పేర్కొన్నారు.

దశాబ్దాలుగా పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమస్యకు శాశ్వత పరిష్కారం లభించడంతో లబ్ధిదారుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయని మంత్రి అన్నారు. గత ఏడాది భగత్ సింగ్ కాలనీలో 1,407 మందికి శాశ్వత ఇంటి పట్టాలు అందజేసినట్లు తెలిపారు.

అదేవిధంగా జాఫర్ సాహెబ్ కాలువకట్ట, జాకీర్ హుస్సేన్ నగర్ ప్రాంతాల్లో నివసిస్తున్న అర్హులైన వారికి కూడా త్వరలో ఇంటి పట్టాలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహకారంతో నెల్లూరు నగరంలో మరో 4 వేల మందికి ఇంటి పట్టాలు అందించేందుకు కృషి చేస్తానని తెలిపారు.

జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా మాట్లాడుతూ, సర్వేపల్లి కాలువ కట్టపై సుమారు 60 సంవత్సరాలుగా నివసిస్తున్న పేద కుటుంబాలకు శాశ్వత ఇంటి పట్టాలు అందిస్తున్నట్లు తెలిపారు. భూ అక్రమాలు, ద్వంద్వ రిజిస్ట్రేషన్లకు అవకాశం లేకుండా రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న బ్లాక్‌చైన్ విధానాన్ని వినియోగించి పట్టాల పంపిణీ ప్రక్రియలో తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు వివరించారు. నెల్లూరు నగరంలోని భగత్ సింగ్ కాలనీ, సర్వేపల్లి కాలువ కట్ట ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు 2,600 కుటుంబాలకు పట్టాలు అందించినట్లు ముఖ్యమంత్రికి వివరించారు. జాఫర్ సాహెబ్ కాలువ, సర్వేపల్లి కాలువ కట్ట ప్రాంతాల్లో మరో 4,000 మంది నిరుపేదలకు పట్టాలు అందించాల్సి ఉందని, నెల రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

అనంతరం పలువురు లబ్ధిదారులు ముఖ్యమంత్రితో వర్చువల్‌గా మాట్లాడి, తమకు శాశ్వత ఇంటి పట్టాలు అందడంపై సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి పొంగూరు నారాయణ చొరవతో తమ దీర్ఘకాలిక సమస్య పరిష్కారమైందని పేర్కొంటూ ముఖ్యమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా పొందుతున్న ప్రయోజనాలను కూడా ముఖ్యమంత్రితో పంచుకున్నారు.

అనంతరం ముఖ్యమంత్రి సమక్షంలో మంత్రి పొంగూరు నారాయణ దంపతులు, జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా లబ్ధిదారులకు పసుపు, కుంకుమ, చీరతో పాటు ఇంటి పట్టాలను అందజేశారు. దశాబ్దాల నిరీక్షణ అనంతరం ఇంటి పట్టాలు అందడంతో లబ్ధిదారుల కుటుంబాల్లో ఆనందం వెల్లివిరిసింది. కార్యక్రమం పండుగ వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ కిరణ్ కుమార్, వివిధ శాఖల అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

A Praveen, Nellore

A Praveen, Nellore