Nellore: కార్యకర్తలే పార్టీకి బలం: మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
Nellore: అనంతసాగరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి, స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
Nellore: కార్యకర్తలే పార్టీకి బలం: మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి
Ananthasagaram: వైఎస్సార్‌సీపీకి నెల్లూరు జిల్లాలోని అనంతసాగరం మండలం ఎప్పటికీ బలమైన ప్రాంతమేనని.. పార్టీ కోసం కష్టకాలంలోనూ జెండా మోసిన కార్యకర్తలే తమకు నిజమైన బలమని మాజీ ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్‌రెడ్డి అన్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు.
అనంతసాగరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని ప్రారంభించిన సందర్భంగా నాయకులు, కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.2024 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీకి సుమారు 40 శాతం ఓటు బ్యాంకు వచ్చినా.. సీట్ల పరంగా ఆశించిన ఫలితాలు సాధించలేకపోయామని తెలిపారు.
2009 నుంచి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి వెంట నడుస్తూ పార్టీ కోసం అంకితభావంతో పనిచేసిన కార్యకర్తలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తుచేశారు. 2019లో పార్టీ అధికారంలోకి వచ్చిన సమయంలో కార్యకర్తలకు మరింత భరోసా కల్పించాల్సి ఉండేదని పేర్కొన్నారు.
కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన ప్రతి కార్యకర్తను గుర్తిస్తాం.
పార్టీ అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా జెండాను వీడకుండా పనిచేసిన కార్యకర్తలకు గుర్తింపు ఇవ్వడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని విక్రమ్‌రెడ్డి తెలిపారు. దీర్ఘకాలంగా పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డులు అందిస్తున్నామని, నియోజకవర్గంలో కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు కార్డు అందించే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.
గ్రామస్థాయి నుంచే పార్టీకి పునర్వైభవం.
స్థానిక సంస్థల ఎన్నికలు కార్యకర్తల సత్తా చాటుకునే వేదికగా నిలవాలని అన్నారు. ప్రతి పంచాయతీలో పార్టీ కోసం కష్టపడిన స్థానిక నాయకత్వాన్ని గుర్తించి బలోపేతం చేయాలని సూచించారు. కార్యకర్తలు పరస్పర సమన్వయంతో ముందుకు సాగితే అనంతసాగరంలో పార్టీకి మరింత బలం చేకూరుతుందని చెప్పారు. ఇప్పటి నుంచే గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం పోరాడాలని పిలుపునిచ్చారు.
కూటమి ప్రభుత్వ పాలనపై తాను చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ.. ప్రతిపక్ష నాయకులు, కార్యకర్తలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా కార్యకర్తలు అధైర్యపడాల్సిన అవసరం లేదని, ప్రజల మధ్యే ఉంటూ పార్టీని మరింత బలోపేతం చేయాలని సూచించారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజల తీర్పు ద్వారా ప్రభుత్వ విధానాలపై తమ అభిప్రాయాన్ని వెల్లడించే అవకాశం ఉంటుందని తెలిపారు. అంతకుముందు అనంతసాగరంలో వైఎస్సార్‌సీపీ కార్యాలయాన్ని పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం పార్టీ కోసం పనిచేస్తున్న నాయకులు, కార్యకర్తలకు ఐడెంటిటీ కార్డులను అందజేశారు.




