Bandarupalli: బండారుపల్లి శివాలయంలో ముఖద్వార ప్రతిష్ఠ మహోత్సవం
Bandarupalli: ఆత్మకూరు మండలం బండారుపల్లి నూతన శివాలయంలో ముఖద్వార ప్రతిష్ఠా మహోత్సవం ఘనంగా జరిగింది. ట్రస్ట్ చైర్మన్ కంచి పరమేశ్వరరెడ్డి పూజల్లో పాల్గొన్నారు.
Bandarupalli: బండారుపల్లి శివాలయంలో ముఖద్వార ప్రతిష్ఠ మహోత్సవం
నెల్లూరు జిల్లా: ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న శివాలయ ముఖద్వార ప్రతిష్ఠా మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా నిర్వహించారు. శ్రీ సాంబశివ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్, నిత్యాన్నదాత కంచి పరమేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గ్రామానికి చేరుకున్న కంచి పరమేశ్వరరెడ్డికి గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయ నిర్మాణ పనులను పరిశీలించిన ఆయన.. ఆలయ అభివృద్ధి, మిగిలిన పనులపై గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులతో చర్చించారు.
ముఖద్వార ప్రతిష్ఠా కార్యక్రమంలో వేద పండితుల ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొన్నారు. అనంతరం గ్రామస్తులు తీర్థప్రసాదాలు అందజేసి పూలమాల, శాలువాతో సత్కరించారు. శివనామస్మరణ, భక్తుల సందడితో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకుంది. గ్రామ ప్రజలు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.




