Atmakur: ఆత్మకూరులో అభివృద్ధి పనుల పరిశీలన - మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
Atmakur: ఆత్మకూరులో అభివృద్ధి పనుల ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. సోమవారం భారీగా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు.
Atmakur: ఆత్మకూరులో అభివృద్ధి పనుల పరిశీలన - మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి
ఆత్మకూరు: నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల పండుగకు రంగం సిద్ధమైంది. సోమవారం రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులు, అధికార యంత్రాంగం సమక్షంలో భారీగా అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆదివారం ఆత్మకూరులో పర్యటించి ఏర్పాట్లను పరిశీలించారు.
ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులతో సమావేశం నిర్వహించి కార్యక్రమాలను విజయవంతం చేయడంపై దిశానిర్దేశం చేశారు.ఆత్మకూరు నియోజకవర్గానికి మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ, హౌసింగ్, ఐ&పీఆర్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి ఎన్.ఎం.డి. ఫరూఖ్ హాజరుకానున్నారని మంత్రి ఆనం తెలిపారు.
ఎంపీలు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బీద మస్తాన్ రావు, ఎమ్మెల్సీలు బీద రవిచంద్ర, శ్రీకాంత్, బల్లి కళ్యాణ్ తదితరులు, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎస్పీతో పాటు అధికార యంత్రాంగం కార్యక్రమంలో పాల్గొంటారని చెప్పారు. అందరూ కలిసి ఆత్మకూరులో రేపటి కార్యక్రమాన్ని ఒక పెద్ద పండుగలా విజయవంతం చేయాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు.
మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో సుమారు రూ.53.25 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇప్పటికే పూర్తయిన సుమారు రూ.10 కోట్ల విలువైన పనులకు ప్రారంభోత్సవాలు, మరో రూ.35 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేపట్టనున్నట్లు తెలిపారు.వీటితో పాటు ఆత్మకూరు పట్టణ అభివృద్ధికి మరో కీలక ముందడుగు పడనుందని చెప్పారు.
సెప్టెంబర్ 22న కుప్పం నుంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వర్చువల్‌గా ఆత్మకూరు నియోజకవర్గానికి మంజూరైన రూ.29 కోట్ల అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ పనులకు శంకుస్థాపన చేయనున్నారని మంత్రి ఆనం తెలిపారు. రాష్ట్రంలోని వివిధ పురపాలక సంఘాలు, కార్పొరేషన్లలో అర్బన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధికి ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తోందని, అందులో భాగంగా ఆత్మకూరుకు కూడా రూ.29 కోట్ల నిధులు మంజూరయ్యాయని చెప్పారు.
ముఖ్యమంత్రి చేతుల మీదుగా ఈ పనులకు వర్చువల్‌గా శంకుస్థాపన జరగడం ఆత్మకూరు అభివృద్ధిలో మరో కీలక ఘట్టమన్నారు.ఇదే సమయంలో ఉదయగిరి నియోజకవర్గంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ కార్యక్రమంపై కూడా మంత్రి ఆనం వివరించారు. సెప్టెంబర్ 24న ఉదయగిరి నియోజకవర్గంలో భారీ బహిరంగ సభ నిర్వహించి, రాష్ట్రవ్యాప్తంగా సుమారు రూ.10 వేల కోట్ల ఉపాధి హామీ పథక పనులకు శ్రీకారం చుట్టే కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలిపారు.
ఈ కార్యక్రమానికి పెద్దఎత్తున ప్రజలను తరలించి విజయవంతం చేయడానికి ప్రతి నియోజకవర్గం నుంచి సమన్వయంతో కార్యక్రమాలు చేపట్టనున్నట్లు చెప్పారు. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, కేంద్ర మంత్రులను ఆహ్వానించి ఘనంగా స్వాగతించేలా ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.తొలుత మంత్రి ఆనం ఆత్మకూరు టిడ్కో కాలనీలో నూతనంగా నిర్మించిన శ్రీవారి (కోదండ రామస్వామి ఆలయం) ఆలయాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొని, సోమవారం నిర్వహించనున్న మహా కుంభాభిషేకం, సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి విగ్రహ ప్రతిష్ఠాపన ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంకల్పించిన 5,000 ఆలయాల నిర్మాణ కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు టిడ్కో కాలనీలో నిర్మించిన ఈ ఆలయానికి ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు.
ఆలయ నిర్మాణానికి సుమారు రూ.40 లక్షలు ఖర్చు కాగా, ఆలయ ప్రాకారం, కళ్యాణ వేదిక నిర్మాణానికి దేవాదాయ శాఖ సీజీఎఫ్ నుంచి మరో రూ.35 లక్షలు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. మొత్తంగా సుమారు రూ.75 లక్షలతో ఆలయం, ప్రాకారం, కళ్యాణ వేదిక నిర్మాణం పూర్తయిందన్నారు.ఆలయ పరిసరాల్లో మిగిలిన స్థలాన్ని సద్వినియోగం చేసేందుకు నక్షత్ర వనాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామని, వివిధ నక్షత్రాలకు అనుగుణంగా పవిత్ర వృక్షాలను నాటుతున్నామని తెలిపారు.ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం నుంచి టిడ్కో కాలనీ వరకు నిర్వహించనున్న బైక్ ర్యాలీ ఏర్పాట్లను కూడా మంత్రి పరిశీలించారు.
పదవీకాలం పూర్తిచేసుకున్న మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు, కౌన్సిలర్లతో ఆత్మీయంగా సమావేశమై అభివృద్ధి కార్యక్రమాల్లో వారి భాగస్వామ్యాన్ని గుర్తు చేసుకున్నారు.ఆత్మకూరు నియోజకవర్గంలో విద్యుత్, తాగునీరు, రహదారులు, పట్టణ మౌలిక వసతులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని మంత్రి తెలిపారు.
సంగం మండలం మక్తాపురం, చేజర్ల మండలం పెరుమాళ్లపాడులో ఒక్కొక్కటి రూ.3.5 కోట్లతో రెండు విద్యుత్ సబ్‌స్టేషన్లు, టిడ్కో కాలనీ తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం నుడా నుంచి రూ.1 కోటి నిధులతో పైప్‌లైన్ పనులు, నెల్లూరుపాలెం ఆంజనేయస్వామి ఆలయం నుంచి ఆత్మకూరు పట్టణం వరకు 2.1 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి వంటి పలు కీలక పనులు చేపట్టినట్లు వివరించారు.
ఆత్మకూరులో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, శ్రీవారి ఆలయ మహా కుంభాభిషేకం, మంత్రుల పర్యటనను విజయవంతం చేయడంతో పాటు, 22న ముఖ్యమంత్రి చేతుల మీదుగా జరగనున్న రూ.29 కోట్ల పనుల శంకుస్థాపన, ఉదయగిరి నియోజకవర్గంలో జరగనున్న ముఖ్యమంత్రి కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేసేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు సమన్వయంతో పనిచేయాలని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పిలుపునిచ్చారు.మంత్రి వెంట స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు ఉన్నారు.




