Udayagiri: గండిపాలెంలో వ్యవసాయ విద్యార్థుల ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం

Udayagiri: ఉదయగిరి మండలం గండిపాలెం, వెంగళరావు నగర్ గ్రామాల్లో మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థులు ప్రత్యేక ఎన్‌ఎస్‌ఎస్ శిబిరాన్ని ప్రారంభించారు.

VENKATA PRASAD, UDAYAGIRI
Published on: 30 Oct 2026 6:30 PM IST
Udayagiri
X

Udayagiri: గండిపాలెంలో వ్యవసాయ విద్యార్థుల ఎన్‌ఎస్‌ఎస్ శిబిరం

నెల్లూరు జిల్లా: ఉదయగిరి మండలంలోని గండిపాలెం, వెంగళరావు నగర్ గ్రామాల్లో ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల విద్యార్థులు జాతీయ సేవా పథకం ఆధ్వర్యంలో ప్రత్యేక జాతీయ సేవా శిబిరాన్ని ప్రారంభించారు. బీఎస్సీ (ఆనర్స్) వ్యవసాయం చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో భాగంగా అక్టోబర్ 29 నుంచి నవంబర్ 4వ తేదీ వరకు ఈ శిబిరాన్ని నిర్వహించనున్నారు.

తొలిరోజు గండిపాలెం గ్రామంలోని గుంటుపల్లి కొండయ్య చౌదరి, సుబ్బమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కార్యక్రమాన్ని ప్రారంభించారు. జాతీయ సేవా పథకం అధికారులు డాక్టర్ బి. సంధ్యారాణి, డాక్టర్ జె. రాధాకృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మేకపాటి గౌతమ్ రెడ్డి వ్యవసాయ కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ టి. గోపికృష్ణ మాట్లాడుతూ జాతీయ సేవా పథకం ప్రాముఖ్యతను వివరించారు.

విద్యార్థులు చదువుతోపాటు సమాజ సేవలోనూ చురుగ్గా పాల్గొనాలని సూచించారు. జన్యు, మొక్కల ప్రజనన విభాగ ఆచార్యులు డాక్టర్ ఎం. రెడ్డి శేఖర్ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ కార్యక్రమాలు కేవలం వ్యవసాయ రంగానికే పరిమితం కాకుండా దాని అనుబంధ రంగాలపై కూడా అవగాహన కల్పిస్తాయని తెలిపారు.

కళాశాల సేద్య విభాగ ఆచార్యురాలు, ఎన్‌ఎస్‌ఎస్ అధికారిణి డాక్టర్ బి. సంధ్యారాణి మాట్లాడుతూ ప్రత్యేక శిబిరంలో భాగంగా గ్రామంలో ప్రతిరోజూ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వివరించారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఆర్. రవీంద్ర మాట్లాడుతూ గ్రామంలో పరిశుభ్రత, పర్యావరణ పరిరక్షణ, ఆరోగ్యం, వ్యక్తిగత పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు.

కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ అధికారి జె. రాధాకృష్ణ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌ఎస్ నినాదమైన 'నేను కాదు.. నీవు' (నాట్ మీ బట్ యూ) అనే సందేశాన్ని విద్యార్థులు తమ జీవితాల్లో ఆచరించాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో అభ్యుదయ రైతు రామయ్య, సేద్య విభాగ ఆచార్యులు మహేశ్వర్ రెడ్డి, ఉద్యాన విభాగ ఆచార్యురాలు టి. మాధవి, కీటక శాస్త్ర విభాగ ఆచార్యులు డాక్టర్ ఎం. కిషన్ తేజ, పశువైద్యుడు డాక్టర్ రాఘవేంద్ర, పాఠశాల జీవశాస్త్ర ఉపాధ్యాయులు విష్ణు నారాయణ, హిందీ ఉపాధ్యాయులు సురేష్, వ్యవసాయ కళాశాల బోధనా సహాయకులు డాక్టర్ ఎం. అశోక్ నాయక్, బోధన, బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.

VENKATA PRASAD, UDAYAGIRI

VENKATA PRASAD, UDAYAGIRI