Nellore: నెల్లూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

Nellore: నెల్లూరు జిల్లాలో 700 గ్రామ పంచాయతీలు, 6,668 వార్డులకు మూడు విడతల్లో జరిగే ఎన్నికలకు నవంబర్ 15 నుంచి నామినేషన్లు స్వీకరిస్తున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

A Praveen, Nellore
Published on: 14 Nov 2026 4:56 PM IST
Nellore
X

Nellore: నెల్లూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం!

నెల్లూరు జిల్లా: శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం నేటి (నవంబర్ 15) నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుంది. జిల్లాలోని 35 మండలాల పరిధిలో ఉన్న 700 గ్రామ పంచాయతీలకు, 6,668 వార్డులకు మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు.

మొదటి విడతలో కావలి రెవెన్యూ డివిజన్ పరిధిలోని 8 మండలాల్లో 134 గ్రామ పంచాయతీలకు, రెండో విడతలో ఆత్మకూరు, గూడూరు రెవెన్యూ డివిజన్లతో పాటు కావలి డివిజన్‌లోని కొన్ని మండలాల్లో 14 మండలాల పరిధిలో 297 గ్రామ పంచాయతీలకు, మూడో విడతలో నెల్లూరు రెవెన్యూ డివిజన్ పరిధిలోని 13 మండలాల్లో 269 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు.

నామినేషన్ల స్వీకరణకు సంబంధించి మొదటి విడతకు నవంబర్ 15వ తేదీ, రెండో విడతకు నవంబర్ 16వ తేదీ, మూడో విడతకు నవంబర్ 19వ తేదీన ఎన్నికల నోటీసులు జారీ చేయనున్నట్లు తెలిపారు. సంబంధిత తేదీల నుంచి ప్రతిరోజూ ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లను స్వీకరిస్తారు.

మొదటి విడతకు నవంబర్ 17వ తేదీ, రెండో విడతకు నవంబర్ 20వ తేదీ, మూడో విడతకు నవంబర్ 23వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ల స్వీకరణకు చివరి గడువుగా నిర్ణయించారు. నామినేషన్ల పరిశీలన మొదటి విడతకు నవంబర్ 18వ తేదీ ఉదయం 8 గంటల నుంచి, రెండో విడతకు నవంబర్ 21వ తేదీన, మూడో విడతకు నవంబర్ 24వ తేదీన నిర్వహించనున్నారు.

నామినేషన్ల తిరస్కరణపై అప్పీళ్లకు మొదటి విడతలో నవంబర్ 19వ తేదీ, రెండో విడతలో నవంబర్ 22వ తేదీ, మూడో విడతలో నవంబర్ 25వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అప్పీళ్ల పరిష్కారం అనంతరం అభ్యర్థుల ఉపసంహరణకు మొదటి విడతలో నవంబర్ 21వ తేదీ, రెండో విడతలో నవంబర్ 24వ తేదీ, మూడో విడతలో నవంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు గడువు ఉంటుంది. అనంతరం తుది పోటీలో ఉన్న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు.

జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని ముందస్తు ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు.

A Praveen, Nellore

A Praveen, Nellore