Guduru: కరువు ప్రాంత రైతుల రుణాలు వెంటనే మాఫీ చేయాలి: పి.టాన్యా!
Guduru: జంగారెడ్డిగూడెంలో ఏఐకేఎంఎస్ సమావేశం నిర్వహించి, కరువు ప్రాంతాల్లో రైతులు, కౌలు రైతుల రుణాలు మాఫీ చేయాలని అధ్యక్షురాలు పి.టాన్యా డిమాండ్ చేశారు.
Guduru: కరువు ప్రాంత రైతుల రుణాలు వెంటనే మాఫీ చేయాలి: పి.టాన్యా!
Guduru: ఎల్ నినో కారణంగా ఏర్పడిన తీవ్ర వర్షాభావం కారణంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా ఏర్పడిన కరువు ప్రాంతాలలో రైతుల, కౌలు రైతుల రుణాలను వెంటనే మాఫీ చేయాలని, వ్యవసాయ కూలీలకు జీవనోపాధి కల్పించడానికి ఉపాధి హామీ పనులు తక్షణమే చేపట్టాలని ఏఐకేఎంఎస్ జాతీయ అధ్యక్షురాలు పి.టాన్యా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
అఖిల భారత రైతు - కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) జాతీయ కార్యవర్గ సమావేశం టాన్యా అధ్యక్షతన గురువారం నాడు జంగారెడ్డిగూడెంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ పార్టీ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్బంగా టాన్యా మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం రైతాంగ, ప్రజా, కార్మిక వ్యతిరేక విధానాలను అమలు చేస్తుందని విమర్శించారు. అదాని, అంబాని వంటి కార్పొరేట్ శక్తులకు వ్యవసాయ రంగాన్ని అప్పగించడానికి కంకణం కట్టుకుందని దుయ్య బట్టారు.
ఎల్ నినో ప్రభావం కారణంగా దేశ వ్యాప్తంగా కరువు ఏర్పడుతుందని వాతావరణ శాస్త్ర వేత్తలు ఒక ప్రక్క చెబుతుంటే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు మాత్రం చీమ కుట్టినట్టు కూడా లేకుండా పోయిందని విమర్శించారు. ఏపీ, తెలంగాణలో తీవ్ర వర్షాభావం కారణంగా లక్షల ఎకరాల్లో పంటలు వేయలేదని, పంటలు వేసినా వర్షాలు లేక ఎండిపోయాయని అన్నారు. భూగర్భ జలాలు అడగంటి పోయి 50 శాతం వ్యవసాయ బోర్లు పనిచేయడం లేదని అన్నారు.
ట్యాంకర్లతో నీళ్లు తెచ్చుకుని ప్రత్తి, మిర్చి లాంటి పంటలను కాపాడుకోవడానికి నీళ్లు చల్లుకునే దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ పరిస్థితుల్లో రైతాంగం, కౌలు రైతులు మరింత అప్పుల ఊభిలో కూరుకుపోతున్నారని అన్నారు. ముందస్తు కౌలు చెల్లించిన కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారిందని అన్నారు. దేవాదాయ, ధర్మాదాయ భూములకు కూడా ముందుగానే కౌలు చెల్లించారని తెలిపారు.
పంటలు వేయలేక, వేసిన పంటలు చేతికి రాక, ముందస్తు కౌలు చెల్లించిన కౌలు రైతులు విలవిలలాడుతున్నారని అన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు లేనందున పంట రుణాలు, ఇన్పుట్ సబ్సిడీ, ఎరువులు, పంటలు కొనుగోలు వంటి ప్రయోజనాలు అందక చివరకు నష్టపరిహారం కూడా దక్కడం లేదని అన్నారు. ఏపీలో 388 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వం ప్రకటించిందని, వాస్తవానికి 500కు పైగానే మండలాలు కరువు భారిన పడ్డాయని అన్నారు.
రాయలసీమ, పల్నాడు, ఉత్తరాంద్ర ప్రాంతాల్లో కరువు విలయతాండవం చేస్తుందని అన్నారు. త్రాగునీటి కొరత, పశు గ్రాసం కొరత ఇప్పటికే ఏర్పడిందని అన్నారు. ఎల్ నినో గురించి ప్రభుత్వాలు పట్టించుకోనందునే, ముందు చూపు లేనందునే ఇంత కరువు దాపురించిందని అన్నారు. కరువు వల్ల పనులు లేక వలసలు పెరిగాయని, గ్రామాలు ఖాళీ అవుతున్నాయని అన్నారు. ఉపాధి హామీ పనులు సైతం లేకుండా పోయాయని అన్నారు. తక్షణమే కరువు మండలాల్లో రైతాంగాన్ని, కౌలు రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన ఆదుకోవాలని, వారి రుణాలను రద్దు చేయాలని, ప్రజలకు త్రాగునీరు, పశుగ్రాసం కొరత లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులు చెల్లించిన 2026-27 సంవత్సరం కౌలును తిరిగి ఇవ్వాలని, లేకుంటే 2027-28 కౌలుగా జమ చేసుకోవాలని, వలసలు నివారణకు ఉపాధి పనులు కల్పించాలని డిమాండ్ చేశారు.
ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ జాతీయ ప్రధాన కార్యదర్శి బి. భాస్కర్, జాతీయ ఉపాధ్యక్షులు టి. ప్రకాష్, జాతీయ సహాయ కార్యదర్శి యు.గనిరాజు, జాతీయ నాయకులు కే. దూలయ్య, డీపీ పోలయ్య, కే. నాగరాజు, ఏ. సాయిలు, ఎల్.భీమన్న, గోపి, గంగారెడ్డి, కే.సురేందర్, టి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మోదీ ప్రభుత్వానికి ఏజెంట్ గా మారి భారత ప్రజాస్వామ్యానికి తూట్లు పొడుస్తున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలి, భారత వ్యవసాయ రంగాన్ని నాశనం చేసే అమెరికాతో భారత ప్రభుత్వం చేసుకునే ఒప్పందాన్ని రద్దు చేయాలి, అడవుల ప్రైవేటీకరణ నిలిపివేయాలి, ఆదివాసి రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలి, లక్షల ఎకరాల వ్యవసాయ భూములను కార్పొరేట్ కంపెనీలకు అప్పగించే ప్రభుత్వ చర్యలు వెంటనే విడనాడాలి, వీబీ జి రాంజీ చట్టాన్ని రద్దు చేసి, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని అమలు చేయాలి వంటి పలు తీర్మానాలను ఏకగ్రీవంగా ఆమోదించారు.




