Father Dead Body: తండ్రి మృతదేహాన్ని నాలుగేళ్లుగా ఫ్రీజర్‌లో దాచిన కూతురు
Father Dead Body: భవిష్యత్తులో వైద్యంతో తండ్రిని బతికించవచ్చన్న నమ్మకంతో నాలుగేళ్లుగా ఫ్రీజర్‌లో మృతదేహాన్ని దాచిన ముంబయి మహిళ ఉదంతం వెలుగులోకి వచ్చింది.
Father Dead Body: తండ్రి మృతదేహాన్ని నాలుగేళ్లుగా ఫ్రీజర్‌లో దాచిన కూతురు
Father Dead Body: భవిష్యత్తులో వైద్య సాంకేతికత పెరుగుతుందనే గుడ్డి నమ్మకంతో, చనిపోయిన తన తండ్రి మృతదేహాన్ని ఓ మహిళ నాలుగేళ్లుగా రహస్యంగా భద్రపరిచిన వైనం ముంబయిలో వెలుగు చూసింది. విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఈ షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. ముంబయిలోని మలాడ్ ప్రాంతంలో ఓ భవనం ఉంది. దాని బయట త్వరలో డేకేర్ సెంటర్ ప్రారంభం అనే బోర్డు ఉండగా, గేటుకు మాత్రం ఎప్పుడూ తాళం వేసి ఉంటుంది. అయితే, కొద్ది రోజులుగా ఆ భవనం నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
రంగంలోకి దిగిన పోలీసులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించగా.. అక్కడ ఫ్రీజర్‌లో భద్రపరిచిన ఓ మృతదేహం కనిపించింది. దర్యాప్తులో భాగంగా ఆరా తీయగా సంచలన విషయాలు తెలిశాయి. ఆ మృతుడు క్యాన్సర్‌తో బాధపడుతూ జూన్ 2022లోనే మరణించాడని, తన తండ్రిపై ఉన్న అపారమైన ప్రేమతో ఆయనను మళ్లీ బతికించుకోవచ్చన్న ఆశతో కూతురు ఈ సాహసానికి ఒడిగట్టినట్లు తేలింది.
మృతదేహాన్ని సుదీర్ఘకాలం భద్రపరిచే మార్గాల కోసం ఇంటర్నెట్‌లో వెతికిన ఆ మహిళ, అమెరికాలో అమలవుతున్న అత్యల్ప ఉష్ణోగ్రత వద్ద మృతదేహాల సంరక్షణ విధానం గురించి తెలుసుకుంది. తండ్రి మృతదేహాన్ని అమెరికాకు తరలించేందుకు డబ్బు ఆదా చేస్తున్నామని, అప్పటివరకు స్థానికంగానే భద్రపరుస్తున్నామని తెలిపింది. ఈ తాత్కాలిక ఏర్పాట్ల కోసం డేకేర్ సెంటర్ నిర్వాహకులకు నెలకు ఏకంగా రూ. 1.60 లక్షలు చెల్లిస్తున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఈ కేసులో చట్టపరమైన నిబంధనల ఉల్లంఘన జరిగిందా లేదా అనే కోణంలో కురార్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భారతదేశంలో మానవ మృతదేహాలను ఫ్రీజర్లలో సుదీర్ఘకాలం ఉంచడంపై ప్రత్యేకంగా నిర్దిష్ట చట్టాలు లేనప్పటికీ, ఇది అనేక కోణాలతో ముడిపడి ఉంది. ఆర్టికల్ 21 ప్రకారం జీవించే హక్కుతో పాటు, మరణించిన వ్యక్తికి కూడా మతపరమైన సాంప్రదాయాల ప్రకారం గౌరవప్రదంగా అంత్యక్రియలు పొందే హక్కు ఉంటుంది. ఎటువంటి అనుమతులు లేకుండా, స్థానిక అధికారులకు చెప్పకుండా మృతదేహాలను రహస్యంగా దాచడం చట్టరీత్యా నేరం. హత్య లేదా ఇతర అనుమానాలను కప్పిపుచ్చేందుకు ఇలా చేస్తే కఠిన శిక్షలు ఉంటాయి.
దాదాపు ఇలాంటి ఘటనే 2014లో పంజాబ్‌లోనూ జరిగింది. దివ్య జ్యోతి జాగ్రతి సంస్థాన్‌కు చెందిన ఆధ్యాత్మిక గురు అశుతోష్ మహారాజ్ క్లినికల్‌గా మరణించినప్పటికీ, ఆయన సమాధిలో ఉన్నారంటూ అనుచరులు దేహాన్ని ఫ్రీజర్‌లో భద్రపరిచారు. ప్రజారోగ్యానికి భంగం కలగకుండా, మత విశ్వాసాలను గౌరవిస్తూ పంజాబ్ & హర్యానా హైకోర్టు దీనికి కొన్ని నిబంధనలతో అనుమతించింది. నాటి నుంచి ప్రభుత్వ వైద్యుల పర్యవేక్షణలో ఆ మృతదేహం సురక్షితంగా కొనసాగుతుండటం విశేషం. మరి, ముంబయి ఘటనలో చట్టం ఎలాంటి తీర్పునిస్తుందో వేచి చూడాలి.




