Rajasthan: కాంగ్రెస్, బీజేపీ తరఫున నామినేషన్లు.. చివరికి ఏ పార్టీ తరుఫున విజయం సాధించారంటే..?
Rajasthan: రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా స్థానిక ఎన్నికల్లో వతి కుమారి అనే మహిళా అభ్యర్థి మూడు వేర్వేరు దుస్తుల్లో, ముసుగు ధరించి కాంగ్రెస్, బీజేపీ, స్వతంత్ర అభ్యర్థిగా మూడు నామినేషన్లు వేశారు.
Rajasthan: కాంగ్రెస్, బీజేపీ తరఫున నామినేషన్లు.. చివరికి ఏ పార్టీ తరుఫున విజయం సాధించారంటే..?
Rajasthan: భారత రాజకీయాల్లో చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి కానీ, రాజస్థాన్‌లో చోటుచేసుకున్న ఈ ఉదంతం మాత్రం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఒకే మహిళా అభ్యర్థి, ఒకే స్థానానికి, కొద్ది గంటల వ్యవధిలోనే మూడు వేర్వేరు రంగుల దుస్తుల్లో వచ్చి ఏకంగా మూడు నామినేషన్లు దాఖలు చేశారు. ఒకసారి కాంగ్రెస్ అభ్యర్థిగా, మరోసారి బీజేపీ తరఫున, ఇంకోసారి స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్లు వేయడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ విచిత్ర ఘటనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
రాజస్థాన్‌లోని డీగ్ జిల్లా బ్రజ్‌నగర్ పంచాయతీ సమితి పరిధిలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వతి కుమారి అనే మహిళా అభ్యర్థి ఈ వినూత్న వ్యూహాన్ని అమలు చేశారు. నామినేషన్ల రోజున అధికారులనే విస్మయానికి గురిచేస్తూ ఆమె మూడు సార్లు మూడు అవతారాల్లో ప్రత్యక్షమయ్యారు.మొదట వతి కుమారి ఎరుపు రంగు చీర ధరించి, చీర కొంగుతో ముఖానికి ముసుగు కప్పుకుని నామినేషన్ కేంద్రానికి వచ్చారు.
మాజీ ఎమ్మెల్యే వాజిబ్ అలీ సమక్షంలో ఆమె కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నామినేషన్ పత్రాలపై సంతకం చేసి దాఖలు చేశారు. అందరూ ఆమెను కాంగ్రెస్ అభ్యర్థి అనుకుంటుండగానే, కొద్దిసేపటికే మరో ట్విస్ట్ ఇచ్చారు. దుస్తులు మార్చుకుని ఆకుపచ్చ రంగు సల్వార్ సూట్ ధరించి, దుపట్టాతో ముఖం కప్పుకుని తిరిగి నామినేషన్ కేంద్రానికి వచ్చారు. రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యే జవహర్ సింగ్ బేధమ్ సమక్షంలో ఈసారి బీజేపీ అభ్యర్థిగా రెండో నామినేషన్ వేశారు.ఇక్కడితో కథ ముగియలేదు. అనంతరం మూడోసారి పసుపు రంగు చీర ధరించి వచ్చిన వతి కుమారి, ఈసారి ముఖానికి ఎలాంటి ముసుగు లేకుండా నేరుగా స్వతంత్ర అభ్యర్థిగా మూడో నామినేషన్ దాఖలు చేశారు.
ఒకే అభ్యర్థి రెండు ప్రధాన ప్రత్యర్థి పార్టీల తరఫున, అలాగే స్వతంత్రంగా నామినేషన్లు వేయడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై స్పందించిన వతి కుమారి.. ఏదైనా ఒకే పార్టీ టికెట్‌పై ఆధారపడితే చివరి నిమిషంలో బీ-ఫామ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతాయనే సందేహంతోనే ఇలా మూడు ఆప్షన్లు ఉంచుకున్నట్లు వివరించారు. చివరకు ఈ ఎన్నికల ఫలితాల్లో వతి కుమారి స్వతంత్ర అభ్యర్థిగా విజయం సాధించడం విశేషం. ఆమె గెలిచిన తర్వాత బీజేపీ ఆమెకు తన మద్దతును ప్రకటించింది. మొత్తానికి రాజస్థాన్ స్థానిక ఎన్నికల్లో చోటుచేసుకున్న ఈ 'త్రీ-ఇన్-వన్' నామినేషన్ డ్రామా రాజకీయ వర్గాల్లో నవ్వులు పూయించడంతో పాటు, గెలుపు కోసం అభ్యర్థులు వేసే ఎత్తుగడలకు నిదర్శనంగా నిలిచింది.




