TVK joins INDIA bloc: ఇండియా కూటమిలోకి టీవీకే.. కాంగ్రెస్ కీలక ప్రకటన

TVK joins INDIA bloc: తమిళనాడు సీఎం విజయ్ నేతృత్వంలోని టీవీకే ఇండియా కూటమి సమావేశంలో పాల్గొంది. కాంగ్రెస్ కీలక ప్రకటన చేయడంతో రాజకీయంగా ఆసక్తి పెరిగింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 4 Oct 2026 12:26 PM IST
TVK joins INDIA bloc
X

TVK joins INDIA bloc: ఇండియా కూటమిలోకి టీవీకే.. కాంగ్రెస్ కీలక ప్రకటన

Vijay-led TVK joins INDIA bloc: తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం (టీవీకే) కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమితో కలిసి అడుగులు వేయడం ప్రారంభించింది. చెన్నైలోని సత్యమూర్తి భవన్‌లో జరిగిన ఇండియా కూటమి సంప్రదింపుల సమావేశానికి టీవీకే తరఫున మంత్రులు ఆధవ్ అర్జున, మరియా విల్సన్ హాజరయ్యారు. వారికి కాంగ్రెస్ నేతలు స్వాగతం పలకడంతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణాలపై చర్చ మొదలైంది.

డీఎంకే దూరం.. టీవీకేకు దగ్గరవుతున్న కాంగ్రెస్

కొద్ది నెలల క్రితం వరకు తమిళనాడులో ఇండియా కూటమిలో డీఎంకే కీలక భాగస్వామిగా ఉంది. అయితే అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు టీవీకేకు మద్దతు ప్రకటించడంతో డీఎంకే ఇండియా కూటమికి దూరమైంది. ఇటీవల ఢిల్లీలో జరిగిన ఇండియా కూటమి సమావేశానికి కూడా డీఎంకే హాజరుకాలేదు. టీవీకే సైతం ఆ సమావేశానికి దూరంగా ఉంది.

ఇదిలా ఉండగా, గత నెలలో టీవీకే ఆధ్వర్యంలో ‘మత సామరస్య సామాజిక న్యాయ విజయ కూటమి’ పేరుతో కొత్త రాజకీయ వేదిక ఏర్పడింది. అయితే ఇందులో ఇండియా కూటమిలోని సీపీఎం, సీపీఐ చేరలేదు. ఈ పరిణామాల మధ్య టీవీకే తాజాగా ఇండియా కూటమి సమావేశానికి హాజరు కావడం ప్రాధాన్యం సంతరించుకుంది.

సీఈసీ రాజీనామా డిమాండ్‌పై పోరాటాలు

ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేయాలని ఇండియా కూటమి నిర్ణయించింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ ఈ పోరాటాలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా చెన్నైలోని సత్యమూర్తి భవన్‌లో కూటమి పార్టీల నేతలు సమావేశమయ్యారు.

తమిళనాడు కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మాణిక్యం ఠాకూర్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఎండీఎంకే నేత వైగో, వీసీకే నేత తిరుమావళవన్, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి షణ్ముగం, సీపీఐ తరఫున రవీంద్రనాథ్, ఐయూఎంఎల్ నేత అబూబకర్ తదితరులు పాల్గొన్నారు. టీవీకే తరఫున ఆధవ్ అర్జున, మరియా విల్సన్ సమావేశానికి హాజరై కూటమి చేపట్టే పోరాటాలకు మద్దతు ప్రకటించారు.

ప్రతిపక్ష ఐక్యతకు చారిత్రక రోజంటూ కాంగ్రెస్

సమావేశం అనంతరం మాణిక్యం ఠాకూర్ మాట్లాడుతూ.. టీవీకే ఇండియా కూటమి సమావేశంలో పాల్గొనడం ప్రతిపక్ష ఐక్యతకు చారిత్రక పరిణామమని అన్నారు. తమిళనాడులో బీజేపీకి వ్యతిరేకంగా రాజకీయ పోరాటం ఇక మరింత ఆసక్తికరంగా మారుతుందని వ్యాఖ్యానించారు. టీవీకే భాగస్వామ్యంతో రాష్ట్రంలో ప్రతిపక్ష రాజకీయ సమీకరణాలు కొత్త మలుపు తిరిగే అవకాశం ఉందనే చర్చ మొదలైంది.

అక్టోబర్‌లో వరుస నిరసనలు

ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు వ్యతిరేకంగా ఇండియా కూటమి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు సిద్ధమవుతోంది. అక్టోబర్ 6న ఢిల్లీలోని కేంద్ర ఎన్నికల సంఘం కార్యాలయం వరకు ఇండియా కూటమి ఎంపీలు మార్చ్ నిర్వహించనున్నారు.

అనంతరం అక్టోబర్ 13, 14 తేదీల్లో జిల్లా స్థాయిలో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్లు మాణిక్యం ఠాకూర్ తెలిపారు. అక్టోబర్ 15న కూటమిలోని ఏడు పార్టీల అగ్రనేతలతో కలిసి భారీ స్థాయి ఆందోళన నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పరిణామాలతో తమిళనాడు రాజకీయాల్లో ఇండియా కూటమి, టీవీకే మధ్య సమన్వయం ఎలా కొనసాగుతుందన్నది ఆసక్తికరంగా మారింది.

హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్