Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.10,000 కోట్లతో 'SME గ్రోత్ ఫండ్' ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్!

Union Cabinet Decisions: ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో రూ. 10,000 కోట్ల SME గ్రోత్ ఫండ్ మరియు ITLA ఏర్పాటుకు ఆమోదం లభించింది. పరిశ్రమలు, రవాణా రంగానికి ఇవి ఎంతో మేలు చేయనున్నాయి.

Arun Chilukuri
Published on: 6 Oct 2026 4:34 PM IST
Union Cabinet Decisions: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. రూ.10,000 కోట్లతో SME గ్రోత్ ఫండ్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్!
X

Union Cabinet Decisions: దేశంలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (SMEs) మరింత ఊతమిచ్చేలా కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన మంగళవారం సమావేశమైన కేంద్ర కేబినెట్ పలు కీలక బిల్లులు, నిధులకు ఆమోదం తెలిపింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాకు వెల్లడించారు. ఈ సమావేశంలో రూ. 10,000 కోట్ల 'ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్'తో పాటు, దేశవ్యాప్తంగా రవాణా వ్యవస్థను బలోపేతం చేసేందుకు 'ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ' (ITLA) ఏర్పాటుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

రూ. 10,000 కోట్లతో ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్: చిన్న, మధ్య తరహా సంస్థల్లో నేరుగా ఈక్విటీ పెట్టుబడులు పెట్టేందుకు ఈ నిధిని ఉపయోగించనున్నారు. ఇప్పటికే వ్యాపార సామర్థ్యాన్ని నిరూపించుకుని, భవిష్యత్తులో వేగంగా విస్తరించే అవకాశమున్న సంస్థలకు ఈ దీర్ఘకాలిక ఈక్విటీ క్యాపిటల్ ఎంతగానో దోహదపడుతుంది.

టైర్-2, టైర్-3 నగరాలకు పెద్దపీట: ఎస్ఎంఈ గ్రోత్ ఫండ్‌లో ఎక్కువ భాగం నిధులను తయారీ రంగ సంస్థలకు, ముఖ్యంగా టైర్-2, టైర్-3 నగరాల్లోని పారిశ్రామిక క్లస్టర్లలో పనిచేస్తున్న సంస్థలకు కేటాయించనున్నారు. దీనిద్వారా కొత్త టెక్నాలజీని స్వీకరించడం, తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవడం సులభమవుతుంది.

ఇంటిగ్రేటెడ్ ట్రాన్స్‌పోర్ట్ అండ్ లాజిస్టిక్స్ అథారిటీ (ITLA): దేశవ్యాప్తంగా రవాణా, లాజిస్టిక్స్ వ్యవస్థను సమర్థవంతంగా సమన్వయం చేసేందుకు స్పెషల్ పర్పస్ వెహికల్‌గా 'ITLA'ను ఏర్పాటు చేయనున్నారు. ఇది రోడ్లు, రైల్వేలు, పోర్టులు, పౌర విమానయానం వంటి అన్ని రవాణా రంగాలను అనుసంధానిస్తూ 'నేషనల్ ట్రాన్స్‌పోర్ట్ మాస్టర్ ప్లాన్' రూపొందిస్తుంది.

లాజిస్టిక్స్ ఖర్చుల తగ్గింపు: వివిధ రవాణా మార్గాల మధ్య మెరుగైన సమన్వయం సాధించడం ద్వారా మల్టీమోడల్ కనెక్టివిటీ బలోపేతం కానుంది. ఫలితంగా దేశంలో లాజిస్టిక్స్ ఖర్చులు తగ్గి, అంతర్జాతీయ మార్కెట్లో భారత్ పోటీతత్వం గణనీయంగా పెరుగుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.