Virat Garjana Morcha: థాక్రే బ్రదర్స్ జాయింట్ షో.. ముంబైలో పొలిటికల్ హీట్.!

Virat Garjana Morcha: మహారాష్ట్ర రాజధాని ముంబైలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా శివసేన

G Krishna
Published on: 4 Oct 2026 4:28 PM IST
Virat Garjana Morcha
X

Virat Garjana Morcha: థాక్రే బ్రదర్స్ జాయింట్ షో.. ముంబైలో పొలిటికల్ హీట్.!

Virat Garjana Morcha: మహారాష్ట్ర రాజధాని ముంబైలో రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాక్రా, మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్ఎన్ఎస్) అధినేత రాజ్ థాక్రా ఆదివారం సంయుక్తంగా భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు. 'విరాట్ గర్జన మోర్చా' పేరిట చేపట్టిన ఈ ర్యాలీ దక్షిణ ముంబైలోని మెట్రో సినిమా నుంచి ప్రారంభమై బృహన్ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బిఎమ్‌సి) ప్రధాన కార్యాలయం వైపు సాగింది. ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భారీగా అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ సిఈసీ జ్ఞానేష్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని లేదా ఆయనను పదవి నుంచి తొలగించాలని నాయకులు డిమాండ్ చేశారు. ఈ నిరసన ప్రదర్శనలో కాంగ్రెస్, శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సిపి (ఎస్‌పి) సీనియర్ నాయకులు కూడా పెద్ద సంఖ్యలో పాల్గొని మద్దతు తెలిపారు. కాగా, ఈ మోర్చాలో ఎలాంటి రాజకీయ పార్టీ జెండాలకు అనుమతి ఇవ్వకుండా, కేవలం జాతీయ త్రివర్ణ పతాకాలతో మాత్రమే కార్యకర్తలు పాల్గొనడం విశేషం.

బ్యాలెట్ పేపర్లతోనే ఎన్నికలు జరపాలి: రాజ్ థాక్రా డిమాండ్

ఈ ప్రదర్శనలో ఎమ్ఎన్ఎస్ అధినేత రాజ్ థాక్రా మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల కమిషనర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. "జ్ఞానేష్ కాకా.. ఓట్లను దోచుకోవద్దు" అంటూ ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో చేపడుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక పరిశీలన (ఎస్‌ఐఆర్) ప్రక్రియను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే ఎస్‌ఐఆర్ నిర్వహించాలని చట్టం చెబుతోందని, కానీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో 40 నుంచి 60 లక్షల మంది క్రొత్త ఓటర్లను చేర్చి అధికారాన్ని చేజిక్కించుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు అదే ఎస్‌ఐఆర్ పేరుతో ఏకంగా రెండు కోట్ల మంది ఓట్లను తొలగిస్తున్నారని, అసలు ఆ రెండు కోట్ల మంది ఓటర్లు ఎవరని రాజ్ థాక్రా ప్రశ్నించారు. దేశంలోని ప్రతిపక్ష పార్టీలన్నీ ఢిల్లీకి వెళ్లి ఎస్‌ఐఆర్‌ను రద్దు చేయాలని ఒత్తిడి తేలాలని పిలుపునిచ్చారు. అలాగే ఈవిఎం (EVM) విధానానికి స్వస్తి చెప్పి, పాత పద్ధతిలో బ్యాలెట్ పేపర్ల ద్వారానే ఎన్నికలు నిర్వహించాలని గట్టిగా డిమాండ్ చేశారు.

హిట్‌లర్ తరహా నిరంకుశత్వానికి అంతం తప్పదు: ఉద్ధవ్ థాక్రా

శివసేన (యుబిటి) అధినేత ఉద్ధవ్ థాక్రా వేదికపై నుంచి ప్రసంగిస్తూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో కొనసాగుతున్న నిరంకుశ పాలనను కూకటివేళ్లతో పెకిలించి వేయడానికే తామందరం రోడ్డుపైకి వచ్చామని తెలిపారు. దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది ఓటర్ల పేర్లను జాబితా నుంచి అన్యాయంగా తొలగించారని, పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఇదే రీతిలో ఓటర్లను మినహాయించారని ఆరోపించారు. చరిత్రలో హిట్‌లర్ కూడా ఇలాగే నిరంకుశంగా వ్యవహరించాడని, కానీ చివరికి ఆయనే స్వయంగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చిందని గుర్తుచేశారు. దేశంలో కూడా అలాంటి పరిస్థితులే దాపురిస్తాయని, స్వైరవిహారం చేస్తున్న పాలకులంతా ఈ విషయాన్ని మనస్సులో ఉంచుకోవాలని హెచ్చరించారు. ఈ అక్రమాలకు పాల్పడుతున్న వారిని వీధుల్లోకి లాగి చట్ట పరిధిలో శిక్షించే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.

1857 నాటి సిపాయిల తిరుగుబాటు లాంటిది: సంజయ్ రౌత్

ఈ మోర్చాకు ముందు శివసేన (యుబిటి) ఎంపీ సంజయ్ రౌత్ విలేకరులతో మాట్లాడుతూ, ఈ పోరాటం దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థలను, రాజ్యాంగ హక్కులను కాపాడుకోవడానికి జరుగుతున్న రెండో సిపాయిల తిరుగుబాటు లాంటిదని అభివర్ణించారు. దేశంలో 'హిట్‌లర్ రాజ్యాంగం' నడుస్తోందని, ఎన్నికల సంఘాన్ని, సుప్రీంకోర్టును తమ జేబులో వేసుకుని ఎన్నికలను హైజాక్ చేస్తున్నారని మండిపడ్డారు. ఓట్లను దొంగిలించడం, ప్రజాప్రతినిధులను అక్రమంగా కొనుగోలు చేయడంపై ప్రజలు తిరగబడుతున్నారని చెప్పారు. ఇదే సమయంలో జంతర్ మంతర్ వద్ద ఒక మహిళా జర్నలిస్టుపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఈ ఘటనకు కేంద్ర హోంశాఖ బాధ్యత వహించాలని, హోంమంత్రి అమిత్ షా దీనిపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.