Delhi: తల్లి కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన నాలుగేళ్ల బాలుడు
Delhi: దిల్లీలోని దాస్ గార్డెన్ కాలనీలో తల్లి కళ్లముందే నాలుగేళ్ల బాలుడు తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌లో పడిపోయాడు.
Delhi: తల్లి కళ్లముందే మ్యాన్‌హోల్‌లో పడిపోయిన నాలుగేళ్ల బాలుడు
Delhi: కనులముందే కంటికి రెప్పలా చూసుకుంటున్న కన్నకొడుకు ఒక్కసారిగా మ్యాన్‌హోల్‌లో పడిపోవడంతో ఓ తల్లి దిగ్భ్రాంతికి గురైంది. తెరిచి ఉన్న మ్యాన్‌హోల్ ఓ చిన్నారి ప్రాణాల మీదికి తెచ్చిన ఈ విషాదకర ఘటన దిల్లీలోని దాస్ గార్డెన్ కాలనీలో చోటుచేసుకుంది.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఇమ్రాన్ (4) అనే నాలుగేళ్ల బాలుడు తన తల్లితో కలిసి ఆడుకోవడానికి స్థానికంగా ఉన్న పార్క్‌కు వెళ్లాడు. కొద్దిసేపు తల్లి పర్యవేక్షణలో ఆడుకున్న బాలుడు, అనంతరం మూత్ర విసర్జన కోసం పార్క్ సమీపంలో ఉన్న మురుగు కాలువ వైపు వెళ్లాడు. అయితే, అక్కడ మూత లేకుండా తెరిచి ఉన్న మ్యాన్‌హోల్‌ను గమనించకపోవడంతో చిన్నారి ప్రమాదవశాత్తూ అందులో పడిపోయాడు.
ఈ ఘటన తల్లి కళ్లముందే క్షణాల్లో జరిగిపోవడంతో ఆమె తీవ్ర భయాందోళనకు గురై కేకలు వేసింది. ఆమె ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే హుటాహుటిన అక్కడికి చేరుకుని మురుగు నీటిలో బాలుడిని వెతకడానికి ప్రయత్నించినప్పటికీ ఎటువంటి ఆచూకీ లభించలేదు.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు ప్రారంభించారు. పరిస్థితి తీవ్రత దృష్ట్యా జాతీయ విపత్తు స్పందన దళం (NDRF), దిల్లీ ఫైర్ సర్వీసెస్ (DFS), దిల్లీ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ (DDMA), మరియు బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) దళాలు సంయుక్తంగా రంగంలోకి దిగాయి. మురుగు కాల్వలో కొట్టుకుపోయిన చిన్నారి ఇమ్రాన్ ఆచూకీ కోసం అత్యాధునిక పరికరాలతో తీవ్రంగా గాలిస్తున్నారు. అయితే, ప్రవాహం ఎక్కువగా ఉండటంతో బాలుడి జాడ ఇంకా లభించలేదని అధికారులు తెలిపారు.




