Maharashtra: చంద్రపూర్ జిల్లాలో పులుల విజృంభణ ఇద్దరు రైతులు బలి

Maharashtra: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో పులుల పంజా. ఒకేరోజు మూడు వేర్వేరు చోట్ల దాడులు, ఇద్దరు రైతులు మృతి, పశువుల కాపరికి తీవ్ర గాయాలు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial
Updated on: 31 Oct 2026 5:38 PM IST
Maharashtra
X

Maharashtra: చంద్రపూర్ జిల్లాలో పులుల విజృంభణ ఇద్దరు రైతులు బలి

మహారాష్ట్ర: మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో మానవ-వన్యప్రాణుల సంఘర్షణ మరోసారి ఆందోళన కలిగిస్తోంది. అడవుల సమీప ప్రాంతాల్లో పులుల సంచారం పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తాజాగా ఒకేరోజు జిల్లాలో మూడు వేర్వేరు ప్రాంతాల్లో పులుల దాడులు జరగడం కలకలం రేపింది. ఈ ఘటనల్లో ఇద్దరు రైతులు ప్రాణాలు కోల్పోగా, మరో పశువుల కాపరి తీవ్రంగా గాయపడ్డాడు.

చిమూర్ తాలూకాలోని గర్దాపర్ గ్రామంలో ఓ రైతుపై పులి దాడి చేయడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు సమాచారం. అలాగే సిందేవాహి తాలూకాలోని ధుమన్‌ఖేడా ప్రాంతంలో మరో రైతు పులి దాడికి బలయ్యాడు. మరోవైపు పోంభూర్ణ తాలూకాలోని సతారా టుకుమ్ ప్రాంతంలో పశువులను మేపుతున్న కాపరిపై పులి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు.

ఒకేరోజు మూడు ప్రాంతాల్లో పులుల దాడులు జరగడంతో చంద్రపూర్ జిల్లా ప్రజల్లో ఆందోళన నెలకొంది. ముఖ్యంగా వ్యవసాయ పనుల కోసం పొలాలకు వెళ్లే రైతులు, కూలీలు, పశువుల కాపరులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బతుకుతున్నారు. అటవీ ప్రాంతాలకు ఆనుకుని ఉన్న గ్రామాల్లో పులుల సంచారంతో ప్రజలు బయటకు వెళ్లాలంటేనే భయపడుతున్నారు.

వరుస దాడుల నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు అప్రమత్తమై ప్రజలకు తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీల భద్రతకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

Kola Venkatesh, Staff Reporter -Mancherial

Kola Venkatesh, Staff Reporter -Mancherial

11 ఏళ్ల జర్నలిజం అనుభవం కలిగిన సీనియర్ పాత్రికేయుడు. రాజకీయాలు, సామాజిక అంశాలు, స్థానిక సమస్యలు మరియు ప్రత్యేక కథనాలపై విస్తృతంగా పనిచేస్తూ ప్రజలకు ఖచ్చితమైన, విశ్వసనీయమైన వార్తలను అందిస్తున్నారు.