తమిళనాడులో కుల సర్వేకు గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు

Tamil Nadu Caste Survey: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి అత్యంత ప్రాధాన్యత కలిగిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది.

G Krishna
Published on: 29 Oct 2026 4:10 PM IST
Tamil Nadu Caste Survey
X

తమిళనాడులో కుల సర్వేకు గ్రీన్ సిగ్నల్.. కేబినెట్ భేటీలో పలు కీలక నిర్ణయాలు

Tamil Nadu caste survey: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర మంత్రిమండలి అత్యంత ప్రాధాన్యత కలిగిన పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సామాజిక, ఆర్థిక పురోగతిని అంచనా వేయడంతో పాటు సామాజిక న్యాయాన్ని మరింత సమర్థవంతంగా అమలు చేసేందుకు వీలుగా కుల విశ్లేషణ , సామాజిక హోదా సర్వే (Caste and Social Status Survey) నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న జనాభా లెక్కల (Population Census) ప్రక్రియ పూర్తయిన వెంటనే, 2027 ఫిబ్రవరి లేదా మార్చి నెలల్లో ఈ సర్వేను ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.

హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ప్రత్యేక కమిషన్

రాష్ట్రంలో కుల ఆధారిత సర్వేను ఎలాంటి న్యాయపరమైన చిక్కులు లేకుండా, పారదర్శకంగా నిర్వహించేందుకు ఒక ఉన్నత స్థాయి కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి విజయ్ నేతృత్వంలోని మంత్రిమండలి నిర్ణయించింది. హైకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఈ ప్రత్యేక కమిషన్ పనిచేస్తుంది. ఈ కమిషన్ క్షేత్రస్థాయిలో ప్రజల సామాజిక, ఆర్థిక, విద్య , ఉద్యోగ అవకాశాల సమాచారాన్ని సేకరించి సమగ్ర గణాంకాలను నమోదు చేస్తుంది. ఈ సర్వే వివరాలు భవిష్యత్తులో సంక్షేమ పథకాల అమలుకు, వివిధ సామాజిక వర్గాలకు రిజర్వేషన్ల ఫలాలను సమతుల్యంగా అందించడానికి ఎంతో ఉపయోగపడతాయని ప్రభుత్వం భావిస్తోంది.

సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌కు నిర్ణయం

ఈ కేబినెట్ భేటీలో మరొక కీలకమైన న్యాయపరమైన అంశంపై కూడా నిర్ణయం తీసుకున్నారు. హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన వారికి వెనుకబడిన తరగతుల (BC) రిజర్వేషన్ ప్రయోజనాలను కల్పిస్తూ గతంలో జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు రద్దు చేసిన సంగతి తెలిసిందే. ఆ జీఓ రద్దును సమర్థిస్తూ ఇటీవలే సుప్రీంకోర్టు తీర్పు వెలువరించగా.. ఆ తీర్పుపై దేశ అత్యున్నత నాయస్థానంలో 'రివ్యూ పిటిషన్' (పునఃపరిశీలన పిటిషన్) దాఖలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మతం మారిన బీసీ సామాజిక వర్గాల హక్కుల పరిరక్షణ కోసమే ఈ న్యాయపోరాటం కొనసాగించనున్నట్లు స్పష్టం చేసింది.

పారిశ్రామిక ప్రగతికి ఊతం.. 8 సంస్థల ప్రాజెక్టులకు ఆమోదం

కేవలం సామాజిక అంశాలే కాకుండా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధికి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి కేబినెట్ ప్రాధాన్యమిచ్చింది. రాష్ట్రంలో కొత్తగా కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముందుకు వచ్చిన ఎనిమిది ప్రముఖ పారిశ్రామిక సంస్థల పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ఈ కొత్త పారిశ్రామిక ప్రాజెక్టుల ద్వారా తమిళనాడుకు భారీగా పెట్టుబడులు రావడమే కాకుండా, వేలాది మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు లభించనున్నాయి. ఒకవైపు సామాజిక సర్వేలు, మరోవైపు పారిశ్రామికాభివృద్ధి లక్ష్యంగా సీఎం విజయ్ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.