Supreme Court: నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టాల్సిందే.. ఢిల్లీ అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!
Supreme Court: దిల్లీ-ఎన్‌సీఆర్‌లో వరుస అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
Supreme Court: నేరస్థుల గుండెల్లో వణుకు పుట్టాల్సిందే.. ఢిల్లీ అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం!
Supreme Court: దేశ రాజధాని దిల్లీ-ఎన్‌సీఆర్ (Delhi-NCR) ప్రాంతంలో ఇటీవల వరుసగా చోటుచేసుకున్న అఘాయిత్యాలు, అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళలపై పెరుగుతున్న నేరాలను కట్టడి చేసేందుకు అత్యంత కఠినమైన చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. మహిళలపై అరాచకాలకు పాల్పడే వారి గుండెల్లో శాశ్వతంగా భయం పుట్టాల్సిన అవసరం ఉందని న్యాయస్థానం అభిప్రాయపడింది.
మహిళల భద్రతకు సంబంధించిన చర్యలు కేవలం పేపర్లకే పరిమితం కాకూడదని, తాము పూర్తిగా సురక్షితంగా ఉన్నామని ప్రతి మహిళా భావించే వాతావరణం కల్పించాలని కోర్టు పేర్కొంది.
రాత్రి 11 గంటల సమయంలో కూడా దిల్లీ-ఎన్‌సీఆర్ ప్రాంతంలో మహిళలు రోడ్లపై, మెట్రోల్లో ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా, భద్రంగా తిరిగే పరిస్థితులను తీసుకురావాలని ఆదేశించింది.
నేరం జరిగిన తర్వాత స్పందించడం కంటే, అసలు అలాంటి నేరాలు జరగకుండా ముందే కట్టడి చేయడమే అత్యంత కీలకమైన అంశమని సుప్రీంకోర్టు తేల్చిచెప్పింది. “ఇలాంటి నేరానికి పాల్పడితే ప్రాణాలు పోతాయి” అనే భయం క్రిమినల్స్‌లో కలగాలని స్పష్టం చేసింది.
మహిళలపై నేరాలను అరికట్టే క్రమంలో పోలీసులు కొన్నిసార్లు కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తే వెనుకాడొద్దని కోర్టు సూచించింది. ఈ విషయంలో కొంత కర్కశంగా వ్యవహరించాల్సి వచ్చినా తప్పులేదని, మానవ హక్కుల వంటి అడ్డంకులు ఎదురైనా సరే వెనకాడకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది.
బహిరంగ ప్రదేశాల్లో నిరంతర పెట్రోలింగ్‌ను మరింత ముమ్మరం చేయాలని, ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు నిరంతరం పనిచేసేలా పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించింది.
ఇటీవల దిల్లీలోని ఓ పార్క్‌లో 17 ఏళ్ల బాలికపై సామూహిక అత్యాచారం జరగడం, స్వరూప్ నగర్‌లో ఓ టీనేజీ అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడి హత్య చేసిన ఘటనలు తీవ్ర కలకలం సృష్టించాయి. అలాగే స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై లైంగిక దాడి జరిగిన ఘటనలు వెలుగుచూశాయి. ఈ వరుస దారుణాలపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు ఈ కేసులను సుమోటోగా స్వీకరించి విచారణ చేపట్టింది.




