Supreme Court: రొటేషన్‌పై పిటిషన్.. ‘రాంగ్ నంబర్’ అంటూ సుప్రీంకోర్టు చమత్కారం..!

Supreme Court: పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) కోసం కేటాయించిన నియోజకవర్గాలను రొటేషన్ పద్ధతిలో మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది.

G Krishna
Published on: 4 Nov 2026 7:05 PM IST
Supreme Court
X

Supreme Court: రొటేషన్‌పై పిటిషన్.. ‘రాంగ్ నంబర్’ అంటూ సుప్రీంకోర్టు చమత్కారం..!

Supreme Court: పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలలో షెడ్యూల్డ్ కులాలు (SC), షెడ్యూల్డ్ తెగల (ST) కోసం కేటాయించిన నియోజకవర్గాలను రొటేషన్ పద్ధతిలో మార్చాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. నియోజకవర్గాల రొటేషన్ అనేది శాసనసభ, పార్లమెంట్ పరిధిలోని చట్టపరమైన అంశమని స్పష్టం చేస్తూ, ఈ విషయంలో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి (CJI) జస్టిస్ సూర్యకాంత్ , జస్టిస్ జయమల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ అప్పీల్‌ను కొట్టివేసింది.

రాంగ్ నంబర్‌కు కాల్ చేస్తున్నారు: సీజేఐ చమత్కారం

విచారణ సందర్భంలో పిటిషనర్ తరఫు న్యాయవాది తమ వాదనలను గట్టిగా వినిపించగా, సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ సరదా వ్యాఖ్యలు చేశారు. "ఈ సమస్యపై మీరు రాంగ్ నంబర్‌కు కాల్ చేస్తున్నారు. కొద్దిగా ధైర్యం తెచ్చుకుని, గళం విప్పి చట్టసభలు చొరవ చూపేలా ప్రజాప్రతినిధులపై ఒత్తిడి తేవాలి. ఇది నిరసనలు, ధర్నాలు, నినాదాల కాలం.. మీ డిమాండ్‌ను పార్లమెంట్ ముందు ఉంచండి" అని సీజేఐ వ్యాఖ్యానించారు. నియోజకవర్గాల డీలిమిటేషన్ అనేది ఒక నిరంతర ప్రక్రియ కాదని, అది ఒకసారి జరిగే చట్టపరమైన విధి విధానమని వివరించారు.

పార్లమెంట్‌లో మూడో సభ పాత్రను పోషించలేము: జస్టిస్ బాగ్చీ

పిటిషన్ పై విచారణ జరిపిన జస్టిస్ జయమల్య బాగ్చీ మాట్లాడుతూ.. రాజ్యాంగ నిబంధనలను తిరిగి రాసే అధికారం కోర్టులకు లేదన్నారు. "ఒక నిబంధన ఏకపక్షంగా ఉంటే దాన్ని మేము రద్దు చేయవచ్చు లేదా సవరించవచ్చు. కానీ నియోజకవర్గాల్లో రొటేషన్ విధానాన్ని తీసుకొచ్చేందుకు మేము రాజ్యాంగాన్ని మళ్లీ రాయలేము. పార్లమెంట్‌లో మూడో సభ పాత్రను న్యాయస్థానాలు పోషించలేవు" అని వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో ఓటర్లు వ్యక్తిగత అభ్యర్థుల కంటే రాజకీయ పార్టీలు, వారి సిద్ధాంతాలకే ఎక్కువగా ప్రాధాన్యమిస్తారని కోర్టు అభిప్రాయపడింది. ఓటర్ల ఎంపిక పరిమితంగా ఉన్నప్పటికీ వారి ప్రాథమిక ఓటు హక్కుకు ఎలాంటి భంగం కలగలేదని స్పష్టం చేసింది.

పిటిషనర్ వాదన ఏంటి?

1972 నుండి అనేక నియోజకవర్గాలు మార్పు లేకుండా కేవలం ఎస్సీ, ఎస్టీలకే రిజర్వ్ అయి ఉన్నాయని, దీనివల్ల రొటేషన్ లేక అవే మూడు లేదా నాలుగు కుటుంబాలు దశాబ్దాలుగా పదేపదే పోటీ చేస్తున్నాయని పిటిషనర్ వాదించారు. 2008 డీలిమిటేషన్ కమిషన్ చేసిన సిఫార్సులను ప్రస్తావిస్తూ డీలిమిటేషన్ చట్టంలోని సెక్షన్ 9(1)(సి) ని సవాలు చేశారు. సుదీర్ఘకాలం ఒకే కేటగిరీకి స్థానాలను కేటాయించడం వల్ల ఇతర వర్గాల ఓటర్ల ఎంపికలు పరిమితమవుతున్నాయని పేర్కొన్నారు.

హైకోర్టు తీర్పును సమర్థించిన అత్యున్నత న్యాయస్థానం

మున్సిపాలిటీలు, పంచాయతీ ఎన్నికలకు వర్తించే రొటేషన్ నిబంధనలు చట్టసభలకు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. సీట్ల రొటేషన్ ఆమోదయోగ్యమైన విధానమే అయినప్పటికీ, అది పూర్తిగా పార్లమెంట్ ప్రత్యేకాధికారమని పేర్కొన్న అలహాబాద్ హైకోర్టు తీర్పుతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ప్రజాస్వామ్య ప్రక్రియలో ఓటర్లే ప్రజాప్రతినిధులను సంప్రదించి, పార్లమెంట్ ద్వారా చట్ట సవరణలు జరిగేలా ఒప్పించాలని సూచిస్తూ పిటిషన్‌ను ముగించింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.