Supreme Court: యాసిడ్ అమ్మకాలపై బ్రేక్.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదనలు!

Supreme Court: యాసిడ్ దాడుల నివారణకు సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదనలు చేసింది.

Arun Chilukuri
Published on: 28 Nov 2026 11:59 AM IST
Supreme Court
X

Supreme Court: యాసిడ్ అమ్మకాలపై బ్రేక్.. సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదనలు!

Supreme Court: దేశంలో యాసిడ్ దాడులను శాశ్వతంగా నిరోధించే దిశగా సుప్రీంకోర్టు సంచలన ప్రతిపాదనలు చేసింది. ప్రైవేటు వ్యక్తులు రిటైల్‌గా యాసిడ్ విక్రయించడంపై పూర్తిస్థాయిలో నిషేధం విధించాలని సూచించింది. అలాగే, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, డోర్ డెలివరీ సర్వీసుల ద్వారా జరిగే యాసిడ్ అమ్మకాలను తక్షణమే నిలిపివేయాలని స్పష్టం చేసింది.

యాసిడ్ దాడి బాధితురాలు షాహీన్ మాలిక్ దాఖలు చేసిన పిటిషన్‌పై నవంబర్ 23న విచారణ జరిపిన భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఎలాంటి నియంత్రణ లేకుండా యాసిడ్ సులభంగా అందుబాటులో ఉండటమే దాడులు కొనసాగడానికి ప్రధాన కారణమని ధర్మాసనం తీవ్రంగా అభిప్రాయపడింది. గతంలో జారీ చేసిన మార్గదర్శకాలు క్షేత్రస్థాయిలో సక్రమంగా అమలు కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది.

సుప్రీంకోర్టు చేసిన కొత్త ప్రతిపాదనలు ఇవే:

వైద్య అవసరాల కోసం యాసిడ్‌ను కేవలం ప్రభుత్వ ఆసుపత్రులకు అనుబంధంగా ఉన్న ఫార్మసీల ద్వారా మాత్రమే విక్రయించాలి.

యాసిడ్ కొనుగోలుకు జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ (CMO) లేదా సివిల్ సర్జన్ నుంచి ముందస్తుగా లిఖితపూర్వక అనుమతి తీసుకోవాలి.

కొనుగోలుదారుడి గుర్తింపు, చిరునామా, ఫోన్ నంబర్, ఎంత పరిమాణంలో కొంటున్నారు, ఏ ప్రయోజనం కోసం వినియోగిస్తున్నారు అనే వివరాలతో కూడిన నిర్దిష్ట ఫారమ్‌ను నింపాలి.

యాసిడ్ దుర్వినియోగమైతే కొనుగోలుదారుడిపైనే పూర్తి బాధ్యత ఉంటుంది. కొన్నవారికి తెలియకుండా వేరొకరు ఆ యాసిడ్‌ను దుర్వినియోగం చేసినా, కొనుగోలు చేసిన వ్యక్తే బాధ్యత వహించాల్సి ఉంటుంది.

బాధితుల చికిత్స ఖర్చులు, పరిహారం చెల్లింపు కోసం అవసరమైతే కొనుగోలుదారుడి స్థిరాస్తుల వివరాలు సేకరించి, వాటిని జప్తు చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని కోర్టు పేర్కొంది.

2013లో 'లక్ష్మి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' కేసులో ఇచ్చిన ఆదేశాలు, పాయిజన్స్ యాక్ట్-1919 కింద ఉన్న నిబంధనలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. బాధితులకు అండగా నిలిచేందుకు ఒక సమగ్ర విధానాన్ని రూపొందించే బాధ్యతను జాతీయ న్యాయ సేవా ప్రాధికార సంస్థ (NALSA)కు అప్పగించింది. ప్రథమ చికిత్స, చట్టపరమైన హక్కులు, పునరావాసం వంటి అంశాలపై పాఠశాలలు, కళాశాలల్లో అవగాహన కల్పించాలని సూచించింది.

ఈ ప్రతిపాదనలపై తీసుకున్న చర్యలను వివరిస్తూ రెండు వారాల్లోగా అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను డిసెంబర్ 14వ తేదీకి వాయిదా వేసింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.