Supreme Court: 'సర్‌' ఓట్ల తొలగింపు వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు!

Supreme Court: ఎన్నికల సంఘంలో సర్‌ ప్రక్రియ వివాదం మరియు ఓట్ల తొలగింపుపై దాఖలైన పిటిషన్‌‌ను విచారించిన సుప్రీంకోర్టు..

Arun Chilukuri
Published on: 5 Oct 2026 2:32 PM IST
Supreme Court
X

Supreme Court: 'సర్‌' ఓట్ల తొలగింపు వివాదం.. ఎన్నికల సంఘానికి సుప్రీంకోర్టు నోటీసులు!

Supreme Court: ఎన్నికల సంఘంలో 'సర్‌' (SIR) అంశంపై విభేదాలు ఏర్పడ్డాయంటూ వచ్చిన వార్తలు దేశవ్యాప్తంగా రాజకీయ దుమారానికి దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్‌ కుమార్‌కు వ్యతిరేకంగా దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు అత్యంత కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక వార్తాపత్రిక కథనం ఆధారంగా మాత్రం సీఈసీపై ఎలాంటి ఉత్తర్వులు జారీ చేయలేమని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

మిగిలిన ఎన్నికల కమిషనర్లకు రాజ్యాంగబద్ధంగా కేటాయించిన అధికారాలను సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌‌ ఏకపక్షంగా వినియోగించుకోవచ్చా లేదా అనే కోణాన్ని పరిశీలిస్తామని కోర్టు తెలిపింది. అంతకంటే ముందు ఈ వార్తలపై ఎన్నికల సంఘం అధికారిక స్పందనను పరిగణనలోకి తీసుకుంటామని పేర్కొంటూ ఈసీకి నోటీసులు జారీ చేసింది.

ఓట్ల తొలగింపు నిర్ణయాలను సీఈసీ ఏకపక్షంగా తీసుకున్నారని పిటిషనర్లు నిరూపిస్తే.. తదుపరి తగిన చర్యలకు ఆదేశిస్తామని ధర్మాసనం వెల్లడించింది. ఈ అంశంపై దాఖలైన ఇతర పిటిషన్లను సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారణకు స్వీకరించింది.

2025 జూన్‌ నుంచి ఇప్పటివరకు 'సర్‌' ప్రక్రియలో భాగంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో తొలగించిన 13 కోట్లకు పైగా ఓట్లపై సిట్‌ (SIT) ద్వారా విచారణ జరపాలని పిటిషనర్లు కోర్టును విజ్ఞప్తి చేశారు. అలాగే సీఈసీ తీసుకున్న ఏకపక్ష నిర్ణయాలను రద్దు చేయాలని అభ్యర్థించారు.

వివాదానికి అసలు కారణం ఏమిటి?

'సర్‌' ప్రక్రియలో భాగంగా ఓట్ల తొలగింపు మరియు చేర్పులపై గడచిన 10 నెలల్లో ఇద్దరు ఎన్నికల కమిషనర్లు (సంధూ, జోషి) ఏకంగా 14 సార్లు అభ్యంతరాలు వ్యక్తంచేశారంటూ ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ వార్తలు కలకలం రేపడంతో సీఈసీ ఏకపక్ష నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు, విద్యార్థి సంఘాలు, సామాజిక కార్యకర్తలు పెద్దఎత్తున నిరసనలు చేపట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలోనే సుప్రీంకోర్టులో ఈ పిటిషన్ దాఖలు కావడం గమనార్హం.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.