Social Media: పిల్లలు ఫోన్లలో రీల్స్ చూడాలంటే పెద్దల పర్మిషన్ తీసుకోవాల్సిందేనా.. కోర్టు ఏమన్నదంటే ?
Social Media: ప్రస్తుత ఆధునిక కాలంలో చిన్నారులు సైతం స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను విపరీతంగా వాడేస్తున్నారు.
Social Media
Social Media: ప్రస్తుత ఆధునిక కాలంలో చిన్నారులు సైతం స్మార్ట్‌ఫోన్‌లు, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను విపరీతంగా వాడేస్తున్నారు. చిన్న వయసులోనే పిల్లలు ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ వంటి యాప్‌లకు అలవాటు పడిపోవడం వల్ల అనేక ప్రమాదాలు ముంచుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు సోషల్ మీడియా వినియోగంపై అత్యంత కీలకమైన నిర్ణయం దిశగా అడుగులు వేసింది. మైనర్ పిల్లలు సోషల్ మీడియా ఖాతాలను తెరవాలంటే తల్లిదండ్రుల లేదా లీగల్ గార్డియన్ల అనుమతి తప్పనిసరిగా ఉండేలా నిబంధనలు రూపొందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
18 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల అనుమతి
సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పిల్లల భద్రతను మరింత కఠినతరం చేయాలని కోరుతూ జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ అలయన్స్ అనే స్వచ్ఛంద సంస్థ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై చీఫ్ జస్టిస్ సూర్య కాంత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం సోమవారం నాడు విచారణ జరిపింది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు ఎవరైనా సోషల్ మీడియాలో అకౌంట్ క్రియేట్ చేయాలంటే వారి తల్లిదండ్రుల ముందస్తు అనుమతి లేదా సమ్మతి ఉండాలనే నిబంధనను తీసుకురావాలని కోర్టు పరిశీలిస్తోంది. దీనిపై కేంద్ర ప్రభుత్వం తరఫున హాజరైన సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఈ అంశాన్ని పరిశీలిస్తామని కోర్టుకు తెలిపారు.
సోషల్ మీడియా నిబంధనలు
భారతీయ చట్టాల ప్రకారం 18 సంవత్సరాల వయసు నిండని వారు ఎటువంటి చట్టపరమైన ఒప్పందాలు లేదా కాంట్రాక్టులు చేసుకోవడానికి అర్హులు కరువవుతారు. కానీ సోషల్ మీడియా యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకునే సమయంలో వచ్చే టర్మ్స్ అండ్ కండిషన్స్‌ను పిల్లలు ఆమోదించడం చట్టపరంగా సరిపోతుందా అనే ప్రశ్నలు ఈ సందర్భంగా ఉత్పన్నమయ్యాయి. ఈ అంశాన్ని కేవలం మార్గదర్శకాల రూపంలో కాకుండా ఒక పటిష్టమైన చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్ కింద తీసుకురావాలని కోర్టు కేంద్రాన్ని ఆదేశించింది. ఈ మ్యాటర్ మరో నాలుగు వారాల్లో విచారణకు రానుంది.
పిల్లలు ఎదుర్కొంటున్న ఆన్‌లైన్ ముప్పులు
చిన్నారులు సోషల్ మీడియాను విచ్చలవిడిగా వాడటం వల్ల ఆన్‌లైన్ గ్రూమింగ్, లైంగిక వేధింపులు, సైబర్ బ్యుల్లింగ్, సెక్స్టార్షన్, వ్యక్తిగత సమాచారం దుర్వినియోగం కావడం వంటి తీవ్రమైన ప్రమాదాల బారిన పడుతున్నారు. చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు 13 సంవత్సరాలు దాటిన పిల్లలు అకౌంట్లు క్రియేట్ చేయడానికి అనుమతిస్తున్నాయి. అయితే ఇది మన దేశంలోని మైనర్ల చట్టపరమైన ఫ్రేమ్‌వర్క్‌కు ఏ విధంగా సరిపోతుందనే దానిపై తీవ్రమైన చర్చ జరుగుతోంది. పిల్లల ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం ఈ-కేవైసీ లేదా తగిన గుర్తింపు తనిఖీలను ప్రవేశపెట్టాలని పిటిషనర్లు కోరుతున్నారు.
అంతర్జాతీయ నిబంధనల ప్రభావం
ప్రపంచవ్యాప్తంగా పిల్లల సోషల్ మీడియా యాక్సెస్ పై ఆంక్షలు పెరుగుతున్నాయి. ఆస్ట్రేలియా దేశం 16 సంవత్సరాల కంటే తక్కువ వయసున్న పిల్లలు సోషల్ మీడియా వాడకుండా కఠినమైన నిబంధనలను తీసుకువచ్చింది. ఇటీవల జరిగిన ఆస్ట్రేలియా-భారత్ లీడర్స్ సమ్మిట్‌లో మన దేశ ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఆస్ట్రేలియా విధానాల నుంచి కొన్ని పాఠాలు నేర్చుకుంటున్నామని తెలిపారు. కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ వంటి కొన్ని రాష్ట్రాలు కూడా పిల్లల సోషల్ మీడియా వాడకంపై ఆంక్షలు విధించే అంశాలను పరిశీలిస్తున్నాయి.




