దీపావళికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. రెండు రోజులే పటాకులు కాల్చేందుకు అనుమతి!

Supreme Court: దీపావళి పండుగ వేళ ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రజలకు సుప్రీంకోర్టు శుభవార్త తెలిపింది. దీపావళికి ముందు రోజు , పండుగ రోజు అయిన నవంబర్ 7, 8 తేదీల్లో పరిమిత వేళల్లో గ్రీన్ పటాకులు కాల్చుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది.

G Krishna
Published on: 2 Nov 2026 4:15 PM IST
Supreme Court
X

దీపావళికి సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్.. రెండు రోజులే పటాకులు కాల్చేందుకు అనుమతి!

Supreme Court: దీపావళి పండుగ వేళ ఢిల్లీ-ఎన్‌సీఆర్ ప్రజలకు సుప్రీంకోర్టు శుభవార్త తెలిపింది. దీపావళికి ముందు రోజు , పండుగ రోజు అయిన నవంబర్ 7, 8 తేదీల్లో పరిమిత వేళల్లో గ్రీన్ పటాకులు (గ్రీన్ క్రాకర్స్) కాల్చుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం అనుమతినిచ్చింది.

జస్టిస్ ఎం.ఎం. సుందరేష్, జస్టిస్ ప్రసన్న బి. వరాలేలతో కూడిన ధర్మాసనం ఈ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు, అలాగే తిరిగి రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు మాత్రమే బాణసంచా కాల్చేందుకు అనుమతించింది.

మార్గదర్శకాలు అమలైతేనే ఫలితం.. కేంద్రంపై ఫైర్

పటాకుల నియంత్రణపై ఎన్ని ఉత్తర్వులు జారీ చేసినా క్షేత్రస్థాయిలో కఠినంగా అమలు చేయకపోతే ప్రయోజనం ఉండదని ధర్మాసనం స్పష్టం చేసింది. "ఇది ప్రతీ జీవి ఆరోగ్యానికి సంబంధించిన అంశం. గ్రౌండ్ లెవెల్‌లో కఠినంగా అమలు చేయనప్పుడు ఆదేశాలు ఇవ్వడంలో అర్థం లేదు, అది విడ్డూరంగా మారుతుంది" అని కోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది.

ప్రజల సెంటిమెంట్లను కూడా తాము అర్థం చేసుకుంటున్నామని, అందుకే పూర్తిస్థాయి నిషేధం విధించలేదని తెలిపింది. నియంత్రణ ఉత్తర్వులను అధికారులు తీవ్రంగా పరిగణించి ఖచ్చితంగా పాటించేలా చూడాలని, తమను కఠిన నిర్ణయాలు తీసుకునేలా నెట్టవద్దని కేంద్రం తరఫున హాజరైన అదనపు సొలిసిటర్ జనరల్ (ASG) ఐశ్వర్య భాటికి స్పష్టం చేసింది.

కాలుష్య నియంత్రణకు ఢిల్లీ సర్కార్ కార్యాచరణ

శీతాకాలంలో ఢిల్లీలో పెరిగే వాయు కాలుష్యాన్ని కట్టడి చేసేందుకు కేంద్రం, ఢిల్లీ ప్రభుత్వం , వాయు నాణ్యత యాజమాన్య కమిషన్ (CAQM) చేపడుతున్న చర్యలను ASG ఐశ్వర్య భాటి కోర్టుకు వివరించారు. పాత వాహనాలపై ఆంక్షలు, నిర్మాణ రంగ కార్యకలాపాలపై నియంత్రణ, ఆఫీసు వేళల్లో మార్పులు (స్టాగర్డ్ టైమింగ్స్) వంటి పలు చర్యలతో కూడిన ప్రణాళిక నవంబర్ నుంచి అమలులోకి రానుందని తెలిపారు.

అలాగే పటాకుల్లో బేరియం రసాయనం వాడకంపై అంతర్గత సంప్రదింపులు జరుగుతున్నాయని, దీనిపై నిర్ణయానికి మూడు వారాల గడువు కావాలని కోరగా సుప్రీంకోర్టు సమ్మతించింది.

గ్రీన్ పటాకుల పేరిట నకిలీలు.. కోర్టు దృష్టికి తెచ్చిన పిటిషనర్లు

సాధారణ బాణసంచాను గ్రీన్ పటాకుల పేరిట మార్కెట్లో విచ్చలవిడిగా విక్రయిస్తున్నారని, దీనిని పర్యవేక్షించేందుకు సరైన వ్యవస్థ లేదని కోర్టుకు అమికస్ క్యూరీ , పిటిషనర్ల తరఫు న్యాయవాది గోపాల్ శంకరనారాయణన్ వివరించారు.

దసరా సమయంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) గణనీయంగా పడిపోయిందని, పటాకుల తయారీపైనే నిషేధం విధించాలని కోరారు. దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు, పర్యావరణ పరిరక్షణపై క్రీడాకారులు, ప్రముఖుల ద్వారా అవగాహన కల్పించాలని, అధికారులు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.