సోనియా పుస్తకం చించబోయి.. బాల్ థాకరే ఫొటోతో షైనా చిక్కుల్లో

Sonia Gandhi: సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్’ (Belonging) పుస్తక నిరసన ప్రదర్శనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన చేపట్టిన ఈ నిరసన కాస్తా రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది.

G Krishna
Published on: 18 Nov 2026 7:11 PM IST
Sonia Gandhi
X

సోనియా పుస్తకం చించబోయి.. బాల్ థాకరే ఫొటోతో షైనా చిక్కుల్లో

Sonia Gandhi: సోనియా గాంధీ రాసిన ‘బిలాంగింగ్’ (Belonging) పుస్తక నిరసన ప్రదర్శనలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. ఏక్‌నాథ్ శిండే నేతృత్వంలోని శివసేన చేపట్టిన ఈ నిరసన కాస్తా రాజకీయంగా పెద్ద దుమారానికి దారితీసింది. సోనియా గాంధీ పుస్తకానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న సమయంలో, శివసేన నేత షైనా ఎన్సీ పొరపాటున పార్టీ వ్యవస్థాపకులు బాల్ థాకరే ఫోటోను చింపేశారంటూ ప్రత్యర్థి వర్గాలు ఆరోపించడం కలకలం సృష్టించింది.

పుస్తక ప్రదర్శన నిరసనలో అసలు ఏం జరిగింది?

కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఆత్మకథ అయిన ‘బిలాంగింగ్’ పుస్తకంలో వీర్ సావర్కర్‌ను కించపరిచేలా వ్యాఖ్యలున్నాయని, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారని ఆరోపిస్తూ ఏక్‌నాథ్ శిందే నేతృత్వంలోని శివసేన బుధవారం ఆందోళన చేపట్టింది. ఈ నిరసనలో భాగంగా శివసేన నేతలు షైనా ఎన్సీ, సంజయ్ నిరుపమ్, ఆనంద్ దూబే తదితరులు ఆ పుస్తకంలోని పేజీలను చించివేశారు. పబ్లిషర్ హార్పర్‌కోలిన్స్ ఆ పుస్తకంలోని నిర్దిష్ట పేజీలను తొలగించాలని డిమాండ్ చేశారు.

అయితే పేజీలు చుస్తున్న సమయంలో, కాంగ్రెస్ నేత మణిశంకర్ అయ్యర్ దిష్టిబొమ్మను బాల్ థాకరే చెప్పుతో కొడుతున్నట్లు ఉన్న ఒక పాత ఫోటోను కూడా షైనా ఎన్సీ చింపేశారు. పక్కనే ఉన్న సంజయ్ నిరుపమ్ దీన్ని గమనించి ఆమెను వారించగా, షైనా ఆ తప్పును సరిదిద్దుకునే ప్రయత్నంలో త్వరత్వరగా ఆ పేపర్‌ను కింద దాచేశారు. ఉద్ధవ్ థాకరే వర్గాన్ని ఇరుకున పెట్టేందుకే శిందే వర్గం ఈ ఫోటోను ఆందోళనకు తెచ్చినట్లు తెలుస్తోంది. బాల్ థాకరే కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ, ఉద్ధవ్ సేన ప్రస్తుతం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవడాన్ని ఎత్తిచూపేందుకు ఈ ఫోటోను ప్రదర్శించాలని భావించారు.

షైనా ఎన్సీ స్పష్టత.. ఉద్ధవ్ సేన, కాంగ్రెస్ తీవ్ర మండిపాటు

ఈ ఘటనపై దుమారం చెలరేగడంతో షైనా ఎన్సీ స్పందిస్తూ.. తాను బాల్ థాకరే ఫోటోను కాదని, మణిశంకర్ అయ్యర్ చిత్రాన్ని మాత్రమే చంపానని వివరణ ఇచ్చారు. 2004లో మణిశంకర్ అయ్యర్ వీర్ సావర్కర్‌పై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ బాల్ థాకరే స్వయంగా చెప్పుతో దిష్టిబొమ్మను కొట్టిన ఘటనకు సంబంధించిన ఫోటో అది అని శిందే వర్గం స్పష్టం చేసింది.

మరోవైపు ఈ ఘటనపై ఉద్ధవ్ థాకరే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) , కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. బాల్ థాకరేను అవమానించిన వారు అసలైన సైనికులు కారంటూ యూబీటీ ఎంపీ సంజయ్ రౌత్ ధ్వజమెత్తారు. బాల్‌సాహెబ్‌ను అవమానిస్తే ఎవరూ సహించబోరని మాజీ మేయర్ కిషోరి పెడ్నేకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ అంశంపై బీఎంసీలోనూ తీవ్ర గందరగోళం చెలరేగింది. ఉద్ధవ్ సేన కార్పొరేటర్లు షైనా ఎన్సీకి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. కాంగ్రెస్ నేతలు నానా పటోలే, వర్షా గైక్వాడ్ కూడా స్పందిస్తూ ఇది మహారాష్ట్ర ఆత్మగౌరవానికి, కోట్ల మంది శివసైనికుల మనోభావాలకు జరిగిన తీవ్రమైన అవమానమని మండిపడ్డారు. ఈ వివాదం ముప్పేట దాడికి దారితీయడంతో, ఏక్‌నాథ్ శిందే స్వయంగా షైనా ఎన్సీని అసెంబ్లీకి పిలిపించి చర్చలు జరపడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.