ఎస్‌బీఐ డేటా లీక్‌.. 3,897 మంది ఖాతాదారులకు అలర్ట్‌.!

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు సంబంధించిన కీలక సమాచారం డార్క్‌వెబ్‌లో లీకైనట్లు వస్తున్న వార్తలపై బ్యాంక్ మేనేజ్‌మెంట్

G Krishna
Published on: 23 Oct 2026 3:54 PM IST
SBI Customer Data Leak Dark Web
X

SBI Customer Data Leak Dark Web

దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) ఖాతాదారులకు సంబంధించిన కీలక సమాచారం డార్క్‌వెబ్‌లో లీకైనట్లు వస్తున్న వార్తలపై బ్యాంక్ మేనేజ్‌మెంట్ కీలక ప్రకటన విడుదల చేసింది. ఇటీవల జరిగిన ఒక సైబర్ ఘటనలో సుమారు 3,897 మంది ఖాతాదారులకు సంబంధించిన వ్యక్తిగత వివరాలు డార్క్‌వెబ్‌లో బయటపడిన మాట వాస్తవమేనని ఎస్‌బీఐ స్పష్టం చేసింది. అయితే, ప్రభావితమైన ఖాతాదారుల బ్యాంకు ఖాతాల్లోని నగదు, నిల్వలు మాత్రం పూర్తిగా సురక్షితంగా ఉన్నాయని, ఎవరి సొమ్ముకూ ఎలాంటి ప్రమాదం లేదని స్పష్టమైన భరోసా కల్పించింది. ఈ మేరకు ప్రభావితమైన ఖాతాదారులందరికీ ఈమెయిల్ లేదా వాట్సాప్ ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందించినట్లు శుక్రవారం సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.

స్టాక్ ఎక్స్ఛేంజీకి నివేదిక.. లీకైన వివరాల జాబితా

ఈ వారంలోనే తన ఖాతాదారుల సమాచారానికి సంబంధించిన డేటా లీక్ ఘటనను ఎస్‌బీఐ ధ్రువీకరించింది. డార్క్‌వెబ్‌లో అందుబాటులో ఉన్న సుమారు 3.75 లక్షల రికార్డులను ప్రాథమికంగా పరిశీలించగా, అందులో 3,897 మంది ఖాతాదారులకు సంబంధించిన వ్యక్తిగత గుర్తింపు వివరాలు ఉన్నట్లు గుర్తించామని స్టాక్‌ ఎక్స్ఛేంజీకి తెలిపింది. థ్రెట్‌ ఇంటెలిజెన్స్ సర్వీస్ ప్రొవైడర్, డిఫెన్స్ సైబర్ ఏజెన్సీ , భారత కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) హెచ్చరికలతో ఈ విషయం బయటపడింది. ఈ లీకైన సమాచారంలో ఖాతాదారుల పేర్లు, మొబైల్ నంబర్లు, పుట్టిన తేదీలు, ఈమెయిల్, నివాస చిరునామాలతో పాటు బ్యాంకు శాఖ వివరాలు, సీఐఎఫ్ గుర్తింపు సంఖ్యలు, రుణాలకు సంబంధించిన మెటాడేటా ఫైళ్లు ఉన్నట్లు బ్యాంకు గుర్తించింది.

ఖాతాదారులకు హెచ్చరికలు , తక్షణ భద్రతా చర్యలు

ఖాతాల్లోని డబ్బు సురక్షితంగా ఉన్నప్పటికీ డిజిటల్ బ్యాంకింగ్ సేవలను ఉపయోగించేటప్పుడు ఖాతాదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఎస్‌బీఐ కోరింది. వన్ టైమ్ పాస్‌వర్డ్ (OTP), పిన్, పాస్‌వర్డ్‌లను ఎవరితోనూ పంచుకోవద్దని, అనుమానాస్పద ఫోన్ కాల్స్, ఫేక్ మెసేజ్‌లు, ఈమెయిళ్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది. ఈ సైబర్ ఘటనపై వెంటనే రంగంలోకి దిగిన ఎస్‌బీఐ, సర్ట్-ఇన్ గుర్తింపు పొందిన ఒక స్వతంత్ర సైబర్ భద్రతా ఏజెన్సీని నియమించి సమగ్ర పరిశీలన జరుపుతోంది. బయటపడిన సమాచారం ఎక్కడి నుంచి లీకైంది, దాని పరిధి ఎంత, భవిష్యత్తులో ఎలాంటి ముప్పు పొంచి ఉందనే అంశాలపై ప్రస్తుతం ముమ్మరంగా దర్యాప్తు కొనసాగుతోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.