Rajnath Singh: ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తే ఉపేక్షించేది లేదు.. పాకిస్థాన్‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్!

Rajnath Singh: షాంఘై సహకార సంస్థ (SCO) సమావేశంలో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఉగ్రవాదంపై విరుచుకుపడ్డారు.

Arun Chilukuri
Published on: 21 Oct 2026 10:36 AM IST
Rajnath Singh
X

Rajnath Singh: ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తే ఉపేక్షించేది లేదు.. పాకిస్థాన్‌కు కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ స్ట్రాంగ్ కౌంటర్!

Rajnath Singh: ఉగ్రవాద వ్యవస్థను సమష్టిగా, దృఢ సంకల్పంతో సమూలంగా నిర్మూలించాలని కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చారు. ఈ విషయంలో ఎలాంటి ద్వంద్వ ప్రమాణాలకు తావుండకూడదని స్పష్టం చేశారు. తజికిస్థాన్ రాజధాని దుషాంబేలో నిర్వహించిన 'షాంఘై సహకార సంస్థ' (SCO) దేశాల ప్రభుత్వాధినేతల మండలి సమావేశంలో భారత్ తరఫున ఆయన పాల్గొని ప్రసంగించారు.

ఈ ఉన్నత స్థాయి సమావేశంలో రాజ్‌నాథ్ సింగ్ మాట్లాడుతూ.. ఉగ్రవాదులకు నిధులు సమకూర్చేవారు, వారికి మద్దతుగా నిలిచే శక్తులు, ఆశ్రయమిచ్చే దేశాల పట్ల అత్యంత కఠినంగా వ్యవహరించాలని కోరారు. ఉగ్రవాదం అనేది అమాయకుల ప్రాణాలను బలి తీసుకోవడమే కాకుండా, విదేశీ పెట్టుబడులు, అంతర్జాతీయ వాణిజ్యానికి తీవ్ర ఆటంకంగా మారుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇది సమాజాన్ని తీవ్రవాదం వైపు మళ్లించి, యువత ఉజ్వల భవిష్యత్తును నాశనం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. పాకిస్థాన్ ఉప ప్రధాని ఇషాక్ దార్ సమక్షంలోనే రాజ్‌నాథ్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేయడం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యం సంతరించుకుంది.

అలాగే, భారత్ త్వరలో ఆతిథ్యమివ్వనున్న తొలి ‘ఎస్‌సీవో సివిలైజేషన్ డైలాగ్ ఫోరమ్’ (SCO Civilization Dialogue Forum) కు సభ్య దేశాలన్నింటినీ రాజ్‌నాథ్ సింగ్ సాదరంగా ఆహ్వానించారు. సభ్య దేశాల మధ్య ప్రజల సంబంధాలను బలోపేతం చేయడం, ప్రాచీన నాగరికతలు, కళలు, సాహిత్యం, సంప్రదాయాల విశిష్టతను ప్రపంచానికి చాటడానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గతంలో ఈ ఫోరమ్‌ను ప్రతిపాదించిన విషయాన్ని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.