రాజస్థాన్ రైలు పేలుడు వెనుక పాక్ హ్యాండ్లర్.. ఇద్దరు అరెస్ట్
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లా రామ్‌సింగ్‌పూర్ పరిధిలో రైల్వే ట్రాక్‌పై జరిగిన బాంబు పేలుడు కేసులో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. రాజస్థాన్..
Rajasthan Railway Track Blast
రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్ జిల్లా రామ్‌సింగ్‌పూర్ పరిధిలో రైల్వే ట్రాక్‌పై జరిగిన బాంబు పేలుడు కేసులో భద్రతా బలగాలకు భారీ విజయం లభించింది. రాజస్థాన్ , పంజాబ్ పోలీసులు సంయుక్తంగా నిర్వహించిన ఆపరేషన్‌లో పంజాబ్‌లోని గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన ఇద్దరు ప్రధాన నిందితులను ఆదివారం అరెస్టు చేశారు. పట్టుబడిన నిందితులను దేవేంద్ర సింగ్ (దవిందర్ సింగ్) , 24 ఏళ్ల మహక్‌దీప్ కౌర్ (మహక్‌ప్రీత్ కౌర్)గా గుర్తించారు. గత నవంబర్ 3న అనూప్‌గఢ్-సూరత్‌గఢ్ రైల్వే మార్గంలోని 50 జీబీ గ్రామం సమీపంలో పట్టాలపై జరిగిన పేలుడు ఘటన వెనుక వీరి హస్తం ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వీరితో పాటు మరికొందరు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
పంజాబ్ సరిహద్దు గ్రామాల్లో మెరుపు దాడి.. భారీగా ఆయుధాల స్వాధీనం
పేలుడు ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన రాజస్థాన్ పోలీసులకు పంజాబ్ సరిహద్దు గ్రామాలకు చెందిన కొందరు అనుమానితులపై కీలక ఆధారాలు లభించాయి. దీంతో రాజస్థాన్ ఏడీజీపీ దినేష్ ఎన్ఎం, సీనియర్ పోలీసు అధికారి నితిన్ చౌదరి నేతృత్వంలోని ప్రత్యేక బృందం పంజాబ్ చేరుకుంది. గురుదాస్‌పూర్ జిల్లా కలానౌర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని దోస్త్‌పూర్ పోలీసుల సహకారంతో దోస్త్‌పూర్ గ్రామానికి చెందిన మహక్‌ప్రీత్ కౌర్, సమీపంలోని చౌడా కలాన్ గ్రామానికి చెందిన దవిందర్ సింగ్‌లను అదుపులోకి తీసుకున్నారు. సోదాల్లో వీరి వద్ద నుంచి ఒక బెరెట్టా 9 ఎంఎం పిస్టల్, ఒక 30 బోర్ పిస్టల్‌తో పాటు సుమారు 40 తూటాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రెండుసార్లు విఫలం.. మూడోసారి పేలుడుకు పాక్ హ్యాండ్లర్ నిధులు
ఈ కుట్ర వెనుక ఉన్న సంచలన విషయాలను గురుదాస్‌పూర్ ఎస్ఎస్పీ ఆదిత్య మీడియాకు వెల్లడించారు. రైల్వే ట్రాక్‌ను పేల్చివేసేందుకు ఈ ఇద్దరు నిందితులు మొత్తం మూడుసార్లు రాజస్థాన్‌కు వెళ్లినట్లు విచారణలో తేలింది. మొదటిసారి వెళ్లినప్పుడు పేలుడు పదార్థాలు అందకపోవడంతో వెనుదిరిగారని, రెండోసారి సాంకేతిక కారణాలతో పేలుడు జరపడంలో విఫలమయ్యారని ఎస్ఎస్పీ తెలిపారు. చివరకు మూడో ప్రయత్నంలో పట్టాలపై పేలుడు జరిపినట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్ కోసం పాకిస్థాన్‌లో ఉంటున్న 'షా' అనే వ్యక్తి సదరు యువతికి లక్ష రూపాయలు పంపినట్లు దర్యాప్తులో బయటపడింది. ఇందులో రూ.30 వేల నగదును పోలీసులు రికవరీ చేశారు. పక్కా సమాచారంతో నిందితులను పట్టుకున్న పోలీసులు, ఈ ఉగ్ర కుట్ర వెనుక ఇంకా ఎవరెవరు ఉన్నారనే కోణంలో లోతైన విచారణ జరుపుతున్నారు.




