Rahul Gandhi: ఓటు చోరీపై రాహుల్ సమరశంఖం.. నవంబర్ 1న ఢిల్లీలో మెగా ర్యాలీ

Rahul Gandhi: ఓటు చోరీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు.

G Krishna
Published on: 25 Oct 2026 4:17 PM IST
Rahul Gandhi
X

Rahul Gandhi: ఓటు చోరీపై రాహుల్ సమరశంఖం.. నవంబర్ 1న ఢిల్లీలో మెగా ర్యాలీ

Rahul Gandhi: ఓటు చోరీ ఆరోపణలపై కేంద్ర ప్రభుత్వాన్ని లక్ష్యంగా చేసుకుని కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మరోసారి విమర్శలు గుప్పించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రజలంతా ఒక్కటవ్వాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత నవంబర్ 1న ఢిల్లీలోని రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించనున్న ఇండియా కూటమి ర్యాలీకి పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. ఓటు హక్కును కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.

ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై ఆరోపణలు

ఓట్ల చోరీని ఎట్టి పరిస్థితుల్లోనూ మౌనంగా సహించబోమని రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా హిందీలో పోస్టు చేశారు. ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించారని, నిబంధనలు, చట్టాలను ఉల్లంఘించారని ఆరోపించారు. ఈ అంశాలపై ప్రశ్నించిన వారిపై లాఠీచార్జి జరిగిందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉన్న విద్యార్థులు, రైతులు, కార్మికులు, మహిళలు, యువత, వ్యాపారులు ర్యాలీలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటు మీదే.. పోరాటం కూడా మీదేనని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ర్యాలీ గురించి ప్రచారం చేస్తున్నందుకు బీజేపీ, దాని మిత్రపక్షాలకు వ్యంగ్యంగా ధన్యవాదాలు తెలిపారు.

లక్ష మందితో ర్యాలీకి కాంగ్రెస్ సన్నాహాలు

ఓట్ల చోరీ ఆరోపణలు, ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR)లో అక్రమాలు జరిగాయన్న అభ్యంతరాలతో చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్‌కు ముగింపుగా ఈ భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఈ సభకు కనీసం లక్ష మంది హాజరవుతారని కాంగ్రెస్ అంచనా వేస్తోంది. ప్రజాస్వామ్యాన్ని కేంద్రం బలహీనపరుస్తోందన్న తమ ఆరోపణలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమాన్ని వేదికగా చేసుకుంటోంది.

ర్యాలీ తేదీపై బీజేపీ అభ్యంతరం

మరోవైపు నవంబర్ 1న ర్యాలీ నిర్వహించాలన్న కాంగ్రెస్ నిర్ణయాన్ని బీజేపీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ విమర్శించారు. 1984 సిక్కు వ్యతిరేక అల్లర్ల బాధితుల మనోభావాలను పట్టించుకోకుండా అదే తేదీని ఎంచుకున్నారని ఆరోపించారు. వ్యాపార కార్యకలాపాలకు అంతరాయం కలగవచ్చన్న ఆందోళనతో కొన్ని వ్యాపార సంఘాలు కూడా ర్యాలీని రద్దు చేయాలని కోరినట్లు సమాచారం. దీంతో ర్యాలీకి ముందు కాంగ్రెస్, బీజేపీ మధ్య రాజకీయ విమర్శలు మరింత తీవ్రంగా మారాయి. ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్ తన ప్రచారాన్ని కొనసాగిస్తుండగా, ర్యాలీ తేదీ, దాని ప్రభావంపై బీజేపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తోంది.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.