తల్లిదండ్రుల ప్రేమపై విమర్శలు.. శివపార్వతుల ఫొటోతో రాహుల్ ఘాటు సమాధానం

Rahul Gandhi: తన తల్లి సోనియా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీల మధ్య ఉన్న అనుబంధాన్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలకు లోక్‌సభ ప్రతిపక్ష.

G Krishna
Published on: 17 Nov 2026 5:28 PM IST
Rahul Gandhi
X

తల్లిదండ్రుల ప్రేమపై విమర్శలు.. శివపార్వతుల ఫొటోతో రాహుల్ ఘాటు సమాధానం

Rahul Gandhi: తన తల్లి సోనియా గాంధీ, తండ్రి రాజీవ్ గాంధీల మధ్య ఉన్న అనుబంధాన్ని ఉద్దేశించి తాను చేసిన వ్యాఖ్యలపై వెల్లువెత్తుతున్న విమర్శలకు లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం గట్టి సమాధానమిచ్చారు. భయం, కోపం, ద్వేషం అనే సాలెగూడులో చిక్కుకోవడం వల్లే బీజేపీ, ఆరెస్సెస్ మద్దతుదారులు ప్రేమను అనుభవించలేకపోతున్నారని, వ్యక్తపరచలేకపోతున్నారని ఆయన విమర్శించారు. ఒక నిజమైన హిందువుగా వారిని ఆ ద్వేషపు వలయం నుంచి బయటపడేసి, ప్రేమ, ఆప్యాయతల ఆనందాన్ని అందించడం తన బాధ్యత అంటూ రాహుల్ గాంధీ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు.

శివపార్వతుల శిల్పంతో రాహుల్ గాంధీ భావోద్వేగ పోస్ట్

తన పోస్ట్‌లో భాగంగా రాహుల్ గాంధీ నంది వాహనంపై ఆప్యాయంగా కూర్చున్న శివపార్వతుల ప్రాచీన ఆలయ శిల్పం ఫోటోను పంచుకున్నారు. ఆదిదంపతుల మధ్య ఉన్న కరుణ, ప్రేమ, లోతైన బంధాన్ని ఈ శిల్పం ప్రతిబింబిస్తుందని ఆయన పేర్కొన్నారు. చివరగా 'సత్యం శివం సుందరం' అని రాస్తూ విమర్శకులకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.

అసలు వివాదానికి కారణమేమిటి?

సోమవారం న్యూఢిల్లీలో తన తల్లి సోనియా గాంధీ ఆత్మకథ 'బిలాంగింగ్: ఎ జర్నీ ఆఫ్ లవ్' పుస్తకావిష్కరణ కార్యక్రమంలో రాహుల్ గాంధీ మాట్లాడుతూ తమ కుటుంబ జ్ఞాపకాలను పంచుకున్నారు. తమ తల్లిదండ్రుల మధ్య ప్రేమ రోజువారీ పనుల్లో ఎంతో సహజంగా కనిపించేదని చెబుతూ.. ప్రతి భోజన సమయంలో నాన్న ఒడిలో అమ్మ కూర్చునేదని, అది తనకు ఎంతో సాధారణ విషయంగా అనిపించేదని రాహుల్ వివరించారు. ఎంతలా అంటే, చిన్నప్పుడు తన స్నేహితుడిని మీ అమ్మ కూడా మీ నాన్న ఒడిలో ఎందుకు కూర్చోదు అని అడిగినట్లు ఆయన గుర్తుచేసుకున్నారు. అలాగే కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో రాజీవ్ గాంధీ మాట్లాడుతున్నప్పుడు సోనియా ఏదో చెప్పబోయి ఒత్తిడికి గురైన సందర్భంలో మాత్రమే తన సోదరి ప్రియాంక, తాను తల్లిదండ్రుల మధ్య చిన్నపాటి వాగ్వాదాన్ని చూశామని రాహుల్ తెలిపారు.

సోషల్ మీడియాలో భిన్న స్పందనలు.. బీజేపీ విమర్శలు

రాహుల్ గాంధీ చేసిన ఈ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు అనిర్బన్ గంగూలీ దీనిపై స్పందిస్తూ.. సాదాసీదాతనం ముసుగులో ఉన్న సిగ్గుమాలినతనంగా అభివర్ణించారు. కుటుంబ భోజనపు బల్లపై విషయాలకు, బహిరంగ వేదికపై మాట్లాడాల్సిన విషయాలకు తేడా తెలియని 55 ఏళ్ల వ్యక్తికి పీఎంవో రహస్య ఫైళ్లు ఇస్తే ఏం చేస్తారోనని ఆయన ఎద్దేవా చేశారు. మరికొందరు నెటిజన్లు ఇది భారతీయ సంస్కృతికి విరుద్ధమని, గాంధీ కుటుంబాన్ని, కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెట్టడంలో రాహుల్ దిట్ట అని విమర్శించారు.

రాహుల్ వ్యాఖ్యలకు మద్దతుగా నెటిజన్లు

మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను సమర్థిస్తూ పలువురు నెటిజన్లు పోస్టులు పెట్టారు. సోనియా, రాజీవ్ గాంధీల మధ్య ఉన్న నిజమైన ప్రేమను ఆయన ఎంతో నిజాయితీగా పంచుకున్నారని, ఈ కథ ఎంతోమంది యువ జంటలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. తల్లిదండ్రుల మధ్య ఆప్యాయతను తప్పుబట్టే వారికి ప్రేమ అనేది ఒక కొత్త విషయంగా అనిపిస్తోందని, మహిళలు కేవలం సేవలు చేయడానికే ఉన్నారని భావించే వారికి ఇలాంటి అనుబంధాలు అర్థం కావని మరికొందరు విమర్శకులకు కౌంటర్ ఇచ్చారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.