Rahul Gandhi: రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఊరుకోం.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్!
Rahul Gandhi: ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన 'ఇండియా' (INDIA) కూటమి భారీ బహిరంగ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
Rahul Gandhi: రాజ్యాంగాన్ని ముట్టుకుంటే ఊరుకోం.. మోదీ సర్కార్‌పై రాహుల్ ఫైర్!
Rahul Gandhi: ఢిల్లీలోని చారిత్రక రామ్‌లీలా మైదాన్‌లో నిర్వహించిన 'ఇండియా' (INDIA) కూటమి భారీ బహిరంగ సభలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా లేదా ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌లపై తమకు వ్యక్తిగత ద్వేషం లేదని, అయితే వారు దేశ రాజ్యాంగ స్ఫూర్తిని, ప్రజాస్వామ్య వ్యవస్థలను దెబ్బతీస్తున్నారని ఆరోపించారు. తాము హింసకు, ద్వేషానికి తావులేకుండా శాంతియుతంగా పోరాడతామని, కానీ రాజ్యాంగాన్ని ధ్వంసం చేసే కుట్రలను మాత్రం ఎట్టిపరిస్థితుల్లోనూ సహించబోమని స్పష్టం చేశారు. మతం కంటే ప్రతి భారతీయుడి ప్రాథమిక హక్కులే తమకు అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు.
2024 లోక్‌సభ ఎన్నికల్లో 'ఓట్ల చోరీ' జరిగింది
2024 లోక్‌సభ ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగలేదని, అవి 'చోరీ' అయిన ఎన్నికలని రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేశారు. ఈ ఎన్నికల అనంతరం సుమారు 15 శాతం మంది ఓటర్ల పేర్లను జాబితాల నుంచి తొలగించారని, ఈ విషయాన్ని ఎన్నికల సంఘం వివరాలే స్పష్టం చేస్తున్నాయని విమర్శించారు. గతంలో మధ్యప్రదేశ్, హర్యానా, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలతో పాటు 2024 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఈవీఎంల దుర్వినియోగం, ఓటర్ల జాబితాల తారుమారు ద్వారా ఫలితాలను ప్రభావితం చేశారని దుయ్యబట్టారు.
సిఈసి జ్ఞానేశ్ తర్వాత మోదీ వంతే
ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌పై రాహుల్ గాంధీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. జ్ఞానేశ్ కుమార్ వైఖరి వల్ల ఎన్నికల ప్రక్రియ విశ్వసనీయత కోల్పోయిందని, ఆయన తన పదవి నుంచి తప్పుకోవడమే కాకుండా భవిష్యత్తులో జైలుకు వెళ్లక తప్పదని హెచ్చరించారు. "ఓట్ల చోరీ అనేది కేవలం సాధారణ దొంగతనం కాదు.. అది 140 కోట్ల మంది ప్రజల గొంతుకను అణచివేయడమే. ఇది అత్యంత అరుదైన కేసు, దేశద్రోహంతో సమానం" అని అభివర్ణించారు. జ్ఞానేశ్ కుమార్ సహకరించకపోతే మోదీ ప్రధానిగా, అమిత్ షా హోంమంత్రిగా ఉండేవారు కాదని వ్యాఖ్యానించారు. సిఈసి తొలగింపు తర్వాత న్యాయపరమైన చర్యల నుంచి ప్రధాని మోదీ కూడా తప్పించుకోలేరని హెచ్చరించారు.
న్యాయం జరిగే వరకు పోరాటం ఆగేది లేదు
దేశ సంపదనంతా ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల చేతుల్లో కేంద్రీకరిస్తూ, మరోవైపు ఈడీ, సీబీఐ దర్యాప్తు సంస్థలతో భయపెట్టి ప్రతిపక్షాలను అణచివేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. రైతులు తమ పంటకు మద్దతు ధర పొందే, విద్యార్థులకు ఉపాధి అవకాశాలు లభించే సమసమాజ భారత్ తమకు కావాలని పునరుద్ఘాటించారు. తాము ఎవరికీ భయపడేది లేదని, రాజ్యాంగ పరిరక్షణ కోసం , ప్రజాస్వామ్యాన్ని రక్షించేందుకు తమ పోరాటం నిరంతరం కొనసాగుతుందని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు.




