డ్రగ్స్ మాఫియాను నిలదీస్తే.. లైవ్‌లోనే కాల్చి చంపారు..
పంజాబ్‌లో మాదకద్రవ్యాల మహమ్మారికి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతున్న ఒక యువ సామాజిక కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. సింథటిక్ డ్రగ్స్..
Parvinder Singh Jota
పంజాబ్‌లో మాదకద్రవ్యాల మహమ్మారికి వ్యతిరేకంగా నిర్భయంగా పోరాడుతున్న ఒక యువ సామాజిక కార్యకర్త దారుణ హత్యకు గురయ్యారు. సింథటిక్ డ్రగ్స్ అమ్మకాలను ఎండగడుతూ ఎల్లప్పుడూ ముందుండే పర్విందర్ సింగ్ జోతా అనే యాక్టివిస్ట్‌ను ఓ మెడికల్ షాపు యజమాని అతి కిరాతకంగా కాల్చి చంపాడు. అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే, ఈ హత్యకు సంబంధించిన భయానక దృశ్యాలన్నీ బాధితుడి ఫేస్‌బుక్ ఖాతా ద్వారా లైవ్ ప్రసారం కావడం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటన ఇవాళ ఉదయం పంజాబ్‌లోని మాన్సా పట్టణంలో కలకలం రేపింది.
డ్రగ్స్ అమ్మకాల నిలదీతే ప్రాణం తీసింది
గత కొన్ని సంవత్సరాలుగా డ్రగ్స్ మాఫియాపై నిరంతరం పోరాటం చేస్తున్న పర్విందర్ సింగ్ జోతా.. స్థానిక మెడికల్ షాపుల్లో జరుగుతున్న సింథటిక్ , నిషేధిత డ్రగ్స్ అక్రమ విక్రయాలను సోషల్ మీడియా లైవ్ వీడియోల ద్వారా బట్టబయలు చేస్తుంటారు. ఈ క్రమంలోనే ఇవాళ ఉదయం ఆయన అశ్వనీ కుమార్ అనే వ్యక్తికి చెందిన స్థానిక మెడికల్ షాపు వద్దకు వెళ్లారు. అదే షాపులో అక్రమంగా నిషేధిత మందులు కొనుగోలు చేశాడని ఆరోపిస్తున్న ఒక వృద్ధుడిని కూడా ఆయన తన వెంట తీసుకెళ్లారు. షాపులో డ్రగ్స్ అమ్మకాల తీరును ప్రశ్నిస్తూ యజమానిని నిలదీయడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చెలరేగింది.
లైవ్‌లోనే సవాలు.. క్షణాల్లో తూటా పేలుడు
ఈ మొత్తం ఘటనను జోతా తన మొబైల్ ద్వారా ఫేస్‌బుక్‌లో లైవ్ స్ట్రీమింగ్ చేస్తుండగానే పరిస్థితి ఒక్కసారిగా చేయి దాటింది. ఆగ్రహంతో ఊగిపోయిన మెడికల్ షాప్ యజమాని అశ్వనీ కుమార్ అకస్మాత్తుగా తుపాకీ బయటకు తీశాడు. పిస్టల్ చూసినప్పటికీ ఏమాత్రం వెనక్కి తగ్గని జోతా, దమ్ముంటే కాల్చు అంటూ అతడికి పలుమార్లు సవాలు విసిరాడు. దీంతో మరింత రెచ్చిపోయిన నిందితుడు అశ్వనీ కుమార్.. జోతాపై విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో జోతా పొట్ట , తొడ భాగంలోకి బుల్లెట్లు దూసుకెళ్లగా, ఒక బుల్లెట్ నేరుగా కాలేయాన్ని చీల్చివేయడంతో ఆయన అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ఈ దారుణకాండలో జోవాతో పాటు ఉన్న మరో సహచరుడికి కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ఆసుపత్రికి తరలింపు.. పరారీలో నిందితుడు
రక్తపు మడుగులో పడిపోయిన పర్విందర్ సింగ్ జోతాను వెంటనే స్థానికులు మాన్సా సివిల్ ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధ్రువీకరించారు. హత్యకు పాల్పడిన వెంటనే నిందితుడు అశ్వనీ కుమార్ ఘటనా స్థలం నుంచి పరారయ్యాడు. నిందితుడిని పట్టుకునేందుకు రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. పరారీలో ఉన్న అశ్వనీ కుమార్‌పై ఇప్పటికే పలు క్రిమినల్ కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. డ్రగ్స్‌కు వ్యతిరేకంగా గళం వినిపించిన ఒక సామాజిక కార్యకర్త నడిరోడ్డుపై ఇలా ప్రాణాలు కోల్పోవడం పంజాబ్‌లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా , శాంతిభద్రతల స్థితిగతులపై తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తోంది.




