Lottery Winner: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సామాన్యడు.. కూతురు పుట్టిన మరుసటి రోజే రూ.1.5 కోట్ల లాటరీ

Lottery Winner: పంజాబ్‌లోని మాన్సా జిల్లాకు చెందిన సామాన్య కార్పెంటర్ యుధ్‌వీర్ సింగ్‌ను ఆడబిడ్డ పుట్టిన 24 గంటల్లోనే అదృష్టం వరించింది.

Gagan kumar
Published on: 13 Nov 2026 12:46 PM IST
Lottery Winner
X

Lottery Winner: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన సామాన్యడు.. కూతురు పుట్టిన మరుసటి రోజే రూ.1.5 కోట్ల లాటరీ

Baby Girl Brings Luck: ఆడపిల్ల పుడితే సాక్షాత్తు మహాలక్ష్మి ఇంటికి వచ్చిందని పెద్దలు అంటుంటారు. పంజాబ్‌కు చెందిన ఒక సామాన్య కార్పెంటర్ కుటుంబంలో ఈ మాట అక్షరాలా నిజమైంది. పండంటి ఆడబిడ్డ జన్మించిన కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఆ తండ్రిని అదృష్టం తలుపు తట్టింది. ఏకంగా కోటి యాభై లక్షల రూపాయల బంపర్ లాటరీ తగలడంతో, నిన్నటి వరకు అప్పుల బాధతో సతమతమవుతున్న ఆ కుటుంబం రాత్రికి రాత్రే కోటీశ్వరులైంది.

పంజాబ్‌లోని మాన్సా జిల్లా బరేటా పట్టణానికి చెందిన ఇరవై నాలుగేళ్ల యుధ్‌వీర్ సింగ్ వడ్రంగి పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. రోజువారీ సంపాదనతో కుటుంబ పోషణ సాగిస్తూనే, మరోవైపు ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పుల భారాన్ని మోస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఈ క్రమంలో నవంబర్ నాలుగో తేదీన తన గర్భిణి భార్య హర్మన్ కౌర్‌ను సాధారణ వైద్య పరీక్షల కోసం ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో దారిలో ఒక లాటరీ దుకాణం కనిపించడంతో, తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని యుధ్‌వీర్ భావించాడు. అప్పటికే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని, లాటరీ టికెట్ వద్దని భార్య వారించినప్పటికీ, అతడు వినలేదు. జీవితంలో మొదటిసారిగా తన భార్య పేరు మీద రెండు వందల రూపాయలు వెచ్చించి పంజాబ్ స్టేట్ డియర్ మంత్లీ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు.

విధి రాత ఎంత విచిత్రమైనదో చూడండి.. నవంబర్ ఆరో తేదీన హర్మన్ కౌర్ పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఇంటికి వారసురాలు వచ్చిందన్న ఆనందంలో ఆ కుటుంబం మునిగితేలుతుండగానే, మరుసటి రోజే అంటే నవంబర్ ఏడో తేదీన లాటరీ ఫలితాలు విడుదలయ్యాయి. యుధ్‌వీర్ కొనుగోలు చేసిన టికెట్‌కు మొదటి బహుమతిగా కోటి యాభై లక్షల రూపాయలు తగిలినట్లు నిర్వాహకులు ప్రకటించారు. చిన్నారి పుట్టిన ఇరవై నాలుగు గంటలు కూడా గడవకముందే ఇంతటి భారీ విజయం వరించడంతో ఆ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. తమ ఇంటికి అడుగుపెట్టిన చిన్నారే ఈ అదృష్టాన్ని మోసుకొచ్చిందని భావించిన ఆ తల్లిదండ్రులు, ఎంతో మురిపెంగా తమ పాపకు 'బర్కత్' అని పేరు పెట్టుకున్నారు. బర్కత్ అంటే ఆశీర్వాదం లేదా సంపద అని అర్థం.

ఈ ఊహించని అదృష్టంపై యుధ్‌వీర్ సింగ్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు. తాము పీకల్లోతు కష్టాల్లో ఉన్న సమయంలో, దేవుడు తమ కూతురి రూపంలో ఈ సహాయాన్ని అందించాడని కన్నీటి పర్యంతమయ్యాడు. లాటరీ ద్వారా వచ్చిన ఈ డబ్బుతో ముందుగా ఇంటి నిర్మాణం కోసం చేసిన అప్పులన్నింటినీ తీర్చేస్తానని తెలిపాడు. మిగిలిన మొత్తాన్ని తన గారాలపట్టి బర్కత్ ఉన్నత చదువుల కోసం, ఆమె ఉజ్వల భవిష్యత్తు కోసం బ్యాంకులో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేస్తానని ఆ తండ్రి ఎంతో బాధ్యతగా వివరించాడు. నిజంగానే ఆ చిన్నారి తన తల్లిదండ్రుల జీవితాల్లో వెలుగులు నింపే మహాలక్ష్మిగా మారింది.

Gagan kumar

Gagan kumar

2014లో జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్‌లలో సబ్-ఎడిటర్‌గా పని చేశాను. డిజిటల్‌ రంగాల్లో 11 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, నేషనల్ అండ్ ఇంటర్నేషనల్, పాలిటిక్స్ , వైరల్ న్యూస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను. ముఖ్యంగా బిజినెస్, స్పోర్ట్స్, మూవీస్, బ్రేకింగ్ న్యూస్ రాయడంలో నైపుణ్యం ఉంది.