PM Modi: ప్రపంచవ్యాప్తంగా యోగాకు ఆదరణ.. భారత్ చొరవే కారణం: ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
PM Modi: భారత్ చొరవతోనే నేడు ప్రపంచవ్యాప్తంగా యోగా పాపులర్ అయిందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
PM Modi: భారతదేశం తీసుకున్న చొరవ వల్లే నేడు ప్రపంచవ్యాప్తంగా యోగాకు విశేష ఆదరణ లభించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. శుక్రవారం బెంగళూరులోని స్వామి వివేకానంద యోగా అనుసంధాన్ సంస్థాన్ (S-VYASA) స్వర్ణోత్సవాల సందర్భంగా ప్రశాంతి కుటీరంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా S-VYASAలో గోల్డెన్ జూబ్లీ బ్లాక్ భవనానికి, అలాగే కేరళలో సంస్థ ఏర్పాటు చేయనున్న సరికొత్త క్యాంపస్‌కు ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారు.
విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు తనకు ఎదురైన అనుభవాలను ప్రధాని మోదీ ఈ వేదికపై పంచుకున్నారు. "భారత్ చొరవతోనే ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం నిర్వహిస్తున్నారు. నేను ఏ దేశానికి వెళ్లినా.. అక్కడ లంచ్ లేదా డిన్నర్ సమయంలో జరిగే చర్చల్లో చాలా మంది నా వద్ద యోగా ప్రస్తావన తీసుకొస్తారు" అని మోదీ వెల్లడించారు. అనేక దేశాల్లోని రాజకుటుంబాలు కూడా యోగా వ్యాప్తి కోసం కృషి చేశాయని ఆయన కొనియాడారు. భారతదేశ సంస్కృతిని, ఆత్మను అర్థం చేసుకోవడానికి యోగా ఒక అద్భుతమైన మార్గమని ఆయన అభివర్ణించారు.
బెంగళూరు నగరంలో తనకు అద్భుతమైన యోగాను ఆస్వాదించే అవకాశం లభించిందని ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. కర్ణాటక గడ్డపై ఎందరో గొప్ప యోగా గురువులు ఉన్నారని గుర్తుచేశారు. కన్నడ కంఠీరవ, దివంగత సినీ నటుడు రాజ్‌కుమార్ కూడా క్రమం తప్పకుండా యోగా సాధన చేసేవారని ప్రధాని ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావించారు.




