PM Modi Birthday: ప్రధాని మోదీకి సుదర్శన్ పట్నాయక్ వినూత్న కానుక.. 2500 దీపాలతో భారీ సైకత శిల్పం!

PM Modi Birthday: ప్రధాని నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజు సందర్భంగా పూరీ బీచ్‌లో పద్మశ్రీ సుదర్శన్ పట్నాయక్ 2500 దీపాలతో భారీ సైకత శిల్పం.

Arun Chilukuri
Published on: 17 Sept 2026 11:39 AM IST
PM Modi Birthday
X

PM Modi Birthday: ప్రధాని మోదీకి సుదర్శన్ పట్నాయక్ వినూత్న కానుక.. 2500 దీపాలతో భారీ సైకత శిల్పం!

PM Modi Birthday: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 76వ పుట్టినరోజును పురస్కరించుకుని దేశవ్యాప్తంగా వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ప్రఖ్యాత సైకత శిల్పి, పద్మశ్రీ అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్ ఒడిశాలోని పూరీ బీచ్‌లో ఒక అద్భుతమైన భారీ కళాకృతిని రూపొందించారు. ప్రధాని సేవలకు ప్రతీకగా తీర్చిదిద్దిన ఈ సైకత శిల్పం ప్రస్తుతం సర్వత్రా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

పూరీ సముద్ర తీరంలో సుమారు 25 అడుగుల పొడవుతో ఈ సైకత (ఇసుక) శిల్పాన్ని తీర్చిదిద్దారు. భారత త్రివర్ణ పతాకం నేపథ్యంలో ప్రధాని మోదీ ముఖచిత్రాన్ని అత్యంత అందంగా మలచి, దాని చుట్టూ 2500 మట్టి దీపాలను (ప్రమిదలు) వెలిగించి వినూత్నంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సుదర్శన్ సాండ్ ఆర్ట్ ఇన్‌స్టిట్యూట్ విద్యార్థుల సహాయంతో ఈ బృహత్తర కార్యాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు సుదర్శన్ పట్నాయక్ వెల్లడించారు.

ఈ అద్భుతమైన సైకత శిల్పానికి "ఆశీర్వాద్ కా దియా.. 25 ఇయర్స్ ఆఫ్ సేవా.. హ్యాపీ బర్త్‌డే మోదీ జీ" అని నామకరణం చేశారు. ఈ శిల్పం వెనుక ఉన్న ప్రత్యేకతను వివరిస్తూ.. 25 అడుగుల పొడవు అనేది ప్రధాని మోదీ గత 25 ఏళ్లుగా దేశానికి అందిస్తున్న నిరంతర ప్రజా సేవకు ప్రతీక అని సుదర్శన్ పట్నాయక్ పేర్కొన్నారు. అలాగే, అమర్చిన 2500 దీపాలు దేశ ప్రజల ప్రార్థనలు, ఆశీస్సులు, శుభాకాంక్షలకు చిహ్నమని తెలిపారు. ప్రధాని మోదీ సంపూర్ణ ఆరోగ్యంతో, ఆనందంగా, దీర్ఘాయుష్షుతో వర్ధిల్లాలని పూరీ జగన్నాథ స్వామిని ప్రార్థించినట్లు ఆయన పేర్కొన్నారు.

ప్రధాని మోదీ పుట్టినరోజును పురస్కరించుకుని పూరీ తీరంలో చేపట్టిన ఈ కళాకృతిని వీక్షించేందుకు పర్యాటకులు, స్థానికులు పెద్ద సంఖ్యలో బీచ్‌కు తరలివచ్చారు. ఇదే తీరంలో మరో సైకత శిల్పి మానస్ కుమార్ సాహూ కూడా ప్రధాని మోదీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ మరో ప్రత్యేక కళాకృతిని రూపొందించారు. దేశంలోని ఇటీవలి జాతీయ కార్యక్రమాలు, పరిణామాలను ప్రతిబింబించేలా ఆయన తన శిల్పాన్ని తీర్చిదిద్దారు. ప్రస్తుతం ఇరు శిల్పాలు దేశవ్యాప్తంగా నెటిజన్లను, విశేషంగా ఆకర్షిస్తున్నాయి.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.