PM Modi: గత ప్రభుత్వాలు గిరిజనులను అర్థం చేసుకోలేదు, వారిని పట్టించుకోలేదు!
PM Modi: గిరిజన సముదాయాల సంక్షేవాన్ని విస్మరించిన గతం నాటి ప్రభుత్వాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.
PM Modi: గత ప్రభుత్వాలు గిరిజనులను అర్థం చేసుకోలేదు, వారిని పట్టించుకోలేదు!
PM Modi: గిరిజన సముదాయాల సంక్షేవాన్ని విస్మరించిన గతం నాటి ప్రభుత్వాలపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఆదివాసీల హక్కులను కాలరాసేలా గతంలో తెచ్చిన నిబంధనలను తమ ప్రభుత్వం రద్దు చేసిందని, వారికి అటవీ వనరులపై పూర్తి హక్కులు కల్పించామని ప్రధాని స్పష్టం చేశారు. గిరిజన స్వాతంత్ర్య సమరయోధుడు భగవాన్ బిర్సా ముండా 151వ జయంతిని పురస్కరించుకుని మహారాష్ట్రలోని గడ్చిరోలిలో నిర్వహించిన 'జనజాతీయ గౌరవ్ దివస్' వేడుకల్లో ప్రధాని మోడీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. నవంబర్ 1 నుంచి 15 వరకు నిర్వహించిన 'జనజాతీయ గౌరవ్ పక్షోత్సవాలు' ఈ కార్యక్రమంతో ముగిశాయి.
వెదురు చట్టాలపై ప్రధాని కీలక వ్యాఖ్యలు
ఈ సందర్భంగా గుజరాత్ భరూచ్ జిల్లాకు చెందిన లబ్ధిదారుడు వజీర్‌తో ప్రధాని ముచ్చటించారు. కొత్త గుజరాత్ ప్యాటర్న్ యోజన కింద వెదురు పనుల్లో శిక్షణ పొందినట్లు వజీర్ ప్రధానికి తెలిపారు. దీనిపై స్పందించిన ప్రధాని మోడీ.. గత ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని ఎత్తిచూపారు. బ్రిటిష్ కాలంలో వెదురును 'చెట్టు'గా వర్గీకరించి, దానిని నరికితే జైలు శిక్ష విధించేలా కుట్ర పన్నారని, స్వాతంత్ర్యం వచ్చిన వెంటనే ఈ నిబంధనను రద్దు చేసి ఉండాల్సిందని ప్రధాని అభిప్రాయపడ్డారు. కానీ, నాటి ప్రభుత్వాలకు గిరిజనుల గురించి అవగాహన లేకపోవడంతో పాటు వారి సమస్యలను పట్టించుకోలేదని విమర్శించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆ అడ్డంకులను తొలగించి, గిరిజనులకు వెదురుపై పూర్తి హక్కులు కల్పించిందని తెలిపారు.
అనుభవాలు పంచుకున్న లబ్ధిదారులు
ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుంచి వచ్చిన లబ్ధిదారులు తమ అనుభవాలను ప్రధానితో పంచుకున్నారు. మహారాష్ట్ర యవత్మాల్ జిల్లాకు చెందిన కృష్ణ నాగోరావు టెకా మాట్లాడుతూ.. పీఎం-జన్‌మన్ (PM-JANMAN) పథకం ద్వారా తమకు ఇల్లు, మరుగుదొడ్డి వంటి వసతులు సమకూరాయని, అంతకుముందు వర్షాలు, కీటకాలతో పడిన ఇబ్బందులు తొలగిపోయాయని ఆనందం వ్యక్తం చేశారు. అలాగే హైదరాబాద్‌కు చెందిన సబావత్ అన్వేష్ మాట్లాడుతూ.. పీఎం శ్రీ పాఠశాలల (PM SHRI Schools) ద్వారా విద్యార్థులకు మెరుగైన విద్య అందుతోందని ప్రధానికి కృతజ్ఞతలు తెలిపారు. సాంస్కృతిక వారసత్వాన్ని కాపాడుకుంటూనే గ్రామాలు అభివృద్ధి చెందాలని లబ్ధిదారులు అభిప్రాయపడ్డారు.
రూ. 3,000 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శ్రీకారం
గిరిజన విద్య, వైద్యం, జీవనోపాధి , మౌలిక వసతుల కల్పన కోసం దాదాపు రూ. 3,000 కోట్ల వ్యయంతో చేపట్టనున్న 246 అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోడీ ఈ సందర్భంగా ప్రారంభించారు , శంకుస్థాపనలు చేశారు. ఇందులో భాగంగా 38 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశालలు, పీఎం-జన్‌మన్ కింద నిర్మించిన 100 మల్టీ-పర్పస్ కేంద్రాలతో సహా మొత్తం 173 ప్రాజెక్టులను ఆయన ప్రారంభించారు. అలాగే ఇటానగర్‌లో ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ భవనం, ఐజ్వాల్‌లో రోపుయిలియాని గిరిజన స్వాతంత్ర్య సమరయోధుల మ్యూజియంలను జాతికి అంకితం చేశారు. అదనంగా మరో 19 ఏకలవ్య పాఠశాలలు, 12 గిరిజన బహుళ ప్రయోజన మార్కెటింగ్ కేంద్రాలకు ప్రధాని శంకుస్థాపన చేశారు.




