Viral Video: రైలు కిటికీలోంచి ఫోన్ లాక్కోబోయాడు.. ప్రయాణికులు ఏం చేశారంటే?!
Viral Video: బిహార్లో కదులుతున్న రైలు కిటికీకి వేలాడిన ఫోన్ దొంగ. భాగల్పుర్లో ఫోన్ లాక్కునే యత్నంలో ప్రయాణికులకు చిక్కిన వ్యక్తి, నెట్టింట వీడియో వైరల్.
Viral Video: రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సెల్ఫోన్లు కొట్టేసే దొంగలకు ఊహించని రీతిలో బుద్ధి చెప్పారు కొందరు రైలు ప్రయాణికులు. రైలు బయలుదేరుతున్న సమయంలో కిటికీలోంచి ఫోన్ లాక్కునేందుకు ప్రయత్నించిన ఓ చోరుడిని ప్రయాణికులు సాహసంతో పట్టుకున్నారు. రైలు వేగం పుంజుకుంటున్నా అతడి చేతులను గట్టిగా పట్టుకోవడంతో.. ఆ దొంగ విలవిలలాడుతూ కిటికీ బయట వేలాడుతూ ప్రయాణించాల్సి వచ్చింది. బిహార్లో జరిగిన ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.
బిహార్లోని భాగల్పుర్ జిల్లా శివనారాయణ్పుర్ రైల్వేస్టేషన్లో ఈ ఘటన చోటుచేసుకుంది. రైలు ప్లాట్ఫాం వదిలి నెమ్మదిగా కదులుతున్న సమయంలో ఒక వ్యక్తి కిటికీ దగ్గర కూర్చున్న ప్రయాణికుడి చేతిలోని ఫోన్ లాక్కోవడానికి ట్రై చేశాడు. గమనించిన ప్రయాణికులు వెంటనే అలర్ట్ అయి, అతడిని తప్పించుకోనివ్వకుండా లోపలి నుంచి రెండు చేతులను గట్టిగా పట్టుకున్నారు.
రైలు వేగం పుంజుకుంటున్నా ప్రయాణికులు అతడిని వదల్లేదు. దీంతో తప్పించుకునే మార్గం లేక సదరు దొంగ "వదిలేయండి.. వదిలేయండి" అని అరుస్తూ కిటికీ బయట నుంచి వేలాడుతూ కొంతదూరం వెళ్లాడు. రైలు కొంతదూరం వెళ్లాక పట్టుతప్పి ఆ వ్యక్తి ప్లాట్ఫాంపై పడిపోయాడు. వెంటనే అక్కడే ఉన్న రైల్వే భద్రతా సిబ్బంది (RPF) అతడిని అదుపులోకి తీసుకున్నారు.
రైల్వే స్టేషన్లలో రైళ్లు ఆగినప్పుడు, ప్లాట్ఫాం వదిలి బయలుదేరుతున్న సమయంలో ఇలాంటి స్నాచర్ల ఆగడాలు పెరిగిపోతుండటంపై ప్రయాణికులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని అధికారులను కోరుతున్నారు.




