నితీష్ సేతు ప్రారంభంపై బిహార్‌లో రగడ.. పేరు మార్పుపై ఆర్జేడీ, ఆప్ ఆగ్రహం
Nitish Setu Bridge: ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 21న 9.76 కిలోమీటర్ల పొడవైన నితీష్ సేతును ప్రారంభించిన నేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది.
నితీష్ సేతు ప్రారంభంపై బిహార్‌లో రగడ.. పేరు మార్పుపై ఆర్జేడీ, ఆప్ ఆగ్రహం
Nitish Setu Bridge: ప్రధాని నరేంద్ర మోదీ నవంబర్ 21న 9.76 కిలోమీటర్ల పొడవైన నితీష్ సేతును ప్రారంభించిన నేపథ్యంలో బిహార్ రాజకీయాల్లో పెద్ద దుమారం రేగింది. సుమారు రూ. 4,280 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ఆరు లేన్ల వంతెన కచ్చి దర్గాను బిదుపూర్‌తో కలుపుతుంది. ఉత్తర, దక్షిణ బిహార్ మధ్య ప్రయాణాన్ని సులభతరం చేయడంతో పాటు మహాత్మా గాంధీ సేతుపై ట్రాఫిక్ రద్దీని తగ్గిస్తుందని భావిస్తున్నారు. అయితే ఈ వేడుక సందర్భంగా సుమారు 40 నిమిషాల పాటు ఆందోళనలు, గందరగోళం కొనసాగడంతో బీజేపీ, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
పోస్టర్ల గొడవ.. విపక్షాలపై బీజేపీ కౌంటర్
ప్రభుత్వం అభివృద్ధి పనులు చేస్తుంటే, ఆర్జేడీ కావాలనే గొడవలు చేస్తూ కార్యక్రమానికి ఆటంకం కలిగిస్తోందని బీజేపీ అధికార ప్రతినిధి నీరజ్ కుమార్ శర్మ మండిపడ్డారు. తేజస్వీ యాదవ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ, బిహార్ ప్రజలకు పోస్టర్లు చించే రాజకీయాలు కాదని, వంతెనలు, అభివృద్ధి కావాలని చురకలంటించారు.
నకిలీ కార్యక్రమమన్న సుధాకర్ సింగ్.. నితీష్‌పై ఆరోపణలు
నిరసనను సమర్థించిన ఆర్జేడీ ఎంపీ సుధాకర్ సింగ్ ఆదివారం మాట్లాడుతూ, ఈ వంతెనను ఇప్పటికే ప్రారంభించారని, కేవలం పేరు మార్చడం కోసమే మరో వేడుక పెట్టి కోట్ల రూపాయలు ఖర్చు చేశారని విమర్శించారు. పోస్టర్లు, బ్యానర్లను మోసపూరితంగా పెట్టారని ఆరోపించారు. తేజస్వీ యాదవ్ విజన్ వల్లే ఈ వంతెన నిర్మితమైందని చెబుతూ, తన కుమారుడిని తోసేసి, ఇబ్బంది పెట్టడంతోనే ఇబ్బందికర పరిస్థితి తప్పించుకోవడానికి నితీష్ కుమార్ ఈ కార్యక్రమానికి రాలేదని ఆరోపించారు. ఇది నకిలీ కార్యక్రమమని, ఇలాంటి వేడుకకు మా నేత ఎందుకు వెళ్లాలని ప్రశ్నించారు.
గురు గోవింద్ సింగ్ పేరు ఎందుకు పెట్టలేదు? తేజస్వీ ప్రశ్న
సిక్కుల పదో గురువు గురు గోవింద్ సింగ్ పేరు కాకుండా నితీష్ కుమార్ పేరు పెట్టడంపై ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. గతంలో బిహార్ అసెంబ్లీలో గురు గోవింద్ సింగ్ పేరు ప్రతిపాదిస్తూ తాను ప్రైవేట్ మెంబర్ తీర్మానం ప్రవేశపెట్టానని, రాజకీయ కారణాలతోనే ప్రభుత్వం మాట మార్చిందని ఆరోపించారు. ప్రధానికి నిజంగా ఆయన్ను గౌరవించాలని ఉంటే ఏదైనా కేంద్ర పథకానికో లేదా తాజ్‌పూర్–భక్తియార్‌పూర్ ఫోర్ లేన్ ప్రాజెక్టుకో ఆయన పేరు పెట్టొచ్చని సూచించారు. ఈ నిర్ణయం నితీష్ జీ రాజకీయ వారసత్వాన్ని సజీవంగా సమాధి చేసే ప్రయత్నమని వ్యాఖ్యానించారు. 18 నెలల క్రితమే నితీష్ ఈ వంతెనను ప్రారంభించారని, ఈ నిర్మాణానికి కేంద్రం గానీ, ప్రధాని గానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని తేజస్వీ సవాల్ చేశారు.
పంజాబ్‌లోనూ ఆప్ నేతల నిరసనలు
వంతెన పేరు మార్పు వివాదంపై పంజాబ్‌లోని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) నేతలు కూడా విమర్శలు గుప్పించారు. గురు గోవింద్ సింగ్‌కు గౌరవం ఇచ్చే ప్రతిపాదన నుంచి బిహార్ ప్రభుత్వం వెనక్కి తగ్గడం ఆమోదయోగ్యం కాదని పంజాబ్ మంత్రి హర్పాల్ సింగ్ చీమా అన్నారు. అసెంబ్లీలో ఈ ప్రతిపాదన గురించి ముందే చెప్పారని, నితీష్ కుమార్‌ను గౌరవించాలనుకుంటే వేరే మార్గాలు ఎన్నో ఉన్నాయని, కానీ గురు గోవింద్ సింగ్ ప్రతిపాదనను పక్కన పెట్టడం బాధాకరమని పేర్కొన్నారు. ప్రజా డిమాండ్ మేరకు నామకరణ ప్రక్రియ మొదలైందని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్ సింగ్ సంధ్వాన్ విమర్శించగా, తఖ్త్ శ్రీ పట్నా సాహిబ్‌కు దగ్గరగా ఉన్న ఈ వంతెనకు అలా పేరు పెట్టడం సిక్కుల మనోభావాలను దెబ్బతీయడమేనని ఆప్ ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ధాలివాల్ అన్నారు.




