Supriya Sule: డీలిమిటేషన్‌ బిల్లుతో బిగ్ ట్విస్ట్‌.. సుప్రియా సూలేకు కేంద్ర మంత్రి పదవి?

Supriya Sule: డీలిమిటేషన్ బిల్లుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (ఎస్పీ) మద్దతు సంకేతాలివ్వడంతో దిల్లీ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.

Arun Chilukuri
Published on: 28 Nov 2026 11:26 AM IST
Supriya Sule
X

Supriya Sule: డీలిమిటేషన్‌ బిల్లుతో బిగ్ ట్విస్ట్‌.. సుప్రియా సూలేకు కేంద్ర మంత్రి పదవి?

Supriya Sule: పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల తేదీ సమీపిస్తున్న కొద్దీ దేశ రాజధాని దిల్లీలో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్)తో ముడిపడిన మహిళా రిజర్వేషన్ల బిల్లుకు మద్దతు ఇచ్చే విషయంలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్‌సీపీ (ఎస్పీ) నుంచి సానుకూల సంకేతాలు వెలువడటం ఎన్డీఏ కూటమికి కలిసొచ్చే అంశంగా మారింది. ఈ మద్దతుకు ప్రతిఫలంగా శరద్ పవార్ కుమార్తె, బారామతి ఎంపీ సుప్రియా సూలేను కేంద్ర క్యాబినెట్‌లోకి తీసుకునే అవకాశం ఉందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇదే జరిగితే మహారాష్ట్రలో ఇండియా కూటమి మరింత బలహీనపడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఎన్‌సీపీ (ఎస్పీ) వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్న సుప్రియా సూలే ఇటీవల ఇండియా కూటమి చేపట్టిన ఆందోళనల్లో చురుగ్గా పాల్గొన్నారు. అయితే, డీలిమిటేషన్ బిల్లు విషయంలో ఆమె కేంద్రానికి అనుకూల సంకేతాలిస్తుండటం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈ ఒప్పందంలో భాగంగా కేంద్ర మంత్రివర్గంలో స్థానంతో పాటు మహారాష్ట్ర ప్రభుత్వంలో ఆర్థిక శాఖ సహా రెండు కీలక పోర్టుఫోలియోలను ఎన్‌సీపీ (ఎస్పీ) ఆశిస్తున్నట్లు సమాచారం. రాష్ట్ర మంత్రి పదవి రేసులో జయంత్ పాటిల్ పేరు వినిపిస్తోంది.

డీలిమిటేషన్ బిల్లును ఇండియా కూటమి వ్యతిరేకిస్తుండగా.. బిల్లు ముసాయిదా కాపీని పూర్తిగా పరిశీలించాకే తమ తుది వైఖరి వెల్లడిస్తామని సుప్రియా సూలే ఇటీవల పేర్కొన్నారు. తన తండ్రి శరద్ పవార్ అనారోగ్యం కారణంగా శనివారం జరిగే ఇండియా కూటమి సమావేశానికి కూడా ఆమె హాజరుకావడం లేదు. సోమవారం (నవంబర్ 30) నేరుగా దిల్లీ వెళ్లి పార్లమెంట్ చర్చల్లో పాల్గొననున్నారు. లోక్‌సభలో ఎన్‌సీపీ (ఎస్పీ)కి 8 మంది ఎంపీల బలం ఉండటంతో ఆ పార్టీ నిర్ణయం కీలకంగా మారింది.

మరోవైపు, తమ పార్టీలో మరోసారి చీలిక రాకుండా నివారించడానికే బిల్లుకు మద్దతివ్వడం కీలకమని శరద్ పవార్ స్వయంగా కాంగ్రెస్ నాయకత్వానికి వివరించినట్లు ఎన్‌సీపీ (ఎస్పీ) వర్గాలు తెలిపాయి. జనాభా పెరుగుదలకు అనుగుణంగా నియోజకవర్గాల సంఖ్య పెంచడం రాజ్యాంగబద్ధమైన అవసరమని పవార్ అభిప్రాయపడినట్లు ఆ పార్టీ నేత జితేంద్ర అవ్వాద్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల్లో సమానంగా 50 శాతం సీట్లు పెంచుతామని కొత్త బిల్లులో పేర్కొనడం కూడా ఆ పార్టీ అభ్యంతరాలను తొలగించింది.

ఎన్‌సీపీ (ఎస్పీ) మారుతున్న వైఖరిపై కాంగ్రెస్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గతంలో శరద్ పవార్ రాజ్యసభకు ఎన్నికయ్యేందుకు తమ పార్టీతో పాటు ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని శివసేన (యూబీటీ) తమ సీటును త్యాగం చేసి మద్దతు ఇచ్చాయని మహారాష్ట్ర కాంగ్రెస్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా గుర్తుచేసింది. "కానీ, ఇప్పుడు ఏమవుతోంది..?" అంటూ ఎన్‌సీపీ (ఎస్పీ) నిర్ణయాన్ని పరోక్షంగా ప్రశ్నించింది.

Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.