Nagula Chavithi: నాగారాధన వెనుక అంతర్ధానం.? సంతాన భాగ్యం కోసం నాగుల చవితి పూజలు ఎందుకు చేస్తారంటే.?

Nagula Chavithi: కార్తీక శుద్ధ చవితి అయిన ఇవాళ (నవంబర్ 13) తెలుగు రాష్ట్రాల్లో మహిళలు పుట్టలు, దేవాలయాల్లోని నాగ ప్రతిమలను పూజించి సంతాన భాగ్యం, సర్ప దోష నివారణ కోరుకుంటారు.

Ravi
By Ravi
Published on: 13 Nov 2026 12:19 PM IST
Nagula Chavithi
X

Nagula Chavithi: నాగారాధన వెనుక అంతర్ధానం.? సంతాన భాగ్యం కోసం నాగుల చవితి పూజలు ఎందుకు చేస్తారంటే.?

Nagula Chavithi: కార్తీక మాసంలో వచ్చే తొలి పండుగ నాగుల చవితి. ఈసారి ఇది నవంబర్ 13, శుక్రవారం నాడు వచ్చింది. ఇవాళ మహిళలు పుట్టలు, దేవాలయాల్లోని నాగ ప్రతిమలను పూజిస్తారు. పుట్టలో ఆవు పాలు పోసి, పసుపు, కుంకుమను సమర్పిస్తారు. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం, రావి-వేప చెట్ల కింద నాగ ప్రతిమలను పూజిస్తే సర్ప దోషాలు తొలగిపోతాయని, సంతాన భాగ్యం కలుగుతుందని, ఆయురారోగ్యాలు, సుఖశాంతులు చేకూరుతాయని భక్తుల నమ్మకం. ఇవాళ సుబ్రహ్మణ్యాష్టకం, భుజంగ స్తోత్రం చదవాలి.

కార్తీక శుక్ల చవితి తిథి నవంబర్ 12 సాయంత్రం 6:09కి మొదలై, నవంబర్ 13 రాత్రి 8:42కి ముగుస్తుంది. కాబట్టి శుక్రవారం ఉదయం పూజకు అనుకూలమని పంచాంగాలు చెబుతున్నాయి. పూజా ముహూర్తం కొన్ని పంచాంగాల ప్రకారం ఉదయం 11:01 నుంచి మధ్యాహ్నం 1:10 వరకు, మరికొన్నింటి ప్రకారం 11:15 నుంచి 1:30 వరకు ఉంటుంది. ఈ సమయాలు నగరాన్ని బట్టి మారతాయి. కాబట్టి స్థానిక పంచాంగం చూసుకోవాలి.

ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో పాము ఒకటి. ఈ జీవులు గాలిని ఆహారంగా తీసుకొని ఎక్కువ కాలం జీవిస్తాయని ప్రజల విశ్వాసం. విషసర్పాలను పూజిస్తే భయం ఉండదని ప్రజల నమ్మకం. ఈ నమ్మకమే నాగారాధనకు కారణమని సంప్రదాయ నిపుణులు చెబుతున్నారు. కార్తీక మాసం శుక్లపక్ష చవితి రోజున జరుపుకునే నాగులచవితికి మన సంప్రదాయంలో విశేషమైన స్థానం ఉంది. నాగులచవితి ఆచార విశిష్టత, నాగారాధన వెనుక ఉన్న అంతరార్థం నేటి పరమార్థంలో.

నాగారాధనకు శివుడితో ప్రత్యేక అనుబంధం ఉందని పురాణ కథనం. శివుడి మెడలో వాసుకి సర్పం ఆభరణంగా ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామిని కూడా సర్ప స్వరూపంగా కొలుస్తారు. అందుకే చాలా చోట్ల పుట్టలు, నాగేంద్ర విగ్రహాల దగ్గరే సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ఉంటాయి. ఈ రోజు సంతానం కోసం కోరుకునే మహిళలు ఉపవాసం చేసి సర్పదేవతను పూజిస్తారు.

పూజా సామగ్రిలో నాగ ప్రతిమ లేదా చిత్రం, పసుపు, కుంకుమ, తాజా పూలు, ఆవు పాలు, అరటిపండ్లు, ఇతర పండ్లు, చందనం, అగరుబత్తీలు, నెయ్యి లేదా నూనె దీపం, కర్పూరం ఉంటాయి. ఉదయమే స్నానం చేసి, ఇంటి దగ్గర లేదా దేవాలయంలో నాగ ప్రతిమకు పాలు, పసుపు, కుంకుమ సమర్పించి దీపం వెలిగిస్తారు. పాముల పట్ల గౌరవంతో జీవ వైవిధ్యాన్ని కాపాడాలన్న భావం కూడా ఈ ఆచారంలో ఉందని భక్తులు భావిస్తారు.

Ravi

Ravi

2017లో వెబ్ జర్నలిస్ట్‌గా నా కెరీర్ ప్రారంభించాను. పలు వెబ్‌సైట్స్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశాను. డిజిటల్ మీడియాలో 7 ఏళ్ళకుపైగా అనుభవం ఉంది. ట్రెండింగ్, బిజినెస్, ఆంధ్రప్రదేశ్ & తెలంగాణకు సంబంధించి బ్రేకింగ్ కంటెంట్ రాస్తుంటాను.