Mumbai: ఆరో అంతస్తు నుంచి పసికందును కిందకు తోసేసిన బాలిక.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు!
Mumbai: ముంబయిలోని గోరెగావ్లో దారుణం. 10 ఏళ్ల బాలిక 18 నెలల చిన్నారిని 6వ అంతస్తు నుంచి కిందకు తోసేసి హత్య. సీసీటీవీలో రికార్డైన దృశ్యాలు, పోలీసుల అదుపులో నిందితురాలు.
Mumbai: ఆరో అంతస్తు నుంచి పసికందును కిందకు తోసేసిన బాలిక.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు!
Mumbai: మహారాష్ట్రలోని ముంబయిలో అత్యంత దిగ్భ్రాంతికరమైన ఘటన చోటుచేసుకుంది. కేవలం 10 ఏళ్ల బాలిక చేసిన అరాచకానికి 18 నెలల నిండు ప్రాణం బలైంది. పిల్లి విషయంలో తలెత్తిన వివాదం కారణంగా ఆ చిన్నారిని ఆరో అంతస్తు నుంచి కిందకు తోసేయడంతో పసిబిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ముంబయిలోని గోరెగావ్ ప్రాంతంలో జరిగిన ఈ భయానక ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
ముంబయి గోరెగావ్లోని ఓ నివాస సముదాయంలో నివసిస్తున్న 10 ఏళ్ల బాలిక, బుధవారం రాత్రి సమయంలో 18 నెలల చిన్నారిని బలవంతంగా ఎత్తుకెళ్లి ఆరో అంతస్తుకు తీసుకెళ్లింది. అక్కడ నుంచి పసిబిడ్డను కిందకు తోసేసింది.
తొలుత ఈ ఘటనను అందరూ ప్రమాదంగా భావించారు. అయితే అపార్ట్మెంట్లో పిల్లల రక్షణ కోసం ఏర్పాటు చేసిన రెయిలింగ్స్ ఎత్తు చాలా ఎక్కువగా ఉండటంతో అనుమానం వచ్చిన పోలీసులు సీసీటీవీ కెమెరాలను పరిశీలించారు. చిన్నారిని కింద పడేసిన తర్వాత ఆ బాలిక వేగంగా మెట్లపై నుంచి క్రిందికి పరుగెత్తుకుంటూ వెళ్లిన దృశ్యాలు అందులో స్పష్టంగా రికార్డయ్యాయి.
తమ బిడ్డ కనిపించక వెతుకుతున్న బాధిత కుటుంబ సభ్యులకు చిన్నారి రక్తపు మడుగులో కనిపించడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. తలకు తీవ్ర గాయాలు కావడంతో మార్గమధ్యలోనే చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.
ఇరు కుటుంబాల మధ్య ‘పిల్లి’ విషయంలో చిన్నపాటి గొడవ జరిగినట్లు పోలీసుల విచారణలో తేలింది. అంతేకాకుండా ఆ బాలిక కొంతకాలంగా మానసిక సమస్యలతో బాధపడుతున్నట్లు కూడా సమాచారం.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. బాలికను, ఆమె తల్లిని అదుపులోకి తీసుకున్నారు. నిందితురాలు మైనర్ కావడంతో బాలల సంక్షేమ అధికారుల పర్యవేక్షణలో తదుపరి విచారణ జరుపుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ అమానుష ఘటనతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది.




