Maharashtra: కుక్క పిల్లను చంపిన చిరుత.. ప్రతీకారం తీర్చుకున్న తల్లి కుక్క!
Maharashtra: మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఉదయం కుక్క పిల్లను చిరుత చంపగా, సాయంత్రానికి తల్లి కుక్క ఏడాది వయసున్న చిరుత పిల్లపై దాడి చేసి చంపేసింది.
Maharashtra: కుక్క పిల్లను చంపిన చిరుత.. ప్రతీకారం తీర్చుకున్న తల్లి కుక్క!
Maharashtra: జంతువులకు కూడా మనుషుల్లాగే పగ, ప్రతీకారాలు ఉంటాయా? మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో జరిగిన ఒక వింత ఘటన అవుననే సమాధానం చెబుతోంది. తన కళ్లముందే తన పిల్లను చిరుత చంపేసిందన్న కసితో, ఒక తల్లి కుక్క కొద్ది గంటల వ్యవధిలోనే ఏడాది వయసున్న చిరుత పిల్లపై దాడి చేసి ప్రాణాలు తీసింది. ఈ ఆసక్తికరమైన, ఒకింత భయానకమైన ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
బీడ్ జిల్లాలో అడవికి సమీపంలో ఉన్న దవులావడ్గావ్ గ్రామంలో సోమవారం ఉదయం ఒక చిరుతపులి చొరబడి, అక్కడ ఉన్న ఒక కుక్క పిల్లను చంపేసింది. అయితే, సరిగ్గా అదే రోజు సాయంత్రం 3.30 గంటల సమయంలో అదే ప్రాంతంలో ఆ తల్లి కుక్క ఒక ఏడాది వయసున్న చిరుత పిల్లపై ఒక్కసారిగా దాడికి దిగింది. తల్లి కుక్క చేసిన తీవ్రమైన దాడిలో గాయపడిన ఆ చిరుత పిల్ల అక్కడికక్కడే మృతి చెందింది.
తన బిడ్డను చంపినందుకు తల్లి కుక్క తీర్చుకున్న ప్రతీకార చర్యే ఇదని గ్రామస్థులు చర్చించుకుంటున్నారు. మరోవైపు, తమ పిల్ల మృతి చెందడంతో తల్లి చిరుత గ్రామంపై దాడి చేస్తుందేమోనని స్థానికులు భయాందోళనలకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న అటవీ శాఖ అధికారులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించారు. చనిపోయిన చిరుత పిల్ల కళేబరం పడి ఉన్న ప్రదేశానికి కొద్ది దూరంలోనే కుక్క పిల్ల మృతదేహాన్ని కూడా స్వాధీనం చేసుకున్నామని అధికారులు తెలిపారు. ఈ ఘటన వెనుక ఉన్న అసలు కారణాలను నిగ్గు తేల్చేందుకు అటవీ అధికారులు దర్యాప్తు చేపట్టారు.




