క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి షమీ?.. బీజేపీ చీఫ్‌తో కీలక భేటీ

Mohammed Shami: భారత క్రికెటర్ మహ్మద్ షమీ ఆదివారం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిశారు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన..

G Krishna
Published on: 29 Nov 2026 5:06 PM IST
Mohammed Shami
X

క్రికెట్ నుంచి రాజకీయాల్లోకి షమీ?.. బీజేపీ చీఫ్‌తో కీలక భేటీ

Mohammed Shami: భారత క్రికెటర్ మహ్మద్ షమీ ఆదివారం న్యూఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబిన్‌ను కలిశారు. టెస్ట్ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించిన కొద్ది వారాలకే ఈ భేటీ జరగడంతో, ఆయన రాజకీయ అరంగేట్రంపై జోరుగా ఊహాగానాలు మొదలయ్యాయి. నితిన్ నబిన్‌తో షమీ జరిగిన సమావేశంలో బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షుడు కున్వర్ బాసిత్ అలీ కూడా పాల్గొన్నారు. అయితే వీరి మధ్య జరిగిన చర్చలకు సంబంధించిన వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఇటీవల భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ బీజేపీలో చేరిన వారం రోజుల వ్యవధిలోనే షమీ ఈ భేటీ చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. పార్టీ తన ఓబీసీ మోర్చా జాతీయ కార్యవర్గంలో ప్రత్యేక ఆహ్వానితుడిగా చాహల్‌ను నియమించింది.

గతంలోనూ రాజకీయ నేతలతో సమావేశాలు

రాజకీయ నేతలతో మహ్మద్ షమీ సమావేశం కావడం ఇదే తొలిసారి కాదు. గత సెప్టెంబర్‌లో కేంద్ర మంత్రి, రాష్ట్రీయ లోక్‌దళ్ (ఆర్ఎల్‌డీ) అధినేత జయంత్ చౌదరితో ఆయన భేటీ అవ్వడం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు పలు ఊహాగానాలకు తావిచ్చింది. అయితే అమ్రోహాలో క్రీడా సదుపాయాల కోసం నిధులు కేటాయించినందుకు జయంత్ చౌదరికి కృతజ్ఞతలు తెలిపేందుకే షమీ వెళ్లారని ఆర్ఎల్‌డీ అప్పట్లో వివరణ ఇచ్చింది.

టెస్ట్‌లకు వీడ్కోలు.. వైట్ బాల్ క్రికెట్‌పై దృష్టి

36 ఏళ్ల మహ్మద్ షమీ చివరిసారిగా 2025 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై భారత్ తరఫున ఆడారు. నవంబర్ 6న టెస్ట్ క్రికెట్‌కు ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు. 64 టెస్ట్ మ్యాచ్‌లలో 229 వికెట్లు తీసిన షమీ, తన చివరి టెస్ట్‌ను 2023 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లో ఆస్ట్రేలియాపై ఆడారు. టెస్ట్‌ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించినప్పటికీ, టీ20లు, వన్డేల వంటి వైట్ బాల్ క్రికెట్‌లో మాత్రం కొనసాగుతానని షమీ స్పష్టం చేశారు. దేశవాళీ క్రికెట్‌లో బెంగాల్‌కు, ఐపీఎల్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నారు.

G Krishna

G Krishna

అక్షరంతో మొదలైన ప్రయాణం.. అంకెల్లో చెప్పాలంటే పదేళ్ల అనుభవం..! 2015లో కెరీర్ స్టార్ట్ చేసి, ప్రింట్ మీడియా నుంచి డిజిటల్ విప్లవం వరకు అన్నిటినీ దగ్గరగా చూశాను. అంతర్జాతీయ పరిణామాల నుంచి దేశ రాజధాని రాజకీయాల వరకు, గల్లీ స్థాయి వార్తల నుంచి ఢిల్లీ స్థాయి విశ్లేషణల వరకు ప్రతి అంశాన్ని లోతుగా అధ్యయనం చేస్తూ కథనాలు అందించాను. టెక్నాలజీ స్పీడ్, బిజినెస్ లెక్కలైనా, ఆస్ట్రాలజీ విశ్లేషణ ఏదైనా.. నా నుంచి వచ్చే ప్రతి కథనం ప్రతి వార్త పాఠకుడికి ఇన్ఫర్మేషన్‌తో పాటు ఇంట్రెస్ట్‌ను కూడా అందిస్తుంది.