Milk Prices: నాలుగేళ్లలో లీటర్ పాలపై రూ.18 వరకు పెంపు.. పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

Milk Prices: గత నాలుగేళ్లలో అమూల్, మదర్ డెయిరీ పాల ధరలు లీటర్‌పై రూ.18 నుంచి రూ.19 వరకు పెరిగాయి.

Mokshith
Published on: 13 Nov 2026 2:25 PM IST
Milk Prices
X

Milk Prices: నాలుగేళ్లలో లీటర్ పాలపై రూ.18 వరకు పెంపు.. పాల ధరలు ఎందుకు పెరుగుతున్నాయి?

Milk Prices: గత నాలుగేళ్లలో అమూల్, మదర్ డెయిరీ పాల ధరలు లీటర్‌పై రూ.18 నుంచి రూ.19 వరకు పెరిగాయి. 2026 నవంబర్ 12న మరోసారి రూ.2 నుంచి రూ.4 వరకు ధరలు పెంచడంతో ఫుల్ క్రీమ్ పాలు లీటర్ ధర రూ.76కు చేరింది. ఇంత‌కీ పాల ధ‌ర‌లు ఇంత‌లా ఎందుకు పెరుగుతున్నాయి.

అమూల్, మదర్ డెయిరీ పాల ధరలు ఎందుకు పెంచాయి?

అమూల్, మదర్ డెయిరీ సంస్థలు నవంబర్ 12 నుంచి కొత్త ధరలను అమల్లోకి తీసుకొచ్చాయి. అమూల్ తన టోన్డ్ మిల్క్ (తాజా) ధరను లీటర్‌పై రూ.2, గోల్డ్ పాల ధరను రూ.4 పెంచింది. మదర్ డెయిరీ కూడా వివిధ రకాల పాల ధరలను రూ.2 నుంచి రూ.4 వరకు పెంచింది. పాల ధరల పెరుగుదలకు ప్రధాన కారణం ఉత్పత్తి ఖర్చులు ఎక్కువ కావడమేనని కంపెనీలు చెబుతున్నాయి. పశువులకు వేసే పచ్చి గడ్డి, ఎండు గడ్డి ధరలు పెరిగాయి. మొక్కజొన్న, తవుడు, నూనెగింజల పిండి, బెల్లం వంటి పశువుల దాణా ధరలు కూడా పెరిగాయి. దీంతో పశువులను పెంచే రైతులపై ఆర్థిక భారం పెరిగింది.

అంతేకాకుండా పాల ప్యాకెట్ల తయారీకి ఉపయోగించే ప్లాస్టిక్ కవర్లు, ఇంధనం, రవాణా ఖర్చులు కూడా పెరిగాయి. అమూల్ తెలిపిన వివరాల ప్రకారం.. గత ఏడాది కాలంలో రైతుల నుంచి పాలు కొనుగోలు చేసే ధరను దాని సభ్య పాల సంఘాలు 4 నుంచి 5 శాతం పెంచాయి. మదర్ డెయిరీ ప్రకారం.. కొన్ని ప్రాంతాల్లో పచ్చి, ఎండు గడ్డి ధరలు 20 శాతం వరకు, పశువుల దాణా ఖర్చులు సుమారు 10 శాతం పెరిగాయి. ఈ అదనపు ఖర్చుల ప్రభావం చివరకు వినియోగదారులపై పడుతోంది.

దేశంలో పాల ఉత్పత్తి తగ్గుతోందా?

పాల ధరలు పెరగడానికి ఉత్పత్తి, సరఫరాలో ఏర్పడుతున్న ఒత్తిడి కూడా ఒక కారణం. అయితే భారత ప్రభుత్వ గణాంకాల ప్రకారం దేశంలో పాల ఉత్పత్తి తగ్గడం లేదు. ప్రతి ఏడాది క్రమంగా పెరుగుతోంది. కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ శాఖ గణాంకాల ప్రకారం.. 2023-24లో దేశంలో 23.93 కోట్ల టన్నుల పాలు ఉత్పత్తి అయ్యాయి. 2024-25లో ఈ ఉత్పత్తి 24.787 కోట్ల టన్నులకు చేరింది. అంటే ఒక్క ఏడాదిలోనే పాల ఉత్పత్తి 3.58 శాతం పెరిగింది.

మరోవైపు అమెరికా వ్యవసాయ శాఖ (USDA) 2026 అక్టోబర్ నివేదిక ప్రకారం.. 2026లో భారత్‌లో పాల ఉత్పత్తి 22.2 కోట్ల టన్నులుగా ఉండవచ్చని అంచనా వేసింది. 2027లో ఇది 22.65 కోట్ల టన్నులకు చేరవచ్చని పేర్కొంది. అయితే ఇవి అమెరికా సంస్థ అంచనాలు మాత్రమే. భారత ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక గణాంకాలు కావు.

అంటే పాల ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, పెరుగుతున్న అవసరాలకు అనుగుణంగా సరఫరా ఉండటం కూడా ముఖ్యమే. ఉత్పత్తి ఖర్చులు పెరగడం, ప్రాంతాల వారీగా పాల లభ్యతలో తేడాలు ఉండటం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.

వాతావరణ మార్పులు, పశువుల మేత ధరల ప్రభావం

పశువులు ఇచ్చే పాల పరిమాణం వాటి ఆరోగ్యం, ఆహారం, వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. పశువులకు సరైన మోతాదులో పచ్చి గడ్డి, ఎండు గడ్డి, పోషకాలు కలిగిన దాణా అందకపోతే పాల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా వర్షాలు సరిగ్గా కురవకపోవడం, కొన్ని ప్రాంతాల్లో కరువు పరిస్థితులు ఏర్పడటం వల్ల పశువుల మేత కొరత ఏర్పడుతోంది. దీనివల్ల రైతులు బయట మార్కెట్ల నుంచి మేత కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఫలితంగా పశువుల పెంపకం ఖర్చు పెరుగుతోంది. అమూల్ తెలిపిన వివరాల ప్రకారం.. గుజరాత్‌తో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం తక్కువగా, అసమానంగా ఉండటంతో పశువుల మేత లభ్యతపై ప్రభావం పడింది. దీంతో పశుపోషకుల ఖర్చులు పెరిగాయి. మరోవైపు వేసవి తీవ్రత, అధిక ఉష్ణోగ్రతలు కూడా పశువులపై ప్రభావం చూపుతాయి. వేడి కారణంగా పశువులు తీసుకునే ఆహారం తగ్గి, పాల దిగుబడి తగ్గే అవకాశం ఉంటుంది. ఈ పరిస్థితులన్నీ కలిపి పాల ఉత్పత్తి వ్యయాన్ని పెంచుతున్నాయి.

పెరుగుతున్న పాల డిమాండ్.. రైతుల నుంచి వినియోగదారుల వరకు ప్రభావం

భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తి, వినియోగ దేశం. ఇక్కడ పాలను నేరుగా తాగడమే కాకుండా పెరుగు, పన్నీర్, నెయ్యి, వెన్న, స్వీట్లు వంటి అనేక ఆహార పదార్థాల తయారీలో ఉపయోగిస్తున్నారు. జనాభా పెరుగుదల, పట్టణీకరణ, ప్రజల ఆదాయాలు పెరగడం వల్ల పాలతో పాటు పాల ఉత్పత్తులకు డిమాండ్ కూడా పెరుగుతోంది.

USDA నివేదిక ప్రకారం.. 2026లో భారత్‌లో దేశీయ పాల వినియోగం సుమారు 22.19 కోట్ల టన్నులుగా ఉండవచ్చని అంచనా. ఇందులో దాదాపు 9.3 కోట్ల టన్నుల పాలను నేరుగా తాగడానికి, 12.9 కోట్ల టన్నుల పాలను పరిశ్రమల్లో వివిధ పాల ఉత్పత్తుల తయారీకి ఉపయోగించే అవకాశం ఉంది. అంటే పాలకు అన్ని రంగాల నుంచి భారీగా డిమాండ్ ఉంది. ఉత్పత్తి పెరుగుతున్నప్పటికీ, డిమాండ్ కూడా అదే స్థాయిలో లేదా అంతకంటే వేగంగా పెరిగితే ధరలపై ఒత్తిడి ఏర్పడుతుంది.

ఇక పాల ధరల పెరుగుదల వల్ల వినియోగదారులపైనే కాకుండా పశుపోషకులపైనా ప్రభావం ఉంటుంది. అమూల్ సహకార విధానంలో వినియోగదారుల నుంచి వచ్చే ఆదాయంలో సుమారు 80 శాతం వాటా 36 లక్షల మంది పాల ఉత్పత్తిదారులకు చేరుతుందని సంస్థ చెబుతోంది. మదర్ డెయిరీ కూడా తన అమ్మకాల ఆదాయంలో సగటున 75 నుంచి 80 శాతం మొత్తాన్ని రైతుల నుంచి పాలు కొనుగోలు చేయడానికి ఖర్చు చేస్తోంది.

భారత్‌లో సుమారు 95 శాతం మంది పాల ఉత్పత్తిదారుల వద్ద ఒకటి నుంచి ఐదు పశువులు మాత్రమే ఉన్నాయి. వీరికి మేత, దాణా, పశువుల సంరక్షణ ఖర్చులు పెరిగితే ఆ ప్రభావం నేరుగా వారి ఆదాయంపై పడుతుంది. అందుకే రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు పాల ఉత్పత్తి ఖర్చులను తగ్గించాల్సిన అవసరం ఉంది.

మొత్తంగా చూస్తే.. పాల ధరల పెరుగుదలకు కంపెనీల లాభాలే కారణం కాదు. పశువుల మేత ధరలు, రైతులకు చెల్లించే కొనుగోలు ధరలు, ప్యాకేజింగ్, రవాణా ఖర్చులు, పెరుగుతున్న వినియోగం వంటి అంశాలు ప్రభావం చూపుతున్నాయి. పశువుల ఉత్పాదకత పెంచడం, మేత కొరతను తగ్గించడం, ఉత్పత్తి వ్యయాన్ని నియంత్రించడం ద్వారా మాత్రమే భవిష్యత్తులో పాల ధరలకు కళ్లెం వేయడం సాధ్యమవుతుంది.

Mokshith

Mokshith

2015లో జ‌ర్న‌లిజం స్కూల్ ద్వారా నా కెరీర్‌ను ప్రారంభించాను. అనంత‌రం 2016 నుంచి ప‌లు మీడియా సంస్థ‌ల్లో ప‌నిచేశాను. మొద‌ట ప్రింట్ ఆ త‌ర్వాత డిజిట‌ల్‌లో క‌లిపి మొత్తం 10 ఏళ్ల అనుభ‌వం ఉంది. నేను ఎక్కువ‌గా లైఫ్‌స్టైల్‌, అంత‌ర్జాతీయం, టెక్నాల‌జీ, బిజినెస్‌, ఆస్ట్రాల‌జీకి సంబంధించి వార్త‌లు రాస్తుంటాను.