బ్లూ డ్రమ్ కేసులో సంచలన తీర్పు.. భార్య, ప్రియుడికి ఉరిశిక్ష.!
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘బ్లూ డ్రమ్ హత్యోదంతం’ కేసులో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్
Meerut Blue Drum Murder Case
దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ‘బ్లూ డ్రమ్ హత్యోదంతం’ కేసులో న్యాయస్థానం చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. మర్చెంట్ నేవీ ఆఫీసర్ సౌరభ్ రాజ్‌పుత్ భయానక హత్య కేసుకు సంబంధించి మీరట్ జిల్లా కోర్టు సంచలన తీర్పును ప్రకటించింది. ఈ కేసులో ప్రధాన దోషులుగా తేలిన మృతుడి భార్య ముస్కాన్ రస్తోగి , ఆమె ప్రియుడు సాహిల్ శుక్లాకు జిల్లా కోర్టు జడ్జి అరవింద్ కుమార్ మిశ్రా మరణశిక్ష ఖరారు చేశారు. ఈ హై-ప్రొఫైల్ కేసులో ఇద్దరు దోషులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ఎదుట హాజరుకాగా, తీర్పు వెలువడిన క్షణాల నుంచి కోర్టు ప్రాంగణంలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది.
అత్యంత క్రూరమైన నేరం.. శాశ్వత గుణపాఠం కావాలి
గత ఏడాది మార్చిలో మీరట్‌లోని బ్రహ్మపురి పోలీస్ స్టేషన్ పరిధిలోని వారి నివాసంలో ఒక నీలిరంగు ప్లాస్టిక్ డ్రమ్ లోపల సౌరభ్ రాజ్‌పుత్ శవం కుళ్ళిన స్థితిలో దొరకడం అప్పట్లో దేశవ్యాప్తంగా వణికించింది. ఈ సంచలన కేసుపై సుమారు 16 నెలల పాటు సుదీర్ఘంగా సాగిన విచారణలో మొత్తం 126 సార్లు వాయిదాలు పడ్డాయి. ప్రాసిక్యూషన్ తరఫున 22 మంది కీలక సాక్షులను కోర్టు ముందు ప్రవేశపెట్టారు. ఈ హత్య అత్యంత కిరాతకంగా, ముందస్తు పథకం ప్రకారం జరిగిందని, ఇలాంటి అమానుష ఘటనలు సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతాయని కోర్టు తీవ్రంగా స్పష్టం చేసింది. నేరస్థులకు పడే ఈ శిక్ష భవిష్యత్తులో సమాజానికి ఒక గట్టి హెచ్చరికలా నిలవాలని న్యాయమూర్తి అభిప్రాయపడ్డారు. హత్యతో పాటు సాక్ష్యాలను తారుమారు చేసిన నేరం కింద వీరిద్దరినీ దోషులుగా నిర్ధారించారు.
జైలులో ఉక్కిరిబిక్కిరి.. భోజనం కూడా మానేసిన దోషులు
కోర్టు ఉరిశిక్షను ఖరారు చేయడంతో ముస్కాన్, సాహిల్ తీవ్ర మానసిక ఒత్తిడికి లోనయ్యారు. తీర్పు వచ్చిన నాటి నుంచి ఇద్దరూ తీవ్ర నిరాశతో భోజనం చేయడం కూడా పూర్తిగా మానేశారు. ఎవరితోనూ మాట్లాడకుండా సెల్లో ఒంటరిగా గడుపుతున్న వీరి కదలికలపై జైలు అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా నిరంతరం నిఘా ఉంచారు. జైలు రికార్డుల ప్రకారం.. ముస్కాన్‌ను పరామర్శించడానికి ఎవరూ రాకపోగా, సాహిల్‌ను మాత్రం అతని నానా , సోదరుడు వచ్చి కలిశారు. గతంలో ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే ముస్కాన్, ఇప్పుడు పూర్తిగా మౌనంగా ఉండిపోవడం గమనార్హం.
అసలు ఏం జరిగింది? షాకింగ్ డీటెయిల్స్
ప్రాసిక్యూషన్ , పోలీసుల దర్యాప్తులో విస్మయకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. 2025 మార్చి 3న ముస్కాన్ తన ప్రియుడు సాహిల్ శుక్లాతో కలిసి భర్త సౌరభ్ రాజ్‌పుత్‌ను పక్కా ప్లాన్‌తో అంతమొందించింది. ముందుగా అతనికి మత్తుమందు ఇచ్చి అపస్మారక స్థితిలోకి వెళ్లాక, దారుణంగా నరికి ముక్కలు చేశారు. ఆ శకలాలను ఒక నీలిరంగు డ్రమ్‌లో కుక్కి, ఎవరికీ అనుమానం రాకుండా పైన సిమెంట్‌తో గట్టిగా సీలు వేశారు. అంతటితో ఆగకుండా, భర్తను హతమార్చిన ఆనందంలో ఇద్దరూ కలిసి నేరుగా షిమ్లా ట్రిప్‌కు వెళ్లి ఎంజాయ్ చేసి వచ్చారు. ఈ దారుణం బయటపడటంతో పోలీసులు ఇద్దరినీ అరెస్ట్ చేసి కటకటాల వెనక్కి నెట్టారు.
మాకు పూర్తి న్యాయం దక్కింది.. మృతుడి తల్లి ఎమోషనల్
కోర్టు తీర్పు వెలువడిన అనంతరం మృతుడు సౌరభ్ రాజ్‌పుత్ తల్లి రేణు దేవి మీడియాతో మాట్లాడుతూ భావోద్వేగానికి లోనయ్యారు. తన కొడుకును పొట్టనబెట్టుకున్న హంతకులకు కోర్టు మరణశిక్ష విధించడం ద్వారా తమకు పూర్తి న్యాయం జరిగిందని, తన కడుపుకోతకు కొంతైనా ఊరట లభించిందని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. ఈ కేసులో మొదటి నుంచి అండగా నిలిచిన న్యాయవాదులు, పోలీసులు , మీడియాకు ఆమె హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సంచలనం సృష్టించిన బ్లూ డ్రమ్ మర్డర్ మిస్టరీకి ఈ ఉరిశిక్షతో చట్టపరంగా ఒక బలమైన ముగింపు లభించింది.




